8th Pay Commission : 8వ వేతన సంఘం.. కీలకంగా 3.83 ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్! ఉద్యోగులకు వచ్చే లాభం ఏంటి?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం పనులకు వేగంగా ముందుకెళుతున్నాయి. ఉద్యోగ సంఘాలు కోరుతున్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, రూ. 69,000 కనీస వేతనం, రూ. 1.12 లక్షల జీతం గణాంకాల పూర్తి సమాచారం ఇక్కడ చూడండి..

Published on: Nov 1, 2026, 17:03:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లోనూ, పింఛనుదారుల్లోనూ 8వ వేతన సంఘం నివేదికపై తీవ్రమైన చర్చ సాగుతోంది. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటైన 3 సభ్యుల కమిషన్ తన 18 నెలల కాలపరిమితిలో ఇప్పటికే ఏడాది కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి మరో ఐదారు నెలల సమయం మాత్రమే ఉండటంతో వేతన సిఫార్సుల గణాంకాలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి.

కీలకంగా 3.83 ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్! ఉద్యోగులకు వచ్చే లాభం ఏంటి?
కీలకంగా 3.83 ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్! ఉద్యోగులకు వచ్చే లాభం ఏంటి?

ఇటీవల బెంగళూరు, ముంబై, లద్ధాఖ్, దిల్లీ వంటి నగరాల్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కమిషన్ వరుస సమావేశాలు నిర్వహించింది. ఈ భేటీల్లో భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్ (బీపీఎంఎస్), నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (ఎన్​సీ-జేసీఎం) వంటి ప్రముఖ ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను కమిషన్ ముందుంచాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా బేసిక్ పే, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లను భారీగా పెంచాలని స్పష్టం చేశాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది రైల్వే, డిఫెన్స్, ఇన్‌కమ్ టాక్స్, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెంపు వల్ల నేరుగా లబ్ధి చేకూరనుంది.

రూ. 69,000 కనీస వేతనం డిమాండ్ వెనుక ఉన్న లెక్కలు ఇవే..

ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద ఉద్యోగి కనీస బేసిక్ పే రూ. 18,000గా ఉంది. అయితే 8వ పే కమిషన్‌లో ఈ కనీస బేసిక్ పేను ఏకంగా రూ. 69,000కి పెంచాలని ఎన్‌సీ-జేసీఎమ్ ప్రతిపాదించింది. ఈ మొత్తాన్ని ఏదో ఊహాజనితంగా చెప్పకుండా ఒక శాస్త్రీయ పద్ధతిలో లెక్క కట్టినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి:

5 మంది సభ్యులు ఉన్న ఒక సగటు కుటుంబ నెలవారీ కనీస అవసరాలను పరిగణనలోకి తీసుకున్నారు.

ఆహారం, దుస్తులు, అద్దె ఇల్లు, విద్యుత్, ఇంధనం, నీటి రుసుములు, విద్య, పండుగల ఖర్చులు, టెక్నాలజీ (ఫోన్/ఇంటర్నెట్) వ్యయాలను లెక్కించారు.

ఈ ఖర్చులన్నీ కలిపితే నెలకు రూ. 68,947 కాగా, దానిని రౌండ్ ఫిగర్ చేసి గ్రూప్-సీ ఉద్యోగుల కనీస వేతనంగా రూ. 69,000 గా ప్రతిపాదించారు.

3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎలా వచ్చింది?

వేతన పెంపును నిర్ణయించడంలో ‘ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్’ అత్యంత కీలకం. ఉద్యోగులు కోరుతున్న రూ. 69,000 కనీస వేతనాన్ని, ప్రస్తుతం ఉన్న రూ. 18,000 కనీస వేతనంతో భాగించగా ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ లభించింది.

గణన పద్ధతి:

రూ. 69,00 / రూ. 18,000 = 3.833.

అంటే 8వ వేతన సంఘంలో 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. (కొన్ని ఉద్యోగ సంఘాలు 4.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కూడా కోరుతున్నాయి).

పే స్కేల్ 3 ఉద్యోగులకు రూ. 1.12 లక్షల జీతం ఎలా సాధ్యం?

ఉద్యోగ సంఘాల ప్రతిపాదనల ప్రకారం 7వ పే కమిషన్‌లో ఉన్న లెవెల్ 4 (రూ. 25,500 - రూ. 81,100, లెవెల్ 5 (రూ. 29,200 - రూ. 92,300) లను విలీనం చేసి ‘పే స్కేల్ 3’గా మార్చాలని కోరుతున్నాయి.

ఈ విలీన స్కేల్ ఆధారంగా బేసిక్ పే గణన ఇలా ఉంటుంది:

ప్రస్తుతం లెవెల్ 5లో ప్రారంభ బేసిక్ పే రూ. 29,200.దీనికి ప్రతిపాదిత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.833ను గుణిస్తే:

రూ. 29,200 x 3.833 = రూ. 1,11,924.

ఈ మొత్తాన్ని రౌండ్ ఫిగర్ చేస్తే ఆరంభ బేసిక్ పే రూ. 1.12 లక్షలు అవుతుంది.అలాగే గరిష్ట బేసిక్ పే (రూ. 92,300 x 3.833) దాదాపు రూ. 3.54 లక్షల వరకు చేరుకుంటుంది.

8వ వేతన సంఘం సిఫార్సులు.. ప్రభుత్వం ఎప్పుడు ఆమోదిస్తుంది?

ఇవి ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు 8వ వేతన సంఘానికి ఇచ్చిన సలహాలు, విజ్ఞప్తులు మాత్రమేనని ఉద్యోగులు గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం లేదా పే కమిషన్ ఇంకా వీటిని అధికారికంగా ఆమోదించలేదు.

జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని కమిటీ తన నివేదికను రూపొందించేటప్పుడు ఈ ప్రతిపాదనలను స్వీకరించవచ్చు, సవరించవచ్చు లేదా మార్చవచ్చు. 8వ వేతన సంఘం తన తుది నివేదికను 2027 మే - జూన్ నాటికి ప్రభుత్వానికి సమర్పించే అవకాశముంది. అప్పటివరకు అధికారిక ప్రకటనల కోసం వేచి చూడక తప్పదు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More