H-1B : అమెరికా కల చెదిరి, స్వదేశానికి రివర్స్ మైగ్రేషన్- ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఇక్కడ మరింత దారుణం! జీతం..
H 1B workers : అమెరికాలో పెరుగుతున్న లే-ఆఫ్‌లు, హెచ్-1బీ వీసా నిబంధనల ఉచ్చుతో గ్లోబల్ టెక్ నిపుణులు భారత్‌కు తిరుగుపయనమవుతున్నారు. అయితే యూఎస్ జీతాలతో పోలిస్తే ఐదో వంతు తక్కువ జీతాలకే ఇక్కడ సర్దుకుపోవాల్సి వస్తోందని తాజా సర్వే స్పష్టం చేసింది.
ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడి, అమెరికాలో ఇల్లు కొని, 'అమెరికన్ డ్రీమ్'ను సాకారం చేసుకోవడమే పరమావధిగా భావించేవారు భారతీయ టెక్ నిపుణులు. కానీ నేడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. అమెరికాలోని దిగ్గజ కంపెనీల్లో నిరంతరం సాగుతున్న ఉద్యోగాల కోత, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం చేపట్టిన కఠిన వైఖరి వల్ల హెచ్-1బీ వీసాల చుట్టూ అల్లుకున్న సందిగ్ధత, కంపెనీల పునర్వ్యవస్థీకరణ వంటి పరిణామాలు ప్రవాస భారతీయులను స్వదేశం వైపు అడుగులు వేయించేలా చేస్తున్నాయి. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన, వీసా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ వంటి ఐటీ హబ్‌లకు క్యూ కడుతున్నారు. అయితే, ఇక్కడ వారికి ఆహ్వానం పలుకుతున్న ఐటీ మార్కెట్, జీతాల విషయంలో మాత్రం ఊహించని షాక్ ఇస్తోంది.

ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ‘బ్లైండ్’ నిర్వహించిన తాజా సర్వేలో ఈ సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 1,276 మంది వెరిఫైడ్ ఐటీ నిపుణుల అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. అమెరికా నుంచి భారతదేశానికి 'రివర్స్ మైగ్రేషన్' (స్వదేశానికి తిరుగు ప్రయాణం) భారీగా పెరిగింది. సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది తమ సహోద్యోగులు లేదా తెలిసిన వారు అమెరికాను వదిలి భారత్‌కు తిరిగి రావడం చూశామని స్పష్టం చేశారు.
గ్లోబల్ సెంటర్లు పెరిగినా.. దక్కని ఉద్యోగాలు!
భారతదేశంలో బహుళజాతి కంపెనీలు తమ ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్’ను విపరీతంగా విస్తరిస్తున్నాయి. అమెజాన్, వాల్‌మార్ట్, ఉబెర్ వంటి దిగ్గజాలు ఇక్కడే పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయినప్పటికీ స్థానికంగా ఉన్న నిపుణులకు ఉద్యోగ అవకాశాలు ఆశించిన స్థాయిలో పెరగలేదని ఈ సర్వే తేల్చింది. గడిచిన ఏడాది కాలంలో కొత్త ఉద్యోగ అవకాశాలు పెరిగాయని కేవలం 26 శాతం మంది మాత్రమే చెప్పగా, ఏకంగా 51 శాతం మంది నియామకాలు గణనీయంగా తగ్గాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన నైపుణ్యం కలిగిన నిపుణులు భారతదేశంలోని అదే కంపెనీల జీసీసీ బ్రాంచ్‌లలో చేరిపోతుండటంతో, ఇక్కడి మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల అమెరికా కంపెనీలకు తక్కువ ఖర్చుతోనే అనుభవజ్ఞులైన ఉద్యోగులు దొరుకుతుండగా, స్థానిక అభ్యర్థులకు మాత్రం అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.
ఐదో వంతు జీతానికే అంగీకారం!
అమెరికా నుంచి తిరిగి వస్తున్న నిపుణులను వేధిస్తున్న అతిపెద్ద సమస్య జీతాల వ్యత్యాసం. "గడిచిన ఆరు నెలల్లో సగటు జీతాల స్థాయి పడిపోయింది. అమెరికాలో వచ్చే జీతంతో పోలిస్తే ఇక్కడ కేవలం ఐదో వంతు మాత్రమే దక్కే పరిస్థితి ఉంది," అని బ్లైండ్ ప్లాట్‌ఫామ్‌లో గూగుల్ ఉద్యోగి ఒకరు తన ఆవేదనను పంచుకున్నారు.
వీసా టెన్షన్లు పడలేక, స్వదేశంలో ప్రశాంతంగా బతకవచ్చనే ఉద్దేశంతో చాలా మంది ఈ భారీ జీతాల కోతను సైతం భరిస్తూ సర్దుకుపోతున్నారు.
స్టార్టప్‌ల వైపు చూడండి: మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి సలహా!
"భారతదేశంలో ఉద్యోగ మార్కెట్ అమెరికా కంటే మెరుగ్గానే ఉంది, కానీ మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని సంపాదించడమే ఇక్కడున్న అసలైన సవాలు," అని మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి స్వప్నిల్ సాగర్ విశ్లేషించారు. అమెరికాలో పదేళ్ల పాటు పనిచేసి, 2025లో మైక్రోసాఫ్ట్ లే-ఆఫ్స్‌లో ఉద్యోగం కోల్పోయిన సాగర్, వీసా డాక్యుమెంట్ల గోల భరించలేక బెంగళూరుకు తిరిగి వచ్చి ఒక టెక్ కంపెనీలో చేరారు.
భారత్‌లో జీవన వ్యయం తక్కువ కాబట్టి ఇక్కడి జీతాలు తక్కువగా ఉండటం సహజమేనని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరుకు వచ్చే టెక్ నిపుణులు కేవలం గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బిగ్ టెక్ దిగ్గజాల వైపే కాకుండా, చిన్న కంపెనీలు, స్టార్టప్‌లను కూడా పరిశీలిస్తే మెరుగైన జీతాలు పొందే అవకాశం ఉంటుందని సాగర్ సూచించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


