8th Pay Commission : ‘ఖర్చులేమో అధికం- డీఏ మాత్రం ఇంతింతే!’- లెక్కలు మార్చాలని ఉద్యోగుల డిమాండ్..
8th Pay Commission latest news : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే కరువు భత్యం (డీఏ) లెక్కించే ప్రస్తుత విధానంపై ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐడీఈఎఫ్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఇండెక్స్ వల్ల పెరిగిన ఖర్చులకు సరిపడా డీఏ రావడం లేదని 8వ వేతన సంఘానికి ఫిర్యాదు చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం కసరత్తుల మధ్య ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది! ఉద్యోగులకు, రిటైర్డ్ సిబ్బందికి ప్రతి ఆరు నెలలకోసారి ఇచ్చే కరువు భత్యం (డీఏ), డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)లను లెక్కించే ప్రస్తుత విధానాన్ని పునఃసమీక్షించాలని ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐడీఈఎఫ్) డిమాండ్ చేసింది. మార్కెట్లో పెరుగుతున్న అసలు ధరలను, ద్రవ్యోల్బణాన్ని ప్రస్తుతం వాడుతున్న ఇండెక్స్ సరిగ్గా ప్రతిబింబించడం లేదని 8వ వేతన సంఘానికి సమర్పించిన నివేదికలో ఫెడరేషన్ పేర్కొంది.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ) 12 నెలల సగటు ఆధారంగా లెక్కిస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, దైనందిన ఖర్చుల నుంచి ఉద్యోగులకు ఉపశమనం కలిగించడం కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చారు. అయితే, పెద్దగా మార్పులు లేని కొన్ని స్థిరమైన ఖర్చుల కేటగిరీలకు ఈ ఇండెక్స్‌లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, మార్కెట్లోని అసలు ద్రవ్యోల్బణ చిత్రం స్పష్టంగా బయటకు రావడం లేదని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
పెరిగిన జీవన ఖర్చులను చూపించని కొత్త సీపీఐ బాస్కెట్!
ఈ కీలకమైన అంశాన్ని వెలుగులోకి తెస్తూ.. 8వ వేతన సంఘానికి సమర్పించిన రెండో అనుబంధ మెమొరాండంలో ఏఐడీఈఎఫ్ సంచలన విషయాలను పేర్కొంది. 2022-23 సంవత్సరంలో సవరించిన కొత్త సీపీఐ బాస్కెట్.. నిత్యావసర ఆహార వస్తువుల ధరలు, సీజనల్ పంటల ధరల్లో వస్తున్న విపరీతమైన మార్పులను అస్సలు పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేసింది.
కొత్త విధానం ప్రకారం.. మొత్తం ఇండెక్స్‌లో ఆహారం, పానీయాల వాటాను 36.75 శాతానికి తగ్గించేశారు. అదే సమయంలో హెల్త్‌కేర్, హౌసింగ్, రవాణా, కమ్యూనికేషన్, డిజిటల్ సర్వీసెస్ వంటి విభాగాలకు ఎక్కువ వెయిటేజీ ఇచ్చారు. ఈ రంగాల్లో ధరల మార్పులు చాలా నిదానంగా ఉంటాయి.
“నిజానికి తక్కువ జీతాలు తీసుకునే ఉద్యోగులు, పెన్షనర్లు తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని మందులు, ఆహారం, వైద్యం, ఇంటి అద్దె, పిల్లల చదువులు వంటి అత్యవసరాల కోసమే ఖర్చు చేస్తారు. ఇండెక్స్‌లో చూపిస్తున్న ద్రవ్యోల్బణం రేటు కంటే ఈ ఉద్యోగులు వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం రేటు చాలా ఎక్కువగా ఉంటోంది. అందువల్ల ఈ పాత లెక్కల విధానాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది,” అని ఉద్యోగ సంఘాలు గట్టిగా కోరుతున్నాయి.
పెన్షనర్లపైనే ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం..
వృద్ధాప్యంలో ఉండే పెన్షనర్లు తమ పెన్షన్ డబ్బులో సింహభాగాన్ని హెల్త్ ఇన్సూరెన్స్, వైద్య చికిత్సలు, సంరక్షణ సేవలు, మందుల కోసమే కేటాయిస్తారని ఫెడరేషన్ గుర్తుచేసింది. సాధారణ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) కంటే ఈ వైద్య ఖర్చులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అలాంటప్పుడు ప్రభుత్వం ఇచ్చే డీఆర్ సవరణలు పెన్షనర్ల కొనుగోలు శక్తిని పూర్తిగా కాపాడలేవు. దీనివల్ల వృద్ధులు అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోందని, రోజువారీ ఖర్చులు నిర్వహించడం వారికి భారంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
సమస్యకు పరిష్కారం ఏంటి?
ఈ తీవ్రమైన సమస్యలను పరిష్కరించడానికి ఏఐడీఈఎఫ్ ఒక అద్భుతమైన ప్రతిపాదనను 8వ వేతన సంఘం ముందుంచింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక 'కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్' (ఉద్యోగుల జీవన వ్యయ సూచిక)ను రూపొందించాలని కోరింది. భవిష్యత్తులో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను నిర్ణయించేటప్పుడు ఉద్యోగుల అసలు ఖర్చుల మార్పులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేసింది. అలాగే 8వ వేతన సంఘం పరిధిలో జీతాలు, పెన్షన్లను సవరించేటప్పుడు వృద్ధుల వైద్య సేవలు, సంరక్షణ ఖర్చులను ప్రత్యేకంగా గుర్తించి న్యాయం చేయాలని ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది.
మరి 8వ వేతన సంఘం, కేంద్రం వీటిని పరిగణిస్తాయో లేదో రానున్న నెలల్లో తేలిపోతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


