2027 Honda Jazz : అదిరిపోయే ఫీచర్లతో హోండా జాజ్ ఫేస్​లిఫ్ట్- ఇండియాలోకి వస్తుందా?

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా తన ఐకానిక్ హ్యాచ్‌బ్యాక్ 'జాజ్' 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2027 ఎడిషన్‌ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. సరికొత్త స్పోర్టీ లుక్, అధునాతన హైబ్రిడ్ ఇంజిన్‌తో వచ్చిన ఈ కారు విశేషాలు.

Published on: Jul 11, 2026, 10:43:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ కార్ల ప్రేమికులకు, ముఖ్యంగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లను ఇష్టపడే వారికి ‘హోండా జాజ్’తో ప్రత్యేక అనుభూతి ఉంటుంది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు ఒకప్పుడు ఇదొక లగ్జరీ స్టేటస్ సింబల్. గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టి విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, హోండా సంస్థ ఈ కారును సరికొత్త హంగులతో '2027 హోండా జాజ్' (జపాన్ మార్కెట్లో హోండా ఫిట్) రూపంలో లాంచ్ చేసింది. ఎస్‌యూవీల హవా నడుస్తున్న నేటి తరుణంలోనూ చిన్న కార్ల విభాగంలో తsమ పట్టును నిలుపుకోవడానికి హోండా ఈ అప్‌డేటెడ్ మోడల్‌ను తీసుకొచ్చింది.

2027 హోండా జాజ్..
2027 హోండా జాజ్..

ఈ హోండా జాజ్ ఫేస్​లిఫ్ట్​ విషయాలను ఇక్కడ చూసేయండి..

2027 హోండా జాజ్- బడ్జెట్, ధరల వివరాలు..

ప్రస్తుతం జపాన్ మార్కెట్లో విడుదలైన ఈ 2027 హోండా జాజ్ ప్రారంభ ధర 18,06,200 యెన్ల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్ వేరియంట్ 2,955,700 యెన్ల వరకు ఉంది. దీనిని మన భారతీయ కరెన్సీ విలువతో పోల్చి చూస్తే సుమారు రూ. 10.6 లక్షల నుంచి రూ. 17.4 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

2027 హోండా జాజ్- స్పోర్టీ లుక్‌తో ఆర్‌ఎస్ వేరియంట్..

నాలుగో తరం మోడల్‌గా వచ్చిన ఈ హోండా జాజ్ ఫేస్​లిఫ్ట్ పాత డిజైన్ శైలిని కొనసాగిస్తూనే, విజువల్స్ పరంగా మరింత ఆకర్షణీయంగా మారింది. ముఖ్యంగా ఇందులో ప్రవేశపెట్టిన ‘జాజ్ ఆర్‌ఎస్’ వేరియంట్ యువతను ఆకట్టుకునేలా ఉంది.

ఈ స్పోర్టియర్ మోడల్‌లో రీ-డిజైన్ చేసిన ఫ్రంట్ అండ్ రేర్ బంపర్లు, గ్లోస్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ లైన్లు ఉన్నాయి.

సరికొత్త డిజైన్‌తో కూడిన 16-ఇంచుల అలాయ్ వీల్స్ కారుకు మరింత బోల్డ్ లుక్‌ను ఇచ్చాయి.

రైడింగ్ అనుభూతిని మెరుగుపరిచేందుకు ఆర్‌ఎస్ వేరియంట్‌లో ప్రత్యేకంగా సస్పెన్షన్ ట్యూనింగ్ చేశారు, ఇది సిటీ రోడ్లపై ప్రయాణాన్ని మరింత సాఫీగా మారుస్తుంది.

2027 హోండా జాజ్- విశాలమైన క్యాబిన్..

హోండా జాజ్ కారుకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ దాని లోపలి భాగం (క్యాబిన్ స్పేస్). కొత్త మోడల్‌లోనూ ఆ లగ్జరీ కంఫర్ట్‌ను అలాగే ఉంచారు! కారు లోపల డ్రైవర్ కోసం పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, అత్యాధునిక టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. కారు ప్రయాణాన్ని సురక్షితంగా మార్చేందుకు ‘హోండా సెన్సింగ్’ సేఫ్టీ సూట్‌ను అందించారు.

వీటన్నింటికీ మించి లగేజీని మనకు నచ్చినట్లు సర్దుకోవడానికి వీలుగా హోండాకు పేటెంట్ ఉన్న 'మ్యాజిక్ సీట్స్' ఫీచర్‌ను ఇందులోనూ ఇచ్చారు. దీనివల్ల సీట్లను రకరకాలుగా మడతబెట్టుకుని ఎక్కువ సామాగ్రిని సులభంగా తీసుకెళ్లవచ్చు!

2027 హోండా జాజ్- ఈ:హెచ్‌ఈవీ హైబ్రిడ్ టెక్నాలజీ..

ప్రస్తుత కాలంలో మైలేజ్, పర్యావరణ పరిరక్షణ రెండూ ముఖ్యమే. అందుకే ఈ హోండా జాజ్ ఫేస్​లిఫ్ట్ హోండా తన పాపులర్ 'ఈ:హెచ్‌ఈవీ' సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను ఉపయోగించింది. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్ల కలయికతో పనిచేస్తుంది. ఇంటెలిజెంట్ మల్టీ-మోడ్ డ్రైవ్, ఈ-సీవీటీ గేర్ బాక్స్‌తో వచ్చే ఈ ఇంజన్, బ్యాటరీ పవర్ నుంచి పెట్రోల్ పవర్‌కు చాలా స్మూత్‌గా మారుతుంది. ఇది లీటరుకు అద్భుతమైన మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

ఇండియాలో రీ-లాంచ్ ఉంటుందా?

భారతదేశంలో కఠినమైన ఉద్గార నిబంధనలు, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లకు డిమాండ్ తగ్గడం వల్ల హోండా సంస్థ 2023లో జాజ్ అమ్మకాలను ఇండియాలో నిలిపివేసింది. ప్రస్తుతం హోండా ఇండియా కేవలం అమేజ్, ఎలివేట్ మోడళ్లపైనే పూర్తి దృష్టి పెట్టింది.

ప్రస్తుతానికైతే ఈ 2027 హోండా జాజ్ ఫేస్​లిఫ్ట్​ ఇండియా లాంచ్​పై సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, భారత మార్కెట్లో భవిష్యత్తులో స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లకు ఆదరణ పెరిగితే, ఈ హోండా జాజ్ ఈ:హెచ్‌ఈవీ మోడల్‌ను రీ-లాంచ్ చేసే అవకాశాలను కొట్టిపారేయలేము!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More