Mahindra Thar OG : మహీంద్రా థార్ ఓజీ లాంచ్- ఆఫ్ రోడర్ హైలైట్స్ ఇవే..
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా 3-డోర్ థార్ ఫేస్‌లిఫ్ట్‌ని ‘థార్ ఓజీ’ పేరుతో భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రూ. 10.32 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో వచ్చిన ఈ ఎస్‌యూవీలో పవర్‌ఫుల్ ఇంజిన్లతో పాటు అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లను అందించారు.
భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. తమ ఐకానిక్ 3-డోర్ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ థార్ ఫేస్‌లిఫ్ట్‌ని లాంచ్ చేసింది. ఈ పాపులర్ ఎస్‌యూవీకి ‘మహీంద్రా థార్ ఓజీ’గా నామకరణం చేస్తూ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.32 లక్షలుగా నిర్ణయించగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 18.99 లక్షల వరకు ఉంది. మునుపటి కంటే మరింత శక్తివంతమైన ఇంజిన్, అధునాతన సేఫ్టీ ఫీచర్లు, రీ-డిజైన్ చేసిన ఛాసిస్‌తో ఈ కొత్త వెహికల్ వాహన ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.

మహీంద్రా థార్ ఓజీ- మరిన్ని పవర్‌ఫుల్ ఇంజిన్లు..
కొత్త థార్ ఓజీ మోడల్‌లో ఇంజిన్ పనితీరును గణనీయంగా మెరుగుపరిచారు. ఈ ఎస్‌యూవీ మూడు వేర్వేరు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది:
2.0-లీటర్ టర్బో-పెట్రోల్ (mStallion): ఈ ఇంజిన్ ఇప్పుడు 162 బిహెచ్‌పీ పవర్, 330 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే దీని పవర్ పెరిగింది.
2.2-లీటర్ డీజిల్ (mHawk): ఈ ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచడంతో ఇప్పుడు 152 బీహెచ్‌పీ పవర్, 330 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తోంది.
1.5-లీటర్ డీజిల్ (D140): ఎంట్రీ లెవెల్ మోడల్స్ కోసం ఇచ్చే ఈ ఇంజిన్ 119 బిహెచ్‌పీ పవర్, 300 ఎన్ఎమ్ టార్క్‌తో మార్పులేకుండా కొనసాగుతోంది.
మహీంద్రా థార్ ఓజీ- కొత్త ప్లాట్‌ఫామ్..
ఈ మహీంద్రా థార్ ఓజీని 'M_Glyde 4G' అనే నాలుగో తరం ఫ్రేమ్‌పై డిజైన్ చేశారు. దీనివల్ల కారు స్ట్రక్చరల్ దృఢత్వం బాగా పెరిగింది. ప్రయాణంలో కుదుపులు తగ్గించేందుకు ‘డావిన్సీ డ్యాంపింగ్’తో కూడిన పెంటాలింక్ రియర్ సస్పెన్షన్‌ను అమర్చారు.
డ్రైవింగ్ అనుభవాన్ని మరింత తేలిక చేసేందుకు ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్‌ను ప్రామాణికంగా అందించారు. ఆఫ్‌రోడింగ్ ప్రియుల కోసం సాండ్, స్నో, మడ్ అనే ప్రత్యేక టెర్రైన్ మోడ్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. కారు ట్రాక్ వెడల్పును కూడా 60 ఎంఎం పెంచడం వల్ల హైస్పీడ్ వద్ద వాహనం స్థిరంగా ప్రయాణిస్తుంది.
మహీంద్రా థార్ ఓజీ- అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు..
భద్రత విషయంలో మహీంద్రా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను చేర్చింది. నాలుగు చక్రాలకూ డిస్క్ బ్రేకులు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లతో పాటు అధునాతన 'ఈఎస్పీ 9.3' సేఫ్టీ సిస్టమ్‌ను అందించారు. ఇందులో వెహికల్ డైనమిక్స్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి కీలక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
ఎక్స్‌టీరియర్ పరంగా కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త డిజైన్ కలిగిన బంపర్లు, సీ-షేప్డ్ డీఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్ఈడీ హెడ్‌లాంప్‌లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లను పొందుపరిచారు. టాప్ వేరియంట్లలో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. ఇంటీరియర్ విషయానికి వస్తే, ట్రఫుల్ బ్రౌన్ కలర్ లెదరెట్ సీట్లు, మృదువైన ఆర్మ్‌రెస్ట్‌లు కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.
మహీంద్రా థార్ ఓజీ- వేరియంట్లు, ధరల వివరాలు
మహీంద్రా ఈసారి ఏఎక్స్టీ, ఎల్ఎక్స్టీ వేరియంట్లతో పాటు కొత్తగా 'జెడ్ఎక్స్టీ' అనే టాప్ వేరియంట్‌ను ఈ మహీంద్రా థార్ ఓజీలో పరిచయం చేసింది. జెడ్ఎక్స్టీ వేరియంట్‌లో 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్ సహా 15 అదనపు ఫీచర్లను చేర్చారు.
"థార్ అనేది కేవలం ఎస్‌యూవీ మాత్రమే కాదు, అదొక భావోద్వేగం. థార్ ఓజీ ద్వారా ఈ ఐకాన్‌ను మరింత మెరుగ్గా కస్టమర్ల ముందుకు తెచ్చాం," అని మహీంద్రా ఆటోమోటివ్ విభాగాధిపతులు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ఇంట్రడక్టరీ ధరలు నవంబర్ 30, 2026 వరకు మాత్రమే అమలులో ఉంటాయని సమాచారం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


