8వ వేతన సంఘం: జనవరిలో 67 శాతానికి డీఏ.. 7వ పీసీ కింద ఇదే చివరిదా?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపి కబురు. 2027 జనవరి నాటికి కరువు భత్యం (డీఏ) 67 శాతానికి చేరే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం సిఫార్సుల అమలుకు ముందు 7వ పీసీ కింద ఇదే చివరి పెంపు కావచ్చని అంచనా వేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జనవరి 2027లో కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్) భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం 63 శాతంగా ఉన్న డీఏ ఏకంగా 67 శాతానికి చేరుకోవచ్చని తాజా అంచనాలు చెబుతున్నాయి. 8వ వేతన సంఘం నివేదిక తుది దశకు చేరుకుంటున్న తరుణంలో, పాత పే స్కేలు (7వ వేతన సంఘం) కింద ఉద్యోగులు అందుకునే చివరి డీఏ పెంపు ఇదే కావచ్చని భావిస్తున్నారు.

జూలై 1, 2026 నుంచి వర్తించేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల అక్టోబర్ 28న డీఏను 3 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఇది 60 నుంచి 63 శాతానికి చేరింది.
67 శాతానికి ఎలా చేరుతుందంటే..
జనవరి 2027 డీఏ పెంపు అనేది జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు నమోదయ్యే ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (AICPI-IW) సగటుపై ఆధారపడి ఉంటుంది. అక్టోబర్ 30న విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం సెప్టెంబర్ నెలలో ఈ ఇండెక్స్ 155.5 వద్ద నిలిచింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఇదే స్థాయిలో ఇండెక్స్ కొనసాగుతుందని ఊహిస్తే, 12 నెలల సగటు 152.36గా ఉంటుంది.
7వ వేతన సంఘం ఫార్ములా ప్రకారం ఈ లెక్కను పరిశీలిస్తే:
డీఏ = [{(సగటు AICPI-IW × 2.88) − 261.41} / 261.41] × 100
152.36 సగటు ఆధారంగా లెక్కిస్తే:
152.36 × 2.88 = 438.79
438.79 - 261.41 = 177.38
177.38 ÷ 261.41 = 0.67855
0.67855 × 100 = 67.85%
ఈ లెక్కల ప్రకారం, డీఏలో 4.85 శాతం పెరుగుదల ఉంటుంది. ప్రభుత్వం సాధారణంగా ఈ సంఖ్యను సవరించి ప్రకటిస్తుంది కాబట్టి, ఉద్యోగులకు 4 శాతం మేర పెంపు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో మొత్తం డీఏ 67 శాతానికి చేరుకుంటుంది. అయితే, ఇది కేవలం అంచనా మాత్రమే. అక్టోబర్-డిసెంబర్ నెలల తుది గణాంకాలను బట్టి డీఏ శాతంలో మార్పులు ఉండవచ్చు. తుది గణాంకాలు పెరిగితే డీఏ మరింత పెరగొచ్చు, తగ్గితే ఆశించిన దానికంటే తక్కువ పెంపు ఉండొచ్చు.
7వ పీసీ కింద ఇదే చివరి పెంపా?
"8వ వేతన సంఘం ప్యానెల్ సమావేశాలు, తీసుకునే నిర్ణయాలను బట్టి ఇదే ఆఖరి డీఏ పెంపు కావొచ్చు" అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2025లో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక సమర్పించడానికి 18 నెలల గడువు ఇచ్చారు. అంటే మే 2027 నాటికి నివేదిక ప్రభుత్వానికి చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత తుది సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని కొత్త వేతన సవరణలు అమల్లోకి వస్తాయి. కాబట్టి జనవరి 2027లో పెరిగే డీఏనే 7వ పే కమిషన్ కింద చివరిది అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కొత్త కమిషన్ రాకముందే డీఏ లెక్కింపు పద్ధతిలో మార్పులు తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. పాయింట్-టు-పాయింట్ డీఏను రౌండ్ ఆఫ్ చేయకుండా ఇవ్వాలని, అలాగే డీఏ లేదా డీఆర్ 25 శాతం దాటిన ప్రతిసారీ దానిని బేసిక్ పేలో కలపాలని ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఎన్‌పీవో) డిమాండ్ చేస్తోంది. 3 నెలల సగటు ఆధారంగా ప్రతి త్రైమాసికానికి ఒకసారి డీఏను సవరించాలని భారత్ పెన్షనర్స్ సమాజ్ కోరుతోంది.
8వ వేతన సంఘం సిఫార్సులను ప్రభుత్వం అధికారికంగా స్వీకరించి, ఆమోదించిన తర్వాత అప్పటివరకు ఉన్న డీఏ మొత్తాన్ని కొత్త బేసిక్ పేలో కలిపేస్తారు. అప్పుడు డీఏ లెక్కింపు మళ్లీ సున్నా నుంచి మొదలవుతుంది. దీన్ని బట్టి చూస్తే 67 శాతం డీఏనే ప్రస్తుత వేతన విధానంలో గరిష్ట స్థాయి కావొచ్చు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ద్రవ్యోల్బణం, 8వ వేతన సంఘం అమలుకు ప్రభుత్వం తీసుకునే సమయాన్ని బట్టి ఉద్యోగులకు కొత్త వేతన విధానం అమలులోకి రాకముందే మరో డీఏ పెంపు అందుతుందా లేదా అనేది తేలనుంది.
(గమనిక: ఈ కథనంలోని అంచనాలు సెప్టెంబర్ 2026 నాటి ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ డేటా, అక్టోబర్-డిసెంబర్ ఉజ్జాయింపు గణాంకాల ఆధారంగా చేసినవి. ద్రవ్యోల్బణం హెచ్చుతగ్గులు, ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా తుది డీఏ శాతంలో మార్పులు ఉంటాయి.)
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


