Manual cars : మాన్యువల్ కార్లు.. మెదడుకు అదిరిపోయే వర్కౌట్లు! పరిశోధనలో ఆసక్తికర విషయాలు..
Automatic vs Manual transmission : ఆటోమేటిక్ కార్ల హవా పెరుగుతున్న నేటి కాలంలో మాన్యువల్ (గేర్) కార్లు నడపడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడానికి ఈ డ్రైవింగ్ స్టైల్ ఎలా సహాయపడుతుందో ఇక్కడ తెలుసుకోండి..
నేటి ఆధునిక కాలంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (గేర్లు మార్చాల్సిన అవసరం లేని) కార్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. నగరాల్లోని విపరీతమైన ట్రాఫిక్‌లో ప్రయాణించే వారు క్లచ్, గేర్ మార్చే తలనొప్పి లేకుండా హాయిగా ఆటోమేటిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇప్పటికీ కార్ డ్రైవింగ్‌ను మనస్ఫూర్తిగా ఆస్వాదించే 'పెట్రోల్‌హెడ్స్' (ఆటోమొబైల్ ప్రేమికులు) మాత్రం మాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న కార్లనే ఇష్టపడతారు. ఒకవేళ మీరు కూడా మాన్యువల్ కార్లనే అమితంగా ఇష్టపడే వారైతే.. మీకో అద్భుతమైన వార్త! మాన్యువల్ కారు నడపడం కేవలం ఒక డ్రైవింగ్ అనుభూతి మాత్రమే కాదు, అది మీ మెదడుకు ప్రతిరోజూ ఇచ్చే ఒక బెస్ట్ వర్కౌట్ అని శాస్త్రవేత్తలు తేల్చారు.

జపాన్‌కు చెందిన తోహోకు యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్, ఏజింగ్ అండ్ క్యాన్సర్ విభాగంలో న్యూరోఇమేజింగ్ పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్ ర్యూటా కవాషిమా నేతృత్వంలోని బృందం ఓ సరికొత్త అధ్యయనాన్ని వెల్లడించింది. మాన్యువల్ గేర్ కారును నడపడం వల్ల మానవ మెదడులోని ‘ప్రీఫ్రంటల్ కార్టెక్స్’ అనే భాగం విపరీతంగా ఉత్తేజితమవుతుందని ఈ పరిశోధనలో తేలింది.
విశేషమేమిటంటే, ఆటోమేటిక్ కార్లను నడిపే వారిలో ఈ స్థాయి మెదడు యాక్టివిటీ కనిపించలేదు!
మెదడుకు రోజూ వ్యాయామం..
మాన్యువల్ కారు నడిపేటప్పుడు డ్రైవర్ కేవలం స్టీరింగ్ తిప్పడం మాత్రమే చేయడు.. రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనాల వేగాన్ని గమనించడం, దానికి తగ్గట్టుగా ఎడమ కాలితో క్లచ్ నొక్కడం, ఎడమ చేత్తో గేర్ మార్చడం, కుడి కాలితో యాక్సిలరేటర్ (థొరాటిల్) అదుపు చేయడం.. ఇవన్నీ ఒకే సమయంలో (మల్టీ టాస్కింగ్) చేయాల్సి ఉంటుంది.
"ఈ శారీరక, మానసిక కోఆర్డినేషన్ కోసం మెదడు క్షణం కూడా విశ్రాంతి లేకుండా అప్రమత్తంగా ఉండాలి. మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ భాగమే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, తక్షణ నిర్ణయాలు తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది. మాన్యువల్ కారు నడపడం వల్ల ఈ భాగానికి నిరంతరం తక్కువ స్థాయి వర్కౌట్ లభిస్తుంది," అని ప్రొఫెసర్ కవాషిమా వివరించారు.
రోజూ ఈ విధంగా మెదడుకు పని పెట్టడం వల్ల వయసు పైబడటం వల్ల వచ్చే మతిమరుపు వంటి సమస్యలు దరిచేరవని, న్యూరల్ నెట్‌వర్క్ చాలా బలంగా తయారవుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఆటోమేటిక్ లేదా సెల్ఫ్-డ్రైవింగ్ కార్లలో కూర్చుని ప్రయాణించే వారికి ఈ మెదడు వ్యాయామం అస్సలు దొరకదు.
కనుమరుగవుతున్న 'స్టిక్ షిఫ్ట్'.. మన దేశంలో పరిస్థితి ఏంటి?
మెదడు ఆరోగ్యానికి మాన్యువల్ కార్లు ఎంతో మేలు చేస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఇవి అంతరించిపోతున్న జాబితాలోకి చేరుతున్నాయి. అయితే భారతదేశంలో మాత్రం ఇప్పటికీ మాన్యువల్ కార్ల హవా నడుస్తోంది.
మన దేశంలో మొత్తం కార్ల అమ్మకాలలో దాదాపు 55 నుంచి 60 శాతం మార్కెట్ వాటా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కార్లదే కావడం విశేషం. ఆటోమేటిక్ కార్లతో పోలిస్తే వీటి తక్కువ ధర, హైవేలపై ఇచ్చే అద్భుతమైన మైలేజ్, గ్రామీణ మార్కెట్లలో వీటికి ఉన్న నమ్మకమే ఇందుకు ప్రధాన కారణం. అయినప్పటికీ హైదరాబాద్, ముంబై, బెంగళూరు, దిల్లీ వంటి మెట్రో నగరాల్లో భారీ ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా ప్రతి మూడు కొత్త కార్లలో ఒకటి ఆటోమేటిక్ కారే ఉంటోంది. నగరాల్లో ఆటోమేటిక్ కార్ల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి.
చివరగా చెప్పేదేంటంటే, మీరు ట్రాఫిక్ తలనొప్పి భరించలేక ఆటోమేటిక్ కారు కొంటే తప్పులేదు కానీ, మీ గ్యారేజీలో ఉన్న పాత మాన్యువల్ కారును మాత్రం తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే అది మీ మెదడును నిత్యం యవ్వనంగా ఉంచే ఒక అద్భుతమైన మెషిన్!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


