...
...
Next Story

Tata Aeris : ఇక నుంచి 'టాటా ఏరిస్​'గా టిగోర్​! అతి త్వరలోనే ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ లాంచ్..

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన పాపులర్ సెడాన్ టిగోర్‌ను సరికొత్త అవతారంలో తీసుకొస్తోంది. అయితే ఈ టిగోర్ ఫేస్​లిఫ్ట్​ని టాటా ఏరిస్​గా సంస్థ పరిచయం చేయనున్నట్టు సమాచారం. ఆ వివరాలు..

Published on: Sep 21, 2026, 07:30:34 IST
Advertisement

దసరా, దీపావళి సందర్భంగా కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకునే వాహన ప్రియులకు టాటా మోటార్స్ తీపి కబురు అందించింది. కాంపాక్ట్ సెడాన్ విభాగంలో సుదీర్ఘకాలంగా ఆదరణ పొందుతున్న ‘టిగోర్’కు సంబంధించిన ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని ప్రవేశపెట్టడానికి సంస్థ రంగం సిద్ధం చేసింది. అయితే టిగోర్​ పేరు మారనున్నట్టు వార్తలు వస్తున్నాయి! ఇంత కాలం టిగోర్​గా ఉన్న ఈ మోడల్​.. ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ వచ్చిన తర్వాత నుంచి ‘టాటా ఏరిస్​’గా మారబోతోందని తెలుస్తోంది.

టాటా ఏరిస్ వచ్చేస్తోంది!
టాటా ఏరిస్ వచ్చేస్తోంది!

ఈ కారును సెప్టెంబర్ చివరి వారంలో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లతో పాటు ఎలక్ట్రిక్ విభాగంలో ‘ఏరిస్.ఈవీ’ని కూడా కంపెనీ పరిచయం చేస్తోంది.

టాటా ఏరిస్- సరికొత్త లుక్.. ఆకట్టుకునే డిజైన్

ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన టియాగో ఫేస్‌లిఫ్ట్ డిజైన్ శైలిలోనే ఈ ఏరిస్ రూపుదిద్దుకుంది. ముందు భాగంలో సన్నటి గ్రిల్, స్పోర్టీగా అనిపించే బంపర్, కిందగా అమర్చిన ఫాగ్ లాంప్స్‌తో నూతన ఫ్రంట్ ఫాసియాను అందించారు. సమన్వయం చేసిన డే-టైమ్ రన్నింగ్ లైట్లతో (డీఆర్​ఎల్స్) కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌లు కారుకు మరింత ట్రెండీ లుక్‌ను ఇస్తాయి.

టిగోర్ తరహాలోనే నాచ్‌బ్యాక్ స్టైలింగ్‌ను ఇందులోనూ కొనసాగించారు. కొత్తగా రూపొందించిన 15-అంగుళాల అలాయ్ వీల్స్, వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, కొత్త టెయిల్‌గేట్, నిలువుగా ఉండే రిఫ్లెక్టర్లతో కూడిన బంపర్‌పై ప్రస్ఫుటంగా కనిపించే 'AERIS' అక్షరాలు కారు వెనుక రూపాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి.

టాటా ఏరిస్- హైటెక్ ఫీచర్లు.. లగ్జరీ క్యాబిన్

కాంపాక్ట్ సెడాన్ విభాగంలో వినియోగదారులకు ప్రీమియం అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా టాటా మోటార్స్ ఈ టాటా టిగోర్ ఫేస్​లిఫ్ట్/ టాటా ఏరిస్ క్యాబిన్‌ను తీర్చిదిద్దింది. నూతన మెటీరియల్స్, ఆకర్షణీయమైన ఫినిషింగ్‌తో క్యాబిన్ ఆకట్టుకుంటుంది. డాష్‌బోర్డ్ డిజైన్ టాటా టియాగోను పోలి ఉన్నప్పటికీ, విభిన్నమైన కలర్ షేడ్స్‌తో కొత్తదనం నింపారు.

ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో నమ్మకమైన 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇచ్చారు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. పెట్రోల్ మోడ్‌లో ఇది 86 హెచ్‌పీ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇక రోజువారీ ప్రయాణాల్లో తక్కువ వ్యయంతో మెరుగైన మైలేజ్ కోరుకునే వారి కోసం సీఎన్జీ మోడ్‌ను కూడా అందిస్తున్నారు. సీఎన్జీ మోడ్‌లో ఈ ఇంజిన్ 76 హెచ్‌పీ పవర్, 97 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది.

ఇక ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 'ఏరిస్.ఈవీ'ని కూడా సంస్థ తీసుకువస్తోంది.

బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు, విశ్వసనీయమైన మైలేజ్ కోరుకునే కుటుంబాలకు ఏరిస్ మంచి ఎంపిక కానుందని ఆటోమొబైల్​ వర్గాలు భావిస్తున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks