8th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు కూడా.. పనితీరు ఆధారంగానే బోనస్?
8th Pay Commission news : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనదారుల జీతభత్యాలను సవరించేందుకు ఏర్పాటైన 8వ వేతన సంఘం కేవలం జీతాల పెంపునకే పరిమితం కాకుండా అలొవెన్సులు, పర్ఫార్మెన్స్ బోనస్, పాత-కొత్త పింఛన్ విధానాలపై కీలక మార్పులు చేయబోతోంది. ఆ వివరాలు..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటై అప్పుడే ఎనిమిది నెలలు గడిచిపోయాయి. నిర్దేశిత 18 నెలల కాలపరిమితిలో ఇప్పుడు కమిషన్ చేతిలో మరో 10 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ లోపే ఉద్యోగుల వేతనాలు, అలొవెన్సులు, పెన్షన్లు, ఇతర సేవా నిబంధనలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కమిషన్ జులై 6-7 తేదీల్లో భువనేశ్వర్‌లో, ఆ తర్వాత జులై 9-10 తేదీల్లో కోల్‌కతాలో ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల అసోసియేషన్లతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను సేకరించింది.

సాధారణంగా పే కమిషన్ అనగానే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది? జీతాలు ఎంత పెరుగుతాయి? అనే చర్చ మాత్రమే అందరిలో నడుస్తుంది. కానీ, ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్‌ను నిశితంగా పరిశీలిస్తే.. ఈ కమిషన్ పరిధి కేవలం జీతాల పెంపునకే పరిమితం కాలేదని స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని చూస్తూనే, దేశ ఆర్థిక క్రమశిక్షణను, బడ్జెట్ పరిమితులను సమతుల్యం చేయాలని మోదీ సర్కార్ కమిషన్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో, లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయబోయే, గెజెట్‌లో దాగున్న ఐదు కీలకమైన అంతర్గత నిబంధనల (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
1. అలొవెన్సులపై సర్జరీ.. ఒకే గొడుగు కిందకు!
ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు అందుతున్న అన్ని రకాల అలొవెన్సులు (భత్యాలు), వాటి అర్హత నిబంధనలపై 8వ పే కమిషన్ సమగ్ర సమీక్ష జరుపుతోంది. పెద్ద సంఖ్యలో ఉన్న ఈ అలొవెన్సులను సరళీకరించి, హేతుబద్ధీకరించేలా సిఫార్సులు చేయనుంది. దీనివల్ల కొన్ని అలొవెన్సుల రేట్లు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, మరికొన్ని అలొవెన్సులు ఒకదానిలో ఒకటి విలీనం కూడా అవ్వొచ్చు. తద్వారా క్లెయిమ్ చేసుకునే విధానాన్ని మరింత పారదర్శకంగా మార్చనున్నారు.
2. పనితీరు ఆధారంగానే బోనస్.. 'ఫ్రీ' జీతాలకు చెక్?
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉత్పాదకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు వీలుగా 'పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్' విధానాన్ని గట్టిగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న బోనస్ విధానాన్ని సమీక్షించి, ఎవరైతే మెరుగైన ఫలితాలు చూపిస్తారో వారికే అదనపు ప్రోత్సాహకాలు అందేలా కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని కమిషన్‌కు నిర్దేశించారు. అంటే, కేవలం కాలపరిమితి ముగిసిందని జీతాలు పెంచడం కాకుండా, ఉద్యోగి పనితీరు ఆధారంగానే భవిష్యత్తు వేతన సవరణలు ఉండేలా పునాది పడనుంది.
3. ఎన్‌పీఎస్, యూపీఎస్ పెన్షన్లపై ప్రత్యేక దృష్టి..
రిటైర్మెంట్ ప్రయోజనాలు, పెన్షన్ల విషయంలో ఈసారి 8వ వేతన సంఘం కీలక పాత్ర పోషించనుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)తో పాటు కొత్తగా తెచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) పరిధిలోకి వచ్చే ఉద్యోగుల 'డెత్-కమ్-రిటైర్మెంట్ గ్రాట్యుటీ'ని కమిషన్ విశ్లేషిస్తోంది. అలాగే ఎన్‌పీఎస్ పరిధిలోకి రాని పాత ఉద్యోగుల పెన్షన్, గ్రాట్యుటీ ప్రయోజనాలను కూడా సమీక్షించనుంది. పెన్షన్ల మధ్య ఉన్న వ్యత్యాసాలను తొలగించి, రిటైర్డ్ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేలా ఇందులో మార్పులు రానున్నాయి.
4. ప్రైవేట్ రంగ జీతాలతో పోలిక..
ప్రభుత్వ ఉద్యోగాల్లోకి ప్రతిభావంతులైన యువతను ఆకర్షించడంతో పాటు వారిని నిలుపుకోవడానికి వీలుగా.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో ప్రస్తుతం ఉన్న జీతాల నిర్మాణం, పనితీరు, ఇతర సదుపాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కమిషన్‌ను కోరారు. మార్కెట్ శైలికి అనుగుణంగా ప్రభుత్వ వేతనాలు ఉండేలా చూస్తూనే, ఖజానాపై మోయలేని భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.
5. ఫైనల్ రిపోర్టు కంటే ముందే 'ఇంటర్నల్ రిపోర్ట్'..
ఈ కమిషన్ తన తుది నివేదికను సమర్పించడానికి 2025 నవంబర్ 3 నుంచి 18 నెలల సమయం ఉన్నప్పటికీ.. మధ్యలోనే అవసరమైన నిర్దిష్ట అంశాలపై 'ఇంటర్నల్' లేదా ‘అంతర్గత నివేదికలను’ సమర్పించడానికి గెజెట్ అనుమతించింది. దీనివల్ల పూర్తి నివేదిక వచ్చే వరకు ఆగకుండా, అత్యవసరమైన కొన్ని సిఫార్సులను ప్రభుత్వం ముందే పరిశీలించి అమలు చేసే వీలు కలుగుతుంది.
ఈ మార్పులు కేవలం ఉద్యోగుల జీతాలనే కాకుండా, రాబోయే దశాబ్ద కాలం పాటు భారత ఆర్థిక వ్యవస్థలోని మార్కెట్ డిమాండ్‌ను, ద్రవ్యోల్బణాన్ని కూడా శాసించనున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


