BYD Atto 3 Evo : సింగిల్ ఛార్జ్‌తో 510 కి.మీ రేంజ్- బీవైడీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు..
ప్రముఖ చైనా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ, తన పాపులర్ మోడల్ అట్టో 3కి అప్‌గ్రేడెడ్ వెర్షన్ అయిన 'అట్టో 3 ఎవో'ను ఆవిష్కరించింది. మునుపటి కంటే ఎక్కువ పవర్, వేగవంతమైన ఛార్జింగ్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఈ ఈవీ పవర్‌హౌస్‌లా మారింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ 'బిల్డ్ యువర్ డ్రీమ్స్' (బీవైడీ).. గ్లోబల్ మార్కెట్‌లో తన సరికొత్త మోడల్ ‘అట్టో 3 ఎవో’ను ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి సుపరిచితమైన అట్టో 3 మోడల్‌కు ఇది సంపూర్ణమైన, అత్యాధునికమైన అప్‌డేట్ అని కంపెనీ స్పష్టం చేసింది. ఈ కొత్త వెర్షన్‌లో మరింత పవర్, భారీ బ్యాటరీ సామర్థ్యం, మెరుగైన ఫీచర్లు, వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయం వంటి కీలక మార్పులు చేశారు.

ఈ సందర్భంగా బీవైడీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్టెల్లా లీ మాట్లాడుతూ.. "కేవలం మూడేళ్ల లోపే ఒక బ్రాండ్‌గా మేము ఎంతటి వృద్ధిని సాధించామో చెప్పడానికి 'అట్టో 3 ఎవో' ఒక నిదర్శనం. యూరప్ మార్కెట్‌లో ఇప్పటికే ఆదరణ పొందిన మా ఈవీ ఆవిష్కరణలను, అత్యాధునిక సాంకేతికతను జోడించి ఈ ప్యాకేజీని రూపొందించాం. ఫలితంగా అత్యంత శక్తివంతమైన, సమర్థవంతమైన, ఉపయోగకరమైన ఫీచర్లు కలిగిన అద్భుతమైన కారును వినియోగదారుల ముందుకు తెచ్చాం" అని పేర్కొన్నారు.
మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్: కేవలం 3.9 సెకన్లలోనే 100 కి.మీ వేగం..
సాధారణ అట్టో 3 ఎలక్ట్రిక్ కారు ఫ్రంట్-వీల్-డ్రైవ్ (ఎఫ్‌డబ్ల్యూడీ) మోడల్‌తో పోలిస్తే, 'ఎవో' వెర్షన్ పర్ఫార్మెన్స్ పరంగా భారీ మార్పులు పొందింది. ఇది ఇప్పుడు రియర్-వీల్-డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) ప్లాట్‌ఫారమ్‌కు మారడమే కాకుండా, డ్యూయల్-మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది.
రియర్-డ్రైవ్ వెర్షన్: 309 బీహెచ్పీ పవర్, 510 కి.మీ (డబ్ల్యూఎల్‌పీ) రేంజ్‌ను అందిస్తుంది.
ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్: ఇది ఏకంగా 443 బీహెచ్పీ పవర్‌ను విడుదల చేస్తుంది. దీని వేగం ఎంతంటే, కేవలం 3.9 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
బ్యాటరీ, ఛార్జింగ్: 25 నిమిషాల్లోనే పని పూర్తి!
బీవైడీ అట్టో 3 ఎవోలో 74.8 కేడబ్ల్యూహెచ్ భారీ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. గతంలో ఉన్న 400వీ ఆర్కిటెక్చర్‌ను తొలగించి, ఇప్పుడు శక్తివంతమైన 800వీ ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్‌ను ప్రవేశపెట్టారు. దీనివల్ల 220 కేడబ్ల్యూ వరకు ఫాస్ట్ డీసీ ఛార్జింగ్ సదుపాయం లభిస్తుంది. ఫలితంగా, కేవలం 25 నిమిషాల్లోనే బ్యాటరీని 10 నుంచి 80 శాతానికి ఛార్జ్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా, ఇందులో కొత్తగా 'ఫైవ్-లింక్ రియర్ సస్పెన్షన్' సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. ఇది పాత మోడల్‌లోని ఫోర్-లింక్ సెటప్ స్థానంలో వచ్చింది. దీనివల్ల కారు హ్యాండ్లింగ్ మెరుగుపడటమే కాకుండా, కారు లోపల స్టోరేజ్ స్పేస్ కూడా పెరుగుతుంది.
ఫీచర్లు, భద్రత..
బీవైడీ అట్టో 3 ఎవో ఇంటీరియర్ పరంగా చూస్తే, డిజైన్ దాదాపు పాత దానిలాగే ఉన్నా కొన్ని కీలకమైన మార్పులు చేశారు. స్టీరింగ్ కాలమ్‌పైనే గేర్ సెలెక్టర్‌ను అమర్చారు. 15.6 ఇంచ్ రొటేటింగ్ టచ్‌స్క్రీన్, 8.8 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, వేడిని అందించే హీటెడ్ రియర్ సీట్లు ఇందులో ఉన్నాయి.
భద్రత విషయంలో బీవైడీ ఏమాత్రం తగ్గలేదు. ఇందులో మొత్తం 7 ఎయిర్ బ్యాగులు (డ్రైవర్, ప్యాసింజర్, ఫ్రంట్ సెంటర్, సైడ్, కర్టెన్ ఎయిర్ బ్యాగులు) ఉన్నాయి. వీటితో పాటు:
అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ఏసీసీ)
బ్లైండ్ స్పాట్ డిటెక్షన్
ఫ్రంట్, రియర్ కొలీజన్ వార్నింగ్
లేన్ డిపార్చర్ అసిస్ట్
ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
బీవైడీ అట్టో 3 ఎవో భారత్‌లోకి వస్తుందా?
ప్రస్తుతం భారతదేశంలో బీవైడీ అట్టో 3 ధర రూ. 24.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది 49.92 కేడబ్ల్యూహెచ్, 60.48 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తోంది. అట్టో 3 ఎవో మోడల్ పెద్ద బ్యాటరీ, ఎక్కువ పవర్ కలిగి ఉన్నందున, ఇది భారత్‌కు వస్తే కచ్చితంగా సాధారణ అట్టో 3 కంటే ఎక్కువ ధరకే లభించే అవకాశం ఉంది.
అయితే, ఈ ఎవో వెర్షన్‌ను ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారనే విషయంపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

E-Paper












