8th pay commission : 8వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై కొత్త వార్తలు! ఉద్యోగులకు నిరాశే?
8th pay commission fitment factor : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సవరణకు సంబంధించి కీలకమైన ‘ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్’పై 8వ కేంద్ర వేతన సంఘం ఆచితూచి వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. ఈ మల్టిప్లైయర్‌ని గత 7వ పే కమిషన్ తరహాలోనే 2.57 స్థాయికి దగ్గరగా ఉంచవచ్చని సమాచారం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లను నిర్ణయించడంలో అత్యంత కీలకమైన అంశం 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్'. ప్రస్తుత బేసిక్ పే (కనీస వేతనం)ని ఈ ఫ్యాక్టర్‌తో మల్టిప్లై చేయడం ద్వారానే.. సవరించిన కొత్త బేసిక్ శాలరీని లెక్కిస్తారు. కాబట్టి, 8వ పే కమిషన్ పరిధిలో ఈ రేషియో ఎంత ఉండబోతుందనే దానిపై దేశవ్యాప్తంగా ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. దేశ ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ బడ్జెట్ పరిమితులను పరిగణనలోకి తీసుకుని ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను భారీగా పెంచకుండా నిరోధించే ఆలోచనలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది!

ఈ వేతన సవరణ ప్రక్రియ ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ సంభావ్య శ్రేణి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు, సవరించిన వేతనాలు-పెన్షన్ల వల్ల ప్రభుత్వాలపై పడే ఆర్థిక ప్రభా పై అంచనాలు వేసే దశకు చేరుకుందని ఈ చర్చలతో సంబంధం ఉన్న ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు.
3.83 కావాలంటున్న ఉద్యోగ సంఘాలు..
అనేక అంశాలపై 8వ వేతన సంఘం ఆచితూచి అడుగులు వేస్తున్నప్పటికీ, ఉద్యోగ సంఘాలు మాత్రం వేతనాలను భారీగా పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. వారు సమర్పించిన విజ్ఞాపన పత్రాలలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.83 కి పెంచాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వాలు ఈ డిమాండ్‌కు అంగీకరిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం ప్రస్తుతం ఉన్న రూ. 18,000 నుండి నేరుగా రూ. 69,000 కు పెరుగుతుంది.
ముగిసిన గడువు.. రాష్ట్రాలతో సంప్రదింపులు..
ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు, ఇతర స్టేక్‌హోల్డర్ల నుంచి అధికారిక విజ్ఞాపనలు స్వీకరించే ప్రక్రియ జూన్ 15 నాటితో ముగిసింది. ఇప్పుడు కమిషన్ ఈ ప్రతిపాదనలను నిశితంగా పరిశీలిస్తోంది. దీనితో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కూడా సేకరిస్తోంది. ఇందులో భాగంగా మొదటగా ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఫీడ్‌బ్యాక్‌ను కమిషన్ పరిశీలించనుంది.
ఇప్పటికే దేశవ్యాప్త పర్యటనల్లో భాగంగా దిల్లీ, లడఖ్, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, మహారాష్ట్ర వంటి పలు ప్రాంతాల్లో స్టేక్‌హోల్డర్లతో కమిషన్ సమావేశాలు నిర్వహించింది. ఈ సంప్రదింపుల ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత, కమిషన్ తన తుది నివేదికను సిద్ధం చేస్తుంది. ఆ నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కొత్త జీతాల నిర్మాణం ఖరారవుతుంది.
గత 7వ పే కమిషన్ ట్రాక్ రికార్డ్..
గతంలో ఏర్పాటైన 7వ పే కమిషన్ 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సిఫార్సు చేసింది. దీనివల్ల అప్పట్లో కనీస ప్రాథమిక వేతనం రూ. 7,000 నుంచి రూ. 17,990 (రౌండప్‌గా రూ. 18,000) కు పెరిగింది. అయితే, ఈ వేతన సవరణ కారణంగా కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ వ్యయం ఆర్థిక సంవత్సరం 2015-16 లోని 4.8 శాతం నుంచి.. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఒకేసారి 9.9 శాతానికి చేరుకుంది. ఈసారి కూడా అటువంటి భారీ ఆర్థిక భారం పడకుండా సమతుల్యతను పాటించాలని 8వ వేతన సంఘం భావిస్తోంది.
మరి 8వ వేతన సంఘం సిఫార్సు చేసే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది? దాన్ని కేంద్రం ఆమోదిస్తుందా? వంటి వివరాలపై రానున్న నెలల్లో స్పష్టత వస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


