Maruti Suzuki : 2026 మారుతీ సుజుకీ బ్రెజ్జా ఎస్యువీపై బిగ్ అప్డేట్..
2026 మారుతీ సుజుకీ బ్రెజ్జా నుంచి బిగ్ అప్డేట్! ఇందులో 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉండబోతోంది. మారుతీ సుజుకీ కార్లలో 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉండటం ఇదే తొలిసారి.
మారుతీ సుజుకీ తన మోస్ట్ పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ 'బ్రెజ్జా'ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ 2026 బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రోడ్ టెస్టింగ్‌లో కనిపించింది. ఈసారి బయటపడిన వీడియోల్లో ఎస్‌యూవీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన మార్పు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే బ్రెజ్జాలో రాబోతున్న కొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్!

మారుతీ సుజుకీ కార్లలో ఇదే తొలిసారి!
ఇప్పటి వరకు మారుతీ సుజుకీ తన దాదాపు అన్ని పెట్రోల్ కార్లలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను మాత్రమే అందిస్తోంది. కానీ, కొత్త బ్రెజ్జా టెస్ట్ మోడల్‌లో ఉన్న గేర్ లీవర్‌ను గమనిస్తే, అందులో ఆరు గేర్లు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, భారతదేశంలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తున్న మొదటి మారుతీ సుజుకీ కారుగా ఈ బ్రెజ్జా ఎస్యూవీ సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. దీనివల్ల హైవేలపై ప్రయాణం మరింత సాఫీగా ఉండటమే కాకుండా, మైలేజీ కూడా పెరిగే అవకాశం ఉంది.
బూట్ స్పేస్ సమస్యకు చెక్: అండర్ ఫ్లోర్ సీఎన్జీ!
గతంలో వచ్చిన లీకుల ప్రకారం.. మారుతీ సుజుకీ బ్రెజ్జా సీఎన్జీ వేరియంట్‌లో కూడా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. సాధారణంగా సీఎన్జీ కార్లలో సిలిండర్ వల్ల డిక్కీలో సామాన్లు పెట్టుకోవడానికి చోటు తగ్గిపోతుంది. కానీ, మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో మారుతీ 'విక్టోరిస్' మోడల్ తరహాలోనే 'అండర్ ఫ్లోర్ సీఎన్జీ' టెక్నాలజీని వాడుతున్నారు. అంటే గ్యాస్ ట్యాంకును కారు ఫ్లోర్ కింద అమర్చడం వల్ల బూట్ స్పేస్ అనేది వినియోగదారులకు పూర్తిగా అందుబాటులో ఉంటుంది.
మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్- డిజైన్, ఇంటీరియర్ అప్‌డేట్స్..
బయటి నుంచి చూస్తే ఈ 2026 మారుతీ సుజుకీ బ్రెజ్జాపై భారీగా కవర్లు ఉన్నప్పటికీ, కొన్ని మార్పులు స్పష్టంగా తెలుస్తున్నాయి:
కొత్త ఫ్రంట్ లుక్: కారు ముందు భాగంలో సరికొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్ ఉండబోతున్నాయి.
ఎల్ఈడీ లైట్లు: డ్యూయల్ బారెల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ అలాగే ఉన్నా, వెనుక వైపు టెయిల్ లైట్లలో చిన్నపాటి మార్పులు ఉండవచ్చు.
బిగ్ స్క్రీన్: ఇంటీరియర్‌లో ప్రస్తుతం ఉన్న 9 ఇంచ్ స్క్రీన్ స్థానంలో 10.1 ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో ఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చే అవకాశం ఉంది.
లగ్జరీ ఫీచర్లు: టాప్ మోడల్స్‌లో వెన్టిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండవచ్చని సమాచారం.
మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్- ఇంజిన్ సామర్థ్యం..
ప్రస్తుతానికి బ్రెజ్జా ఎస్‌యూవీలో ఉన్న 1.5 లీటర్ కే15 పెట్రోల్ ఇంజిన్‌నే కొత్త దానిలోనూ కొనసాగించవచ్చు. అయితే, 2027 నుంచి అమలులోకి రానున్న కఠినమైన సీఏఎఫ్ఈ 3 ఉద్గార నియమాలను దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను మారుతీ పరిచయం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి, అదిరిపోయే ఫీచర్లు, మెకానికల్ అప్‌డేట్స్‌తో రాబోతున్న ఈ 2026 మారుతీ సుజుకీ బ్రెజ్జా, కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రశ్నలు- సమాధానాలు :-
ప్రశ్న- 2026 మారుతీ సుజుకీ బ్రెజ్జా లాంచ్ ఎప్పుడు?
సమాధానం- మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌పై సంస్థ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ మోడల్ ఈ ఏడాది మే నెలలో లాంచ్ అవుతుందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రశ్న- 2026 మారుతీ సుజుకీ బ్రెజ్జా ధర ఎంత ఉండొచ్చు?
సమాధానం- అంచనాల ప్రకారం ఈ కొత్త మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 8.50లక్షల నుంచి రూ. 14.00 లక్షల వరకు ఉండొచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


