8th Pay Commission : 8వ పే కమిషన్.. 2027లో ఉద్యోగుల చేతికి కొత్త జీతాలు?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు 8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పెరిగిన వేతనాలు చేతికి అందేందుకు 2027 వరకు వేచి చూడాల్సి రావచ్చు. నివేదిక గడువు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, అరియర్స్‌పై పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

Published on: Nov 12, 2026, 06:45:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు పెరిగిన జీతాలు, పెన్షన్లు చేతికి అందడానికి 2027 వరకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. 8వ వేతన సంఘం పనులు వేగంగా సాగుతున్నప్పటికీ, సిఫార్సులు తుది రూపు దాల్చి ప్రభుత్వ ఆమోదం పొందేందుకు మరికొంత సమయం పడుతుంది. డిఫెన్స్ సిబ్బంది, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, కేంద్ర పాలిత ప్రాంతాల సిబ్బందితో పాటు న్యాయాధికారులు, వివిధ ప్రభుత్వ విభాగాల ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, సర్వీసు నిబంధనలను ఈ కమిషన్ సమగ్రంగా సమీక్షించనుంది.

8వ వేతన సంఘం లేటెస్ట్ అప్డేట్స్..
8వ వేతన సంఘం లేటెస్ట్ అప్డేట్స్..

నివేదిక సమర్పణ గడువు ఎప్పుడు?

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2025 నవంబర్ 3న 8వ వేతన సంఘాన్ని అధికారికంగా ఏర్పాటు చేసింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ చైర్‌పర్సన్‌గా, ప్రొఫెసర్ పులక్ ఘోష్ తాత్కాలిక సభ్యుడిగా, పంకజ్ జైన్ సభ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. పే కమిషన్ తన విధివిధానాల ఖరారు తర్వాత 18 నెలల్లోగా నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైతే మధ్యంతర నివేదికలను కూడా అందించే వెసులుబాటు ఉంది.

2026 నవంబర్ 3 నాటికి కమిషన్ ఏర్పడి ఏడాది పూర్తయింది. నిబంధనల ప్రకారమైతే 2027 మే 3 నాటికి తుది నివేదికను అందజేయాలి. అయితే ఈ గడువు కేవలం నివేదిక సమర్పణకు నిర్దేశించిన సమయం మాత్రమే. ప్రభుత్వం నివేదికను పరిశీలించి ఆమోద ముద్ర వేసి ఉత్తర్వులు జారీ చేసే వరకు పెరిగిన జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ కావు.

నివేదిక రాగానే వెంటనే జీతాలు పెరుగుతాయా?

8వ పే కమిషన్ నివేదిక ఇవ్వగానే తక్షణమే జీతాలు పెరిగిపోవు. ప్రస్తుత వేతన నిర్మాణాలు, అలవెన్సులు, పింఛన్లు, ఇతర సర్వీసు ప్రయోజనాలను పరిశీలించి మార్పులను ప్రతిపాదించడమే కమిషన్ ప్రధాన బాధ్యత. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలిస్తుంది. ఏయే సిఫార్సులను ఆమోదించాలో ప్రభుత్వం నిర్ణయించిన తర్వాతే సంబంధిత ఉత్తర్వులు వెలువడతాయి.

ఈ ప్రక్రియలో భాగమైన సంప్రదింపుల విధానాన్ని కమిషన్ ఇప్పటికే వేగవంతం చేసింది. 2026 మార్చి 5 నుంచి జూన్ 15 వరకు ఉద్యోగులు, పింఛనుదారులు, ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలు, విజ్ఞాపనపత్రాలను స్వీకరించింది.

2026 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందా?

సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సంఘం నివేదికల ఆధారంగా జీతాలు సవరించడం ఆనవాయితీగా వస్తోంది. 2025 అక్టోబర్ 28న విడుదల చేసిన ప్రకటనలో, 8వ వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రావడం సహజమైన ప్రక్రియ అని ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ ప్రభుత్వం 2027లో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, 2026 జనవరి 1 నుంచి అమలును లెక్కిస్తే, ఆ మధ్యకాలానికి సంబంధించిన వ్యత్యాస మొత్తాన్ని ఉద్యోగులకు బకాయిల రూపంలో ఒకేసారి చెల్లిస్తారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉన్న వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే, డిఫెన్స్ సిబ్బందితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. కేంద్ర వేతన సంఘం ప్రతిపాదనలు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగానే భవిష్యత్తులో రాష్ట్ర పీఆర్‌సీ నివేదికలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.

ఎంత జీతం పెరిగే అవకాశం ఉంది?

జీతాల సవరణ అనేది కమిషన్ సిఫార్సు చేసే ‘ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్’పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత ప్రాథమిక వేతనాన్ని పెంచడానికి ఉపయోగించే గుణకాన్నే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటారు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి ప్రస్తుత ప్రాథమిక వేతనం రూ. 18,000 అనుకుంటే, 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను వర్తింపజేస్తే సవరించిన ప్రాథమిక వేతనం రూ. 46,260 (రూ. 18,000 × 2.57) అవుతుంది.

కమిషన్ 2027 మే నాటికి నివేదిక సమర్పించినా, ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు ఉద్యోగులకు పెరిగిన జీతాలు ఎంత అనేదానిపై వేచి చూడక తప్పదు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More