5, 6వ వేతన సంఘాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన డీఏ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ శుభవార్త చెప్పింది. 5, 6వ వేతన సంఘాల (సీపీసీ) కింద విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల కరువు భత్యాన్ని (డీఏ) సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1, 2026 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని (డీఏ) కేంద్రం ఇటీవలే పెంచిన సంగతి తెలిసిందే. ఏడో వేతన సంఘం (7th CPC) పరిధిలోని ఉద్యోగుల డీఏను 60 శాతం నుంచి 63 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇంకా పాత వేతన సంఘాల (5, 6వ సీపీసీ) కింద వేతనాలు పొందుతున్న వారికి సైతం కేంద్ర ఆర్థిక శాఖ తీపికబురు అందించింది. వీరి డీఏను భారీగా సవరిస్తూ ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయ విభాగం అక్టోబర్ 29న అధికారిక మెమోరాండం (ఓఎం) జారీ చేసింది. ఈ పెరిగిన డీఏ జూలై 1, 2026 నుంచి వర్తిస్తుందని స్పష్టం చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఎవరికి ఎంత మేర లబ్ధి చేకూరుతుందో వివరంగా చూద్దాం.

6వ వేతన సంఘం ఉద్యోగులకు డీఏ పెంపు ఇలా..
ఆర్థిక శాఖ గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. 6వ కేంద్ర వేతన సంఘం నిబంధనల మేరకు ఇంకా పాత పే స్కేల్ లేదా గ్రేడ్ పే కింద వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగుల కరువు భత్యం 262 శాతం నుంచి 269 శాతానికి పెరిగింది. అంటే, జూలై 2026 నుంచి వీరికి 7 శాతం అదనపు డీఏ లభిస్తుంది.
వీరికి ఆగస్టు 29, 2008 నాటి ఆర్థిక శాఖ మెమోరాండంలోని 3, 4, 5 పేరాల్లోని నిబంధనలు యథాతథంగా వర్తిస్తాయని తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆ నిబంధనల ప్రకారం.. నిర్దేశించిన పే బ్యాండ్‌లో తీసుకుంటున్న బేసిక్ పేకి, గ్రేడ్ పే కలిపి డీఏ లెక్కిస్తారు. కానీ స్పెషల్ పే వంటి ఇతర భత్యాలను ఇందులో కలపరు. హెచ్ఏజీ+ (HAG+), అపెక్స్ స్కేల్, క్యాబినెట్ సెక్రటరీ పే స్కేల్స్‌లో ఉన్న వారికి నిర్దేశిత స్కేల్లో తీసుకునే వేతనాన్నే బేసిక్ పేగా పరిగణిస్తారు. అలాగే నాన్-ప్రాక్టీసింగ్ అలవెన్స్ (ఎన్పీఏ) వర్తించే వారికి దాన్ని కూడా డీఏ లెక్కింపులో కలుపుతారు.
ఉదాహరణకు.. ఒక ఉద్యోగి బేసిక్ పే, గ్రేడ్ పే కలిపి రూ.20,000 అనుకుందాం. పాత డీఏ 262 శాతం ప్రకారం రూ.52,400 వస్తుంది. అదే కొత్త డీఏ 269 శాతం ప్రకారం లెక్కిస్తే ఆ మొత్తం రూ.53,800కి చేరుతుంది. అంటే ఆ ఉద్యోగికి నెలకు అదనంగా రూ.1,400 మేర పెంపు లభిస్తుంది.
5వ వేతన సంఘం ఉద్యోగులకు ఎంత పెరిగిందంటే..
అక్టోబర్ 29న ఆర్థిక శాఖ విడుదల చేసిన మరో ప్రకటనలో 5వ కేంద్ర వేతన సంఘం పరిధిలోని ఉద్యోగుల డీఏను సైతం సవరించారు. పాత పే స్కేల్స్ కింద వేతనాలు తీసుకుంటున్న వీరికి ప్రస్తుతం ఉన్న 483 శాతం డీఏను ఏకంగా 497 శాతానికి పెంచారు. అంటే వీరికి ఒకేసారి 14 శాతం మేర కరువు భత్యం పెరిగింది. ఇది కూడా జూలై 1, 2026 నుంచే అమల్లోకి వస్తుంది.
వీరికి అక్టోబర్ 3, 1997 నాటి ఆర్థిక శాఖ మెమోరాండంలోని 3, 4, 5 పేరాల నిబంధనలు వర్తిస్తాయి. దీని ప్రకారం.. నిర్దేశించిన పే స్కేల్‌తో పాటు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు, నాన్-ప్రాక్టీసింగ్ అలవెన్స్ (ఎన్పీఏ) కలిపి డీఏను లెక్కిస్తారు. స్పెషల్ పే, పర్సనల్ పే వంటి ఇతర భత్యాలు ఇందులో చేరవు.
ఉదాహరణకు.. 5వ సీపీసీ కింద ఒక ఉద్యోగి బేసిక్ పే రూ.10,000 అనుకుంటే, పాత 483 శాతం ప్రకారం రూ.48,300 డీఏ వచ్చేది. ఇప్పుడు 497 శాతానికి పెరగడంతో ఆ మొత్తం రూ.49,700 అవుతుంది. తద్వారా వీరికి కూడా నెలకు రూ.1,400 మేర అదనపు ప్రయోజనం కలుగుతుంది.
(గమనిక: ఈ వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. పూర్తి వివరాలు, నిర్దిష్ట నిబంధనల కోసం ఉద్యోగులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.)
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


