8th pay commission : 8వ వేతన సంఘం చర్చలు ఎక్కడివరకు వచ్చాయి? అమలు ఎప్పుడు? టాప్​-10 విషయాలు..

8th pay commission news : 8వ వేతన సంఘం చర్చలు ఎక్కడి వరకు వచ్చాయి? వేతన సంఘం రాష్ట్రాల పర్యటన ఎప్పుడు? ఇంతకీ పే కమిషన్ సిఫార్సులు ఎప్పుడు కేంద్రం వద్దకు చేరుతాయి? అసలు 8వ వేతన సంఘం ఎప్పుడు అమలవుతుంది? వీటికి సంబంధించిన కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 26, 2026, 11:08:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బందితో పాటు పదవీ విరమణ చేసిన పెన్షనర్ల జీతభత్యాలు, కరువు భత్యం (డీఏ), ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, ఇతర ప్రయోజనాలను సవరించడానికి ప్రతి పదేళ్లకోసారి ఒక వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఏర్పాటైన 8వ వేతన సంఘం సిఫార్సుల కోసం రక్షణ, రైల్వే రంగాలు సహా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు.. మొత్తంగా కోటి మందికి పైగా లబ్ధిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పే కమిషన్ చర్చలకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన టాప్ 10 తాజా పరిణామాలు, ఉద్యోగ సంఘాల డిమాండ్లు, రాబోయే సమావేశాల వివరాలు ఇలా ఉన్నాయి..

8వ వేతన సంఘం చర్చలు, సమావేశాలు, అమలు వివరాలు.. (Pixabay)
8వ వేతన సంఘం చర్చలు, సమావేశాలు, అమలు వివరాలు.. (Pixabay)

1. 8వ వేతన సంఘం- కమిటీ సభ్యులు వీరే..

ప్రస్తుత ప్యానల్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వం వహిస్తున్నారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు, ఫైనాన్స్ ప్రొఫెసర్ పులక్ ఘోష్ ఇందులో సభ్యుడిగా ఉండగా, మాజీ ఐఏఎస్ అధికారి పంకజ్ జైన్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

2. 8వ వేతన సంఘం- కనీస వేతనం రూ.69,000 ఇవ్వాలి!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనాన్ని భారీగా పెంచాలని నేషనల్ కౌన్సిల్ - జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (ఎన్​సీ-జేఎంసీ), ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐడీఈఎఫ్), మహారాష్ట్ర ఓల్డ్ పెన్షన్ ఆర్గనైజేషన్ వంటి పెద్ద ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. కనీస వేతనాన్ని రూ.69,000కు పెంచాలని ఎన్‌సీ-జేసీఎం, ఏఐడీఈఎఫ్ కోరగా, మహారాష్ట్ర ఓల్డ్ పెన్షన్ ఆర్గనైజేషన్ రూ.65,000గా నిర్ణయించాలని డిమాండ్ చేసింది.

3. 8వ వేతన సంఘం- కరువు భత్యంపై కొత్త ప్రతిపాదనలు..

ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతన నమూనా ఉండాలని ఎన్‌సీ-జేసీఎం కోరుతోంది. కనీసం 4 శాతం డీఏ పెంచడంతో పాటు, 50 శాతం డీఏను ప్రాథమిక వేతనంలో విలీనం చేయాలని మహారాష్ట్ర ఓల్డ్ పెన్షన్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తోంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా పరిహారం ఉండాలని ఏఐడీఈఎఫ్ స్పష్టం చేసింది.

4. రైల్వే సాంకేతిక నిపుణుల డిమాండ్లు..

"ఆధునిక ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కనీస వేతనాన్ని రూ.52,600కు సవరించాలి, భిన్నమైన ఫిక్సేషన్ ఫ్యాక్టర్లను అమలు చేయాలి" అని ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (ఐఆర్​టీఎస్​ఏ) డిమాండ్ చేసింది. మరోవైపు, 2026 జనవరి 1 నాటి ధరల సూచిక ఆధారంగా కనీస వేతనాన్ని లెక్కించాలని రైల్వేస్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ (ఆర్​ఎస్​సీడబ్ల్యూఎస్) కోరింది.

5. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు..

రైల్వే మంత్రిత్వ శాఖలోని లెవెల్ 6 పోస్టులు, ముఖ్యంగా భద్రతా విభాగానికి చెందిన ఉద్యోగాలకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఇండెక్సింగ్ ఎక్కువగా ఉండాలని ఐఆర్‌టీఎస్ఏ పేర్కొంది. ఇందుకోసం 2.92, 3.50, 3.80 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లను ఆ సంఘం సూచించింది.

6. రాష్ట్రాల్లో పర్యటనలు.. త్వరలో కీలక భేటీలు..

ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వాటాదారులతో మాట్లాడేందుకు వేతన సంఘం ఇప్పటికే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పలు రాష్ట్రాల్లో పర్యటించింది. రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా జులై 6-7 తేదీల్లో భువనేశ్వర్ (ఒడిశా), జులై 9-10 తేదీల్లో కోల్‌కతా (పశ్చిమ బెంగాల్)లలో చర్చలు జరపనున్నారు. ఈ సమావేశాల అపాయింట్‌మెంట్ కోసం జూన్ 15తోనే గడువు ముగిసింది.

7. ఆన్‌లైన్ డేటా సమర్పణకు అవకాశం..

మెమోరాండం సమర్పించే విండోను ఇప్పటికే రెండుసార్లు (ఏప్రిల్ 30, మే 31 వరకు) పొడిగించిన కమిటీ, జూన్ 15తో దాన్ని ముగించింది. ఈ ప్రక్రియ ఈ ఏడాది మార్చి 5న ప్రారంభమైంది. అయితే, ఆసక్తి గలవారు తమ డేటాను జూన్ 30 లోగా అధికారిక లింక్ (https://8cpc.gov.in/8cpc-online-data-portal/) ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.

8. కన్సల్టెంట్ పోస్టుల భర్తీ..

కమిషన్ పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫిక్స్‌డ్ పీరియడ్ కోసం పని చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఇందులో ఫుల్-టైమ్, పార్ట్-టైమ్ కన్సల్టెంట్ పాత్రలు ఉన్నాయి. వివిధ అనుభవ స్థాయిలు, శ్రేణుల్లో మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల కాలపరిమితి ఏడాది లేదా కమిషన్ పదవీకాలం ముగిసే వరకు (ఏది ముందైతే అది) ఉంటుంది.

9. సిఫార్సులు ఎప్పుడు రావచ్చు?

సాధారణ సమయపాలన ప్రకారం, కమిషన్ తన తుది సిఫార్సులను 18 నెలల్లోగా ప్రకటించాల్సి ఉంటుంది. అంటే, అత్యంత త్వరగా చూసుకున్నా 2027 ఫిబ్రవరి నాటికి అధికారిక సిఫార్సులు వచ్చే అవకాశం ఉంది. అయితే, "వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో, అంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌లో కొత్త ప్రకటన వెలువడే అవకాశం ఉంది," అని ఆల్ ఇండియా ఎన్‌పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, నేషనల్ మిషన్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ భారత్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంజీత్ సింగ్ పటేల్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

10. అమలుకు మరికొంత కాలం!

గత ట్రెండ్స్‌ను పరిశీలిస్తే, వేతన సంఘం సిఫార్సులు చేసిన తర్వాత వాటిని క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు చేయడానికి మరో రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుంది. ఈ లెక్కన 2027లో సిఫార్సులు ప్రకటించినప్పటికీ, ఉద్యోగులకు పెరిగిన జీతాలు పూర్తిగా చేతికి అందడానికి 2029 లేదా 2030 వరకు వేచి చూడాల్సి రావచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More