8th pay commission : 8వ వేతన సంఘం ముందు పెన్షనర్ల కీలక డిమాండ్లు- సాధ్యమేనా?

8వ వేతన సంఘం చెన్నై సమావేశాల్లో పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ, కనీస వేతనం రూ. 68,000కు పెంపుతో పాటు ఐదు ప్రధాన డిమాండ్లను పింఛనుదారులు ముందుకు తెచ్చారు. వాటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Sep 11, 2026, 14:02:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

8వ వేతన సంఘం సంప్రదింపుల ప్రక్రియ వేగవంతమైంది. ఇటీవల తమిళనాడు రాజధాని చెన్నైలో ముగిసిన కీలక సమావేశాల్లో 'చెన్నై జీపీఓ పెన్షనర్ల ఫోరం' ప్రతినిధులు పలు కీలక డిమాండ్లను కమిషన్ ముందు ఉంచారు. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత సిబ్బందితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చూపు ఇప్పుడు ఈ వేతన సంఘం తీర్పుపైనే నెలకొంది.

8వ వేతన సంఘం లేటెస్ట్ అప్డేట్స్..
8వ వేతన సంఘం లేటెస్ట్ అప్డేట్స్..

ఐదు కీలక డిమాండ్లు ఇవే..

చెన్నై వేదికగా జరిగిన చర్చల్లో పింఛనుదారులు 8వ వేతన సంఘం ముందు ప్రధానంగా ఐదు అంశాలపై పట్టుబట్టారు:

పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) పునరుద్ధరణ: దేశవ్యాప్తంగా ఉద్యోగులు సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ఓపీఎస్ విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని కోరారు.

పెన్షన్, కుటుంబ పెన్షన్ పెంపు: పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని డిమాండ్ చేశారు.

కమ్యూటేషన్ రికవరీ నిబంధనల సవరణ: పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ విధానంలో ఉన్న అస్పష్టతను తొలగించి, ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కలిగించేలా స్పష్టమైన రూల్స్ తేవాలన్నారు.

ఎంఏసీపీ ప్రయోజనాల నవీకరణ: మోడిఫైడ్ అస్యూర్డ్ కెరీర్ ప్రోగ్రెషన్ స్కీమ్‌ను అప్‌డేట్ చేసి, ముఖ్యంగా తపాలా (పోస్టల్) శాఖ ఉద్యోగులకు మెరుగైన పదోన్నతులు, వేతన శ్రేణులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

సామాజిక భద్రత, సెలవుల సవరణ: ఉద్యోగులు, పెన్షనర్ల సామాజిక భద్రతను పటిష్టం చేస్తూ అలవెన్సులు, సెలవు నిబంధనలను సవరించాలని కోరారు.

'కనీస వేతనం రూ. 68,000 సాధించడమే లక్ష్యం'

కేవలం పెన్షన్లకే పరిమితం కాకుండా, ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ. 68,000కు పెంచాలని ప్రతినిధులు 8వ వేతన సంఘం టీమ్​కి స్పష్టం చేశారు. వేతన సవరణ కోసం పదేళ్ల సుదీర్ఘ కాలం వేచి చూడకుండా నిరంతర వేతన సవరణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు ప్రస్తుత పే-మాట్రిక్స్‌కు తోడుగా 'రన్నింగ్ స్కేల్స్' తీసుకురావాలని, దివ్యాంగులు, మహిళా ఉద్యోగుల ప్రత్యేక అవసరాలను తీర్చేలా సీపీసీ సిఫార్సులు ఉండాలని కోరారు.

చట్టపరమైన చిక్కులు.. న్యాయ నిపుణుల విశ్లేషణ

ఈ డిమాండ్లలో ఉన్న చట్టపరమైన అంశాలపై సీఎమ్‌ఎస్ ఇండస్‌లా పార్టనర్ అమృత తొంక్ స్పందిస్తూ ఓ జాతీయా మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు.

"పెన్షన్, గ్రాట్యుటీ అనేవి ఉద్యోగి అందించిన సేవలకు లభించే హక్కులు. 2026 కంటే ముందు రిటైర్ అయిన వారి ప్రయోజనాలను తగ్గించడం లేదా మార్చడం చట్టరీత్యా సాధ్యపడదు. పాత నిబంధనలను సవరించి కొత్తవారికి మాత్రమే మార్పులు వర్తింపజేయడమే చట్టబద్ధమైన సురక్షిత మార్గం," అని ఆమె వివరించారు.

అలాగే సివిల్ ఉద్యోగులకు ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ అమలు చేయడంపై స్పందిస్తూ— "సైనిక బలగాలతో పోలిస్తే సివిల్ సర్వీసెస్‌లో వివిధ కేడర్లు, రిక్రూట్‌మెంట్ నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. అందరికీ ఒకే ఓఆర్‌ఓపీ ఫార్ములా తెస్తే కొత్త వివాదాలు తలెత్తుతాయి," అని ఆమె పేర్కొన్నారు.

అయితే వార్షిక వేతన పెంపుదల సవరణ సులభమైన ప్రక్రియ అని చెప్పారు.

మే-జూన్ 2027 నాటికి తుది నివేదిక!

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన 2025 నవంబర్ 3న ఏర్పాటైన ఈ 8వ వేతన సంఘానికి 18 నెలల కాలవ్యవధి ఉంది. ఇప్పటివరకు 10 నెలల పని పూర్తి చేసుకున్న ఈ కమిషన్, 2027 మే-జూన్ నాటికి కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించనుంది.

చెన్నై భేటీల అనంతరం వేతన సంఘం బృందం సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో చండీగఢ్‌లో పర్యటించనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More