...
...
Next Story

Tata Punch : షాకిచ్చిన టాటా మోటార్స్! లాంచ్ అయిన 6 నెలలకే 2026 టాటా పంచ్​ ధర పెంపు- ఎంతంటే..

Tata Punch price : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందుతున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధరలను టాటా మోటార్స్ పెంచింది. పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై గరిష్టంగా రూ.7,000 వరకు పెరిగిన కొత్త ధరల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాము..

Published on: Jul 10, 2026, 06:43:54 IST
Advertisement

మధ్యతరగతి వాహనదారుల కలల కారుగా, భారతీయ రోడ్లపై రారాజుగా దూసుకుపోతున్న మైక్రో ఎస్‌యూవీ ‘టాటా పంచ్’ ధరలు పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ అధికారికంగా ప్రకటించింది. తాజా పెంపుతో టాటా పంచ్ ధరల్లో రూ.5,000 నుంచి రూ.7,000 వరకు మార్పు కనిపిస్తుంది.

2026 టాటా పంచ్..
2026 టాటా పంచ్..

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను తట్టుకుంటూ, మంచి మైలేజ్ ఇచ్చే కాంపాక్ట్ కార్ల కోసం చూసేవారికి టాటా పంచ్ మొదటి ఛాయిస్‌గా మారింది. ప్రస్తుతం ఈ కారు మొత్తం 8 వేరియంట్లు 3 రకాల ఇంజన్లు, 3 గేర్‌బాక్స్ ఆప్షన్లతో విభిన్న శ్రేణిలో లభిస్తోంది.

టాటా పంచ్ సీఎన్జీ వేరియంట్ల కొత్త ధరలు..

పర్సుపై భారం పడకుండా లాంగ్ డ్రైవ్స్ వెళ్లాలనుకునే వారి కోసం టాటా మోటార్స్ అందిస్తున్న పంచ్ సీఎన్జీ మోడళ్లపై కంపెనీ ధరలను పెంచింది.

5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే టాటా పంచ్ సీఎన్జీ వేరియంట్లపై రూ.6,000 పెంచారు. దీనితో వీటి ఎక్స్-షోరూమ్ ధరలు ఇప్పుడు రూ.6,79,990 నుంచి రూ.9,40,990 వరకు మారాయి.

ఐదు స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ సీఎన్జీ మోడళ్లపై రూ.7,000 పెంచగా, వీటి ధరలు రూ.8,66,990 నుంచి ప్రారంభమై రూ.10,66,990 (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.

సాంకేతికంగా ఈ సీఎన్జీ కారులో 1.2 లీటర్, 3-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది సీఎన్జీ మోడ్‌లో 73.4 పీఎస్ పవర్, 103 ఎన్​ఎం టార్క్.. అదే పెట్రోల్ మోడ్‌లోకి మారితే 87.8 పీఎస్ పవర్, 115 ఎన్​ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా పంచ్ పెట్రోల్ వేరియంట్లలో మార్పులు ఇవే..

నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ కలిగిన మాన్యువల్ మోడళ్లపై రూ.5,000 పెంచగా, వీటి ధరల శ్రేణి రూ.5,69,990 నుంచి రూ.9,09,990 వరకు ఉంది. స్మార్ట్, ప్యూర్+ ఎస్ వేరియంట్లకు ఈ పెంపు వర్తించదు. అదేవిధంగా ఏఎమ్‌టీ మోడళ్లపై రూ.6,000 పెంచారు. కొత్త ధరల ప్రకారం ఇవి రూ.7,65,990 నుంచి రూ.9,65,990 (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తున్నాయి. ఏఎమ్‌టీలో ప్యూర్+ ఎస్ వేరియంట్ ధరను మాత్రం మార్చలేదు.

టాటా పంచ్ పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ధర ఎంతంటే?

వేగాన్ని, అద్భుతమైన పికప్‌ను ఇష్టపడే యువత కోసం తీసుకొచ్చిన 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ మోడల్ గరిష్టంగా 120 పీఎస్ పవర్‌ను, 170 ఎన్​ఎం టార్క్‌ను అందిస్తుంది. ఇది కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. దీనిపై కూడా కంపెనీ రూ.5,000 ధరను పెంచింది. టాటా ఆన్‌లైన్ కాన్ఫిగరేటర్ ప్రకారం ఈ టర్బో ఇంజన్ లభించే రెండు ట్రిమ్‌ల కొత్త ధరలు వరుసగా రూ.8,39,990, రూ.9,89,990 (ఎక్స్-షోరూమ్) గా మారాయి.

చౌకైన ధరలో ఎస్‌యూవీ ఫీలింగ్ ఇచ్చే కారు కావాలనుకునే వారికి ఈ చిన్న మార్పు మినహా టాటా పంచ్ ఇప్పటికీ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అనడంలో సందేహం లేదు!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe