Electric cars : మహీంద్రా క్రేజీ లైనప్- బీఈ 07, థార్ ఈవీ లాంచ్, రేంజ్ విశేషాలు..
భారత ఈవీ విపణిలో స్వదేశీ దిగ్గజం మహీంద్రా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ను అధిగమించి రెండో స్థానానికి చేరిన మహీంద్రా.. 2027-28 నాటికి బీఈ 07, విజన్ టీ (థార్ ఈవీ) మోడళ్లతో మార్కెట్‌ను ఏలేందుకు సిద్ధమైంది.
‘బోర్న్ ఎలక్ట్రిక్’ ఎస్‌యూవీలతో భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తోంది మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్! దేశీయ ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియాను వెనక్కి నెట్టిన మహీంద్రా, ప్రస్తుతం రెండో అతిపెద్ద ఈవీ తయారీదారుగా అవతరించింది. ఈ జోరును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు 2027-28 నాటికి మరో రెండు ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను భారత రహదారులపైకి తెచ్చేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిల్లో ఒకటి థార్ ఎలక్ట్రిక్ వర్షెన్!

పరీక్షల దశలో సంచలన మోడళ్లు..
మహీంద్రా నుంచి రాబోతున్న కొత్త ఈవీ మోడళ్లలో ప్రాముఖ్యమైనది ‘బీఈ 07’. ఇప్పటికే అనేకమార్లు రోడ్ టెస్టింగ్‌లో కనిపించిన ఈ వాహనం ఉత్పత్తి వెర్షన్‌ను త్వరలోనే ఆవిష్కరించనున్నారు. దీనితో పాటు ఐకానిక్ ఆఫ్-రోడర్ థార్ ఎలక్ట్రిక్ రూపానికి ప్రతీకగా నిలిచే ‘విజన్ టీ’ కాన్సెప్ట్ కూడా ప్రస్తుతం రహదారుల పై పరీక్షల దశకు చేరుకుంది.
ఫ్యామిలీ రైడర్ల కోసం మహీంద్రా బీఈ 07..
మహీంద్రా అభివృద్ధి చేసిన ఇంగ్లో స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్‌పై బీఈ 07 రూపుదిద్దుకుంటోంది. బీఈ 06 మోడల్‌లో కనిపించే కూపే తరహా రూఫ్‌లైన్ కాకుండా, కుటుంబ సమేతంగా ప్రయాణించేందుకు వీలుగా నిటారుగా ఉండే సాంప్రదాయ ఎస్‌యూవీ డిజైన్‌ను దీనికి ఇచ్చారు. 2,775 ఎంఎం వీల్‌బేస్ ఉండటం వల్ల క్యాబిన్ లోపల విశాలమైన స్థలం లభిస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో అత్యాధునిక ఫీచర్లను అమర్చారు:
ట్రిపుల్ స్క్రీన్ డాష్‌బోర్డ్: డ్రైవర్ డిస్‌ప్లే, ఇన్ఫోటైన్‌మెంట్, ప్రయాణికుడి వినోదం కోసం మూడు 12.3-అంగుళాల డిజిటల్ స్క్రీన్‌లను జతచేశారు.
లగ్జరీ ఫీచర్లు: పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రేమ్‌లెస్ డోర్లు, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంటాయి.
రక్షణ వ్యవస్థ: ప్రయాణ రక్షణ కోసం అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) సెటప్‌ను అందించారు.
బ్యాటరీ సామర్థ్యం, రేంజ్ వివరాలు..
బీఈ 07 మోడల్‌ను 59 kWh, 70 kWh మరియు 79 kWh అనే మూడు భిన్నమైన బ్యాటరీ ఆప్షన్లతో లభించేలా రూపొందిస్తున్నారు. వెనుక యాక్సిల్‌పై అమర్చిన మోటార్‌తో పాటు, ఆఫ్-రోడ్ ప్రియుల కోసం డ్యూయల్ మోటార్ సెటప్‌ను కూడా అందించనున్నారు. పెద్ద బ్యాటరీ వేరియంట్ ఒకే ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. 175 కేడబ్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే కేవలం 30 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతానికి ఛార్జింగ్ పూర్తవుతుంది.
ఆఫ్ రోడింగ్ కింగ్ థార్ ఈవీ - విజన్ టీ
మహీంద్రా తమ సరికొత్త 'NU_IQ' ప్లాట్‌ఫారమ్‌పై థార్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని రూపురేఖలను ప్రతిబింబించే విజన్ టీ కాన్సెప్ట్ రోడ్లపై సందడి చేస్తోంది. థార్ నుంచి వారసత్వంగా వచ్చిన బాక్సీ షేప్, స్క్వేర్డ్ ఆఫ్ వీల్ అర్చెస్, ఆల్-టెర్రైన్ టైర్లు, బయటివైపు కనిపించే డోర్ హింజెస్ దీనికి గంభీరమైన ఆఫ్-రోడ్ లుక్‌ను ఇస్తున్నాయి.
లోపలి భాగంలో కర్వ్‌డ్ డ్రైవర్ డిస్‌ప్లే, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌లతో పాటు నిత్యం వాడే ఫంక్షన్ల కోసం ఫిజికల్ బటన్లను ఇచ్చారు. కఠినమైన రహదారులను సునాయాసంగా దాటేందుకు వీలుగా అధిక గ్రౌండ్ క్లియరెన్స్, 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో ఈ వాహనం రానుంది.
విపణిలో సరికొత్త పోటీ..
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో కేవలం సాధారణ ఈవీ కార్లకే పరిమితం కాకుండా, అత్యుత్తమ సాంకేతికతతో కూడిన లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీలను తీసుకురావడం ద్వారా మహీంద్రా ఇటు సిటీ ప్రయాణికులను, అటు అడ్వెంచర్ ప్రేమికులను ఒకేసారి ఆకట్టుకునే వ్యూహంతో ముందుకు సాగుతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


