8th Pay Commission : ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి? ఉద్యోగ సంఘాల డిమాండ్ ఇది..
8వ వేతన సంఘం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్న వేళ, ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచడంతో పాటు వార్షిక ఇంక్రిమెంట్‌ను 5 శాతానికి పెంచాలని ‘ఎఫ్‌ఎన్‌పీఓ’ కేంద్రానికి లేఖ రాసింది.
8వ వేతన సంఘం అప్డేట్స్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి కీలక డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎన్‌పీఓ), నేషనల్ కౌన్సిల్ జేసీఎం (ఎన్‌సీజేసీఎం స్టాఫ్ సైడ్‌కు ఒక సమగ్రమైన లేఖను పంపింది. ఇందులో వేతనాల పెంపుతో పాటు పలు కీలక మార్పులను ప్రతిపాదించింది.

8వ వేతన సంఘం- 60 పేజీల నివేదికలో ఏముంది?
ఎఫ్‌ఎన్‌పీఓ సెక్రటరీ జనరల్ శివాజీ వాసిరెడ్డి నేతృత్వంలో సిద్ధం చేసిన ఈ 60 పేజీల నివేదికలో కేవలం జీతాల పెంపు మాత్రమే కాకుండా.. పే స్కేల్స్, పే స్ట్రక్చర్, పే మ్యాట్రిక్స్ సిస్టమ్, అలవెన్సులు, ప్రమోషన్ల వంటి అంశాలపై లోతైన సిఫార్సులు చేశారు.
ఫిబ్రవరి 15న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నుంచి సిఫార్సులు అందిన తర్వాత డ్రాఫ్ట్ కమిటీ సభ్యులతో కౌన్సిల్ సమావేశం కానుంది. "ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎన్‌సీజేసీఎం తుది ముసాయిదాను సిద్ధం చేస్తుంది. అనంతరం దానిని 8వ వేతన సంఘం అధ్యక్షురాలు రంజన ప్రకాష్ దేశాయ్‌కు పంపిస్తాము," అని శివాజీ వాసిరెడ్డి తెలిపారు.
8వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్: ఏ లెవల్‌కు ఎంత?
గత వేతన సంఘాలు అన్ని స్థాయిల ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సమానంగా వర్తింపజేయలేదని ఎఫ్‌ఎన్‌పీఓ అభిప్రాయపడింది. అందుకే ఈ 8వ వేతన సంఘంలో ‘అక్రోయిడ్ ఫార్ములా’ ఆధారంగా వివిధ స్థాయిల ఉద్యోగులకు 3.0 నుంచి 3.25 వరకు ఫిట్‌మెంట్ ఉండాలని డిమాండ్ చేసింది.
జీతాలు, పెన్షన్లు, అలవెన్సులను సవరించడానికి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను వేతన సంఘాలు ఉపయోగిస్తాయి. ఈ ముఖ్యమైన మల్టిప్లైయర్.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను నిర్ణయిస్తుంది. ద్రవ్యోల్బణం, ఉద్యోగుల అవసరాలు, ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని దీనిని నిర్ణయిస్తారు.
కేంద్ర ఉద్యోగుల ప్రస్తుత జీతభత్యాల నిర్మాణం 7వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా ఉంది. ఇది 2016 నుంచి అమల్లోకి వచ్చింది.
ఇక 8వ వేతన సంఘంలో ప్రతిపాదిత ఫిట్‌మెంట్ వివరాలు ఇలా ఉన్నాయి:
లెవల్ 1 నుంచి 5 వరకు: 3.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
లెవల్ 6 నుంచి 9 వరకు: 3.05 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
లెవల్ 10 నుంచి 12 వరకు: 3.1 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
లెవల్ 13 నుంచి 13ఏ వరకు: 3.05 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
లెవల్ 14 నుంచి 15 వరకు: 3.15 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
లెవల్ 16: 3.2 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
లెవల్ 17 నుంచి 18 వరకు: 3.25 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
8వ వేతన సంఘం- '5% వార్షిక ఇంక్రిమెంట్ కావాలి'
ప్రస్తుతం అమల్లో ఉన్న 3 శాతం వార్షిక ఇంక్రిమెంట్‌ని 8వ వేతన సంఘంలో 5 శాతానికి పెంచాలని ఎఫ్‌ఎన్‌పీఓ కోరింది. దీనివల్ల ఉద్యోగులకు మెరుగైన ఆర్థిక ప్రగతి లభిస్తుందని, ప్రైవేట్ రంగ ప్రమాణాలకు దగ్గరగా జీతాలు ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా పదోన్నతులు తక్కువగా ఉండే గ్రూప్-సీ, గ్రూప్-డీ ఉద్యోగులకు ఈ పెంపు చాలా ఊరటనిస్తుందని నివేదిక స్పష్టం చేసింది.
ఇక పే ఫిక్సేషన్, పురోగతి విషయంలో 7వ వేతన సంఘం మ్యాట్రిక్స్ విధానం చాలా స్పష్టతనిచ్చిందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. అందుకే 8వ వేతన సంఘంలో కూడా ఇదే మ్యాట్రిక్స్ విధానాన్ని కొనసాగించాలని వారు కోరుతున్నారు.
ఈ ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఉద్యోగులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. బడ్జెట్ 2026 తర్వాత దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


