Renault Duster : ఈ 5 విషయాల్లో రెనాల్ట్ డస్టర్‌కి సాటిలేదు- ప్రత్యర్థులకు గట్టి పోటీ!
Renault Duster review : భారత మార్కెట్లోకి గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చిన రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. విపరీతమైన పోటీ ఉన్న సెగ్మెంట్లో కూడా ఈ మోడల్ ప్రత్యేకంగా నిలువనుంది. దీని వెనుక 5 కారణాలను ఇక్కడ చూసేయండి..
2010 దశకంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో రారాజుగా వెలిగింది ‘రెనాల్ట్ డస్టర్’! జపాన్, జర్మనీ, స్వదేశీ కంపెనీల పోటీ పెరగడంతో 2022లో ఇది భారత మార్కెట్ నుంచి నిష్క్రమించింది. అయితే, ఇప్పుడు సరికొత్త హంగులతో డస్టర్ మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన పాత ప్రత్యర్థులకు చమటలు పట్టించేలా ఈ కొత్త మోడల్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇతర కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పోలిస్తే రెనాల్ట్ డస్టర్ ఏయే అంశాల్లో ముందంజలో ఉందో ఈ 5 కారణాలు చూడండి.

1. అగ్రెస్సివ్ ప్రైసింగ్: అందరికీ అందుబాటులో..
ధర విషయంలో రెనాల్ట్ ఈసారి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మార్కెట్లో దీని ప్రారంభ ధరను రూ. 10.49 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఆర్-పాస్ లేకుండా) నిర్ణయించారు. ఒకవేళ మీరు ‘ఆర్-పాస్’ ఉపయోగిస్తే, ఈ ధర రూ. 10.29 లక్షలకే లభిస్తుంది. ప్రస్తుతం ఈ విభాగంలో అత్యంత తక్కువ ధర కలిగిన కారు ఇదే. దీనికి గట్టి పోటీ ఇస్తున్న మారుతీ సుజుకీ విక్టోరిస్ ధర రూ. 10.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు అందించడం ద్వారా డస్టర్ తన ప్రత్యర్థులను కోలుకోలేని దెబ్బ తీస్తోంది.
2. ఇంజిన్ పవర్: సెగ్మెంట్లోనే అత్యంత శక్తివంతమైనది..
పవర్ విషయంలో డస్టర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇందులో రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి:
1.0L TCe 100: ఇది కైగర్‌లో ఉండే 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్. ఇది 98 bhp పవర్, 166 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
1.3L TCe 160: ఇది అసలైన పవర్ హౌస్. 4-సిలిండర్లతో కూడిన ఈ టర్బోచార్జ్డ్ ఇంజిన్ ఏకంగా 160 bhp పవర్, 280 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జత చేశారు.
ఈ 1.3ఎల్ ఇంజిన్ సామర్థ్యం హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ (158 bhp) కంటే కూడా ఎక్కువ. అంటే ప్రస్తుతానికి ఈ సెగ్మెంట్లో ఇదే మోస్ట్ పవర్‌ఫుల్ కారు.
3. అత్యాధునిక ఫీచర్ల మేళవింపు..
డస్టర్ ఎస్‌యూవీ ఫీచర్ల విషయంలో రెనాల్ట్ ఎక్కడా తగ్గలేదు. జర్మనీ, జపాన్ కంపెనీలకు ధీటుగా ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.
360-డిగ్రీ కెమెరా, లెవల్-2 అడాస్ సేఫ్టీ సిస్టమ్.
వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్.
ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లోనే ఇన్-బిల్ట్ గూగుల్ మ్యాప్స్.
టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.
పవర్డ్ టెయిల్‌గేట్, బోనెట్ కోసం హైడ్రాలిక్ స్ట్రట్స్ వంటి చిన్న చిన్న విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకున్నారు.
4. అద్భుతమైన హ్యాండ్లింగ్, గ్రౌండ్ క్లియరెన్స్..
డ్రైవింగ్ అనుభూతిలో ఈ కారు వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇస్తుంది. హై స్పీడ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు లేదా మలుపుల్లో కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోకుండా స్టీరింగ్ వెయిట్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని 212 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఏ రకమైన రోడ్లనైనా సునాయాసంగా ఎదుర్కొంటుంది. 1.3ఎల్ ఇంజిన్‌లోని 'బ్లో-ఆఫ్ వాల్వ్' చేసే ఆ శబ్దం వాహన ప్రియులను ఇట్టే ఆకట్టుకుంటుంది.
5. స్టైలిష్ ఎక్స్‌టీరియర్: చూడగానే నచ్చేలా..
లుక్స్ పరంగా చూస్తే టాటా సియెర్రా, ఎంజీ ఆస్టర్, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్ వంటి కార్ల కంటే డస్టర్ చాలా రగ్గడ్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తుంది. కియా సెల్టోస్‌కు ఇది గట్టి పోటీ ఇస్తోంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్స్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. బంపర్ల వద్ద ఇచ్చిన క్లాడింగ్ ఇది కఠినమైన దారుల్లో ప్రయాణించడానికి సిద్ధమని చెప్పకనే చెబుతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


