Honda cars : 10 కొత్త కార్లతో హోండా గ్రాండ్ కంబ్యాక్! బ్రెజ్జా, నెక్సాన్‌కు పోటీగా పవర్‌ఫుల్ ఎస్‌యూవీ..
Honda SUV : భారత ఆటోమొబైల్ మార్కెట్లో పూర్వ వైభవాన్ని సంపాదించుకోవడానికి జపాన్ కార్ల దిగ్గజం హోండా సరికొత్త వ్యూహాన్ని ప్రకటించింది. 2030 నాటికి ఏకంగా 10 కొత్త మోడళ్లను లాంచ్ చేయడంతో పాటు 2028 నాటికి తక్కువ బడ్జెట్లోనే అదిరిపోయే సబ్-4 మీటర్ ఎస్‌యూవీని తీసుకురానున్నట్లు అధికారికంగా ధృవీకరించింది.
భారతదేశంలో ఒకప్పుడు సెడాన్ కార్ల మార్కెట్‌ను శాసించిన హోండా కార్స్ ఇండియా.. ప్రస్తుతం మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా రూట్ మార్చింది. దేశంలో ఎస్‌యూవీ కార్లకు ఉన్న క్రేజ్, డిమాండ్‌ను అందిపుచ్చుకుని మార్కెట్లో మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడానికి ఒక భారీ, దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 2030 నాటికి భారత మార్కెట్లో ఏకంగా 10 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్లు హోండా ప్రకటించింది!

ఈ అగ్రెసివ్ ప్రొడక్ట్ ప్లాన్‌లో భాగంగా హోండా జెడ్ఆర్-వీ, సరికొత్త '0 ఆల్ఫా' ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్, సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ, త్రీ-రో (7 సీటర్) ఎస్‌యూవీ, నెక్ట్స్ జనరేషన్ సిటీ ప్రోలాగ్ పర్ఫార్మెన్స్ కూపేలతో పాటు అంతర్జాతీయంగా పాపులర్ అయిన హోండా హైబ్రిడ్ ఎస్‌యూవీలను రంగంలోకి దించనుంది. ఈ భారీ ఉత్పత్తికి అనుగుణంగా రాజస్థాన్‌లోని తపుకరాలో ఉన్న తన మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను కూడా హోండా విస్తరిస్తోంది.
2028లో సరికొత్త సబ్-4 మీటర్ ఎస్‌యూవీ!
ఇటీవల జరిగిన గ్లోబల్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హోండా ఒక కీలక ప్రకటన చేసింది. భారతీయులు ఎంతగానో ఇష్టపడే సబ్-4 మీటర్ (సబ్-కాంపాక్ట్) ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో సరికొత్త కారును 2028 నాటికి విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. గతంలో హోండా నుంచి వచ్చిన ‘డబ్ల్యూఆర్-వీ’ ఆశించిన స్థాయిలో రాణించలేక మార్కెట్ నుంచి నిష్క్రమించింది. ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ, అత్యంత పోటీ ఉన్న ఈ సెగ్మెంట్‌లో హోండా వేస్తున్న రెండో అడుగు ఇది.
"భారతీయ మార్కెట్ పరిస్థితులు, ఇక్కడి కస్టమర్ల అవసరాలకు పూర్తి స్థాయిలో సరిపోయేలా ఈ కొత్త కారు స్పెసిఫికేషన్లను డిజైన్ చేస్తున్నాం. పర్ఫార్మెన్స్, ధరల మధ్య సరైన సమతుల్యతను సాధించడమే మా లక్ష్యం," అని హోండా డైరెక్టర్, ప్రెసిడెంట్ తోషిహిరో మిబే అధికారికంగా ప్రకటించారు.
గ్లోబల్ డిజైన్ల కంటే భారతీయ రోడ్లు, మధ్యతరగతి వినియోగదారుల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ కారును ప్రత్యేకంగా ఇండియాలోనే డెవలప్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇంజన్ సామర్థ్యం.. పోటీదారులు ఎవరంటే?
హోండా తీసుకురాబోయే ఈ కొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలో మల్టిపుల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. పెట్రోల్ వెర్షన్ కోసం హోండా అమేజ్‌లో విజయవంతమైన 1.2 లీటర్, 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చు. ఇది 88.8 బీహెచ్పీ పవర్‌ను, 110 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ సరికొత్త ఎస్‌యూవీ మార్కెట్లోకి వస్తే.. ప్రస్తుతం సెగ్మెంట్ లీడర్లుగా ఉన్న టాటా నెక్సాన్, మారుతీ సుజుకీ బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, స్కోడా కైలాక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది. అలాగే భవిష్యత్తులో రాబోయే మహీంద్రా విజన్ ఎస్, టాటా స్కార్లెట్, రెనాల్ట్ బ్రిడ్జర్ వంటి రగ్గడ్ లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీల మార్కెట్‌కు కూడా ఇది గండికొట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సరికొత్త పీ2 ప్లాట్‌ఫారమ్..
భవిష్యత్తులో రాబోయే చిన్న, మిడ్-సైజ్ కార్ల కోసం హోండా ఒక సరికొత్త మోడ్యులర్ ఆర్కిటెక్చర్‌ను సిద్ధం చేస్తోంది. దీనికి ‘పీ2’ అని కోడ్‌నేమ్ పెట్టారు. రాబోయే సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ, నెక్ట్స్ జనరేషన్ హోండా సిటీ సెడాన్, కొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలు అన్నీ ఈ పీ2 ప్లాట్‌ఫారమ్ ఆధారంగానే రూపొందనున్నాయి.
ఈ ప్లాట్‌ఫారమ్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది పెట్రోల్ ఇంజన్‌తో పాటు హైబ్రిడ్, ఎలక్ట్రిక్ టెక్నాలజీలకు కూడా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, ప్రస్తుతం హోండా వాడుతున్న హైబ్రిడ్ ప్లాట్‌ఫారమ్ కంటే ఇది దాదాపు 90 కిలోల బరువు తక్కువగా ఉంటుంది. దీనివల్ల కారు మైలేజ్, పికప్ అద్భుతంగా పెరుగుతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


