Home loan : మీ రూ. 1కోటి హోమ్ లోన్ని బ్యాంకు అఫ్రూవ్ చేస్తోంది సరే.. ఆ భారాన్ని మీరు మేనేజ్ చేయగలరా?
కోటి రూపాయల ఇల్లు కొనడం కేవలం డౌన్‌పేమెంట్, బ్యాంక్ లోన్ పొందే అర్హతపైనే ఆధారపడి ఉండదు. నెలకు వచ్చే జీతంలో ఈఎంఐ భారం కాకుండా ఇల్లు సొంతం చేసుకోవాలంటే ఎంత సంపాదించాలో, ఆర్థిక నిపుణులు సూచించే పక్కా గణాంకాలు ఇక్కడ చూడండి..
సొంత ఇల్లు అనేది ప్రతీ ఒక్కరి కల. ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఇప్పుడు ఎవరిని అడిగినా “చిన్న ఇల్లు అనేది రూ. 1కోటి కన్నా తక్కువకు రావడం లేదు” అన్న మాటలే వినిపిస్తున్నాయి. అయితే, కోటి రూపాయల విలువైన ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు కేవలం బ్యాంక్ ఎంత రుణం ఇస్తుందనే అంశంపైనే కాకుండా, ప్రతి నెలా కట్టే ఈఎంఐ.. కుటుంబ బడ్జెట్‌ను, అత్యవసర పొదుపును దెబ్బతీయకుండా ఉందా లేదా అనేది నిశితంగా పరిశీలించాలి.

డౌన్‌పేమెంట్ ఎంత? ఈఎంఐ భారం ఎంత?
సాధారణంగా బ్యాంకులు ఆస్తి విలువలో 80 శాతం వరకు రుణం అందిస్తాయి. అంటే రూ. 1 కోటి విలువైన ఇంటి కోసం కొనుగోలుదారుడు ముందుగా 20 శాతం, అంటే రూ. 20 లక్షలు డౌన్ పేమెంట్‌గా సమకూర్చుకోవాలి. మిగిలిన రూ. 80 లక్షల మొత్తాన్ని హోమ్ లోన్ రూపంలో పొందాల్సి ఉంటుంది.
ఉదాహరణకు, రూ. 80 లక్షల రుణాన్ని ఏడాదికి 8 శాతం వడ్డీ రేటుతో 20 సంవత్సరాల కాలపరిమితికి తీసుకుంటే, ప్రతి నెలా సుమారు రూ. 66,900 ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది.
నెలకు ఎంత జీతం ఉంటే ఈ ఇల్లు సురక్షితం?
"బ్యాంక్ మనకు ఎంత రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉందనే దానికంటే, ప్రతి నెలా ఆ ఈఎంఐని మనం ఎంత సులువుగా కట్టగలమనేదే ప్రధానం," అని బజాజ్ క్యాపిటల్ జాయింట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ బజాజ్ వెల్లడించారు.
ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం.. హోమ్ లోన్ ఈఎంఐ అనేది మీ నెలాఖరున చేతికి వచ్చే టేక్ హోమ్ శాలరీలో 25 నుంచి 30 శాతానికి మించకూడదు. ఈ సూత్రాన్ని పాటిస్తే, ప్రతి నెలా రూ. 66,900 ఈఎంఐని సునాయాసంగా చెల్లించడానికి, ఇతర పెద్ద అప్పులు ఏవీ లేవని భావిస్తే, కొనుగోలుదారుడికి నెలకు కనీసం రూ. 2.2 లక్షల నుంచి రూ. 2.3 లక్షల నికర వేతనం ఉండాలి!
లోన్ టెన్యూర్ | నెలవారీ ఈఎంఐ (సుమారు) | 30శాతం ఈఎంఐ- ఆదాయం రేషియోలో టేక్ హోమ్ శాలరీ |
| 15 సంవత్సరాలు | రూ. 76,500 | రూ. 2.55 లక్షలు |
| 20 సంవత్సరాలు | రూ. 66,900 | రూ. 2.23 లక్షలు |
| 30 సంవత్సరాలు | రూ. 58,700 | రూ. 1.96 లక్షలు |
| Note: వార్షిక వడ్డీని 8శాతంగా తీసుకోవడం జరిగింది. కానీ వాస్తవ ఈఎంఐ అనేది రుణదాత ఆఫర్ చేసే వడ్డీపై ఆధారపడి ఉంటుంది. | ||
20 ఏళ్లలో కట్టే అసలు, వడ్డీ లెక్కలివే..
రూ. 80 లక్షల హోమ్ లోన్‌ను 8 శాతం వడ్డీతో 20 ఏళ్ల పాటు చెల్లిస్తే, కాలపరిమితి తీరేసరికి అసలు, వడ్డీ కలిపి మొత్తంగా దాదాపు రూ. 1.61 కోట్లు రీపేమెంట్ చేయాల్సి వస్తుంది! అంటే తీసుకున్న రూ. 80 లక్షల రుణానికి కేవలం వడ్డీ రూపంలోనే రూ. 81 లక్షలు అదనంగా చెల్లిస్తారు.
తక్కువ కాలపరిమితి ఎంచుకుంటే ఈఎంఐ పెరుగుతుంది కానీ, మొత్తంగా చెల్లించే వడ్డీ భారం తగ్గుతుంది. కాలపరిమితి పెంచితే నెలవారీ ఈఎంఐ తగ్గినప్పటికీ, వడ్డీ భారం పెరుగుతుంది. కనుక వ్యక్తిగత ఆర్థిక సామర్థ్యాన్ని బేరీజు వేసుకుని ఈ నిర్ణయం తీసుకోవాలి.
ఈఎంఐ మాత్రమే కాదు- ఈ అదనపు ఖర్చులనూ మర్చిపోవద్దు..
ఇంటి కొనుగోలులో డౌన్‌పేమెంట్, నెలవారీ ఈఎంఐ మాత్రమే కాకుండా ఇతర అదనపు ఖర్చులు కూడా ఉంటాయి.
- స్టాంప్ డ్యూటీ - రిజిస్ట్రేషన్ ఛార్జీలు
- ఇంటీరియర్ డిజైన్, ఫర్నిచర్ ఖర్చులు
- సొసైటీ మెయింటెనెన్స్, కార్ పార్కింగ్ ఛార్జీలు
ఈ ఖర్చులు కలుపుకుంటే ఇల్లు చేతికి వచ్చేసరికి మరో 10 నుంచి 15 శాతం అదనంగా అవసరమవుతాయి. ఉన్న పొదుపు మొత్తాన్ని పూర్తిగా ఇంటి కొనుగోలుకే ఉపయోగిస్తే, అత్యవసర సమయాల్లో నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే హెల్త్ ఎమర్జెన్సీ ఫండ్, భవిష్యత్ అవసరాల కోసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టిన తర్వాతే ఇల్లు కొనడం సురక్షితం.
బ్యాంకులు రుణం మంజూరు చేసినంత మాత్రాన ఆ ఇల్లు మన బడ్జెట్‌లోకి వచ్చినట్లు కాదు. కార్ లోన్, పర్సనల్ లోన్ లేదా కుటుంబ బాధ్యతలు ఉన్నవారు తమ నెలవారీ బడ్జెట్‌ను సమగ్రంగా అంచనా వేసుకుని ముందడుగు వేయడం శ్రేయస్కరం అని నిపుణులు సూచిస్తున్నారు.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. లోన్ తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


