హైప్ పీక్స్.. రిజల్ట్ జీరో! సిరాజ్ జెర్సీ వేసుకున్నా మారని అభిషేక్ శర్మ లక్.. నంబర్ వన్ బ్యాటర్ సున్నాకే పరిమితం
డేంజరస్ ఓపెనర్, క్రీజులోకి వచ్చాడంటే సిక్సర్ల మోత.. ఇలా టీ20 ప్రపంచకప్ కు ముందు అభిషేక్ శర్మపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ ఈ వరల్డ్ కప్ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ అతను డకౌట్ అయ్యాడు. నెదర్లాండ్స్ తో పోరులో సిరాజ్ జెర్సీ వేసుకుని వచ్చినా అతని లక్ మారలేదు.
టీ20 ప్రపంచకప్ కు ముందు ఇండియన్ టీమ్ పై భారీ హైప్ రావడానికి ప్రధాన కారణం అభిషేక్ శర్మ. ఈ ప్రపంచ టీ20 నంబర్ వన్ బ్యాటర్ పొట్టి కప్ లో చెలరేగుతాడని ఫ్యాన్స్ ఆశించారు. ఇండియా కచ్చితంగా 300 స్కోరు అందుకుంటుందని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. అభిషేక్ శర్మ విధ్వంసం పక్కనపెడితే కనీసం ఒక్క రన్ కూడా చేయలేకపోతున్నాడు.

మూడు డకౌట్లు
అభిషేక్ శర్మ ఎంతటి డేంజరస్ ప్లేయరో మనకు తెలిసిందే. ఫస్ట్ బాల్ నుంచే అతని ఊతకోత మొదలవుతుంది. అతను ఆడుతుంటే బాల్ గ్రౌండ్ లో కంటే ఎక్కువగా బౌండరీ బయటే ఉంటుంది. కానీ ఏమైందో ఏమో టీ20 వరల్డ్ కప్ లో అభిషేక్ బ్యాట్ సైలెంట్ అయిపోయింది. అతను ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ డకౌట్ అయ్యాడు.
ఒక్క రన్ చేయలేక
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ తన తొలి మ్యాచ్ లో అమెరికాను ఢీ కొట్టింది. ఈ పోరులో అభిషేక్ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగుతాడని, ఇండియా 300 స్కోరు అందుకుంటుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అభిషేక్ శర్మ డకౌటై షాకిచ్చాడు. ఆ తర్వాత కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్ లో అభిషేక్ ఆడలేదు.
ఇక అత్యంత కీలకమైన, ఎంతో ప్రతిష్ఠాత్మకమైన పాకిస్థాన్ తో మ్యాచ్ లోనూ అందరి ఫోకస్ అభిషేక్ పైనే నెలకొంది. కానీ మళ్లీ ఫస్ట్ ఓవర్లోనే సున్నాకే పెవిలియన్ చేరిపోయాడు. ఇక నెదర్లాండ్స్ తో పోరులోనూ అదే రిపీట్ అయింది. బ్యాట్ ను గాల్లోకి ఊపి బౌల్డ్ అయ్యాడు. ముందు అభిషేక్ సింగిల్ తీయాలనే సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజం సూచననూ అతను పట్టించుకోలేదు.
సిరాజ్ జెర్సీ
వరుసగా ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ డకౌటైన అభిషేక్ నెదర్లాండ్స్ తో పోరులో ఎలాగైనా పుంజుకోవాలని అనుకున్నాడు. లక్ కోసం తన టీమ్ మేట్ సిరాజ్ జెర్సీ వేసుకుని అభిషేక్ బ్యాటింగ్ కు వచ్చాడు. కానీ రిజల్ట్ సేమ్. మూడు బాల్స్ ఆడి ఒక్క రన్ కూడా చేయకుండా పెవిలియన్ చేరిపోయాడు.
"అదృష్టం మారడానికి అభిషేక్ వేరే జెర్సీ వేసుకుని వచ్చాడు" అని నెదర్లాండ్స్ తో మ్యాచ్ సందర్భంగా మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ నాజర్ హుస్సేన్ వ్యాఖ్యానించాడు. "మళ్లీ ఔట్, వరుసగా మూడు డక్‌లు. ఈ ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్ 1 బ్యాటర్ వరుసగా 0, 0, 0 చేశాడంటే నమ్ముతారా’’ అని హుస్సేన్ అన్నాడు.
స్పిన్నర్ తో బౌలింగ్
‘‘అభిషేక్ ఫస్ట్ బాల్ నుంచే దూకుడుగా ఆడే ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్ లోనూ అదే చేయాలనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు బౌల్డ్ అయ్యాడు. ఆ రెండు డాట్ బాల్స్ అతనిపై ఒత్తిడి పెంచి ఉండొచ్చు. సిక్సర్ తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయగల ఆటగాడిగా పేరు వస్తే అందుకు తగ్గట్లుగానే ఆడాలని అనుకుంటారు. అభిషేక్ అదే చేయాలనుకుంటున్నాడు. స్పిన్నర్ తో అతనికి బౌలింగ్ వేయించడం మంచి ప్లాన్. మూడో డక్’’ అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.

E-Paper












