Artificial Intelligence : ఏఐతో ఉద్యోగం పోతుందని భయంగా ఉందా? ఈ కోర్సులు చేస్తే ప్రయోజనం..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో 30, 40 ఏళ్లలో ఉన్న నిపుణుల్లో ఉద్యోగ భద్రతపై ఆందోళన మొదలైంది. భయాన్ని పొగొట్టుకుని, ఏఐ టూల్స్‌ను నేర్చుకోవడం ద్వారా మీ కెరీర్‌ను ఎలా కాపాడుకోవాలో ఈ కథనం వివరిస్తుంది..
ప్రస్తుతం 30 ఏళ్ల చివరలో లేదా 40 ఏళ్ల వయసులో ఉన్న నిపుణుల్లో ఒక రకమైన ఆందోళన పెరుగుతోంది. ఇది బయటకు వినిపించకపోయినా, నిరంతరం వెంటాడే భయం! అదే.. “ఏఐ వల్ల నా ఉద్యోగం కూడా పోతుందా?” అని.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పుట్టుకొస్తున్న ఆటోమేషన్ టూల్స్ ఇప్పుడు ఉద్యోగ స్వభావాలనే మార్చేస్తున్నాయి. నివేదికలు రూపొందించడం, డేటాను విశ్లేషించడం, కోడింగ్ రాయడం, ఆఖరికి ప్రజెంటేషన్లు సిద్ధం చేయడం వంటి పనులన్నీ ఏఐ చిటికెలో చేసేస్తోంది. ఒకప్పుడు ఏళ్ల తరబడి అనుభవం ఉన్నవారు మాత్రమే చేయగలిగిన పనులను ఇప్పుడు ఇంటెలిజెంట్ సిస్టమ్స్ సులభతరం చేస్తున్నాయి.
అయితే మీరు 40 ఏళ్ల వయసులో మళ్లీ కొత్తగా కెరీర్‌ని ప్రారంభించాల్సిన అవసరం లేదు. కానీ మీరు 'ఏఐ-ఎనేబుల్డ్' నిపుణులుగా మారడం మాత్రం అత్యంత కీలకం. నేటి ఏఐ ప్రపంచంలో మీరు ఉద్యోగం కోల్పోకుండా ఉండాలంటే, మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న కొన్ని కోర్సుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
1. ఓపెన్ ఏఐ విధానంలో నైపుణ్యం (కోడింగ్ లేకుండా)
భారతదేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఓపెన్ఏఐ తన పరిధిని విస్తరిస్తున్న తరుణంలో, కోడింగ్ అవసరం లేకుండానే కింది వాటి ద్వారా ఏఐ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు:
ప్రాంప్ట్ ఇంజనీరింగ్: ఏఐ నుంచి ఖచ్చితమైన సమాధానాలు రాబట్టడం ఎలా?
ఏఐ-అసిస్టెడ్ రీసెర్చ్: పరిశోధన, డాక్యుమెంటేషన్ వేగవంతం చేయడం.
వర్క్‌ఫ్లో ఆటోమేషన్: రోజువారీ వ్యాపార పనులను ఏఐతో అనుసంధానించడం.
ప్రపంచ స్థాయి ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న జనరేటివ్ ఏఐ కోర్సులు నేర్చుకోవడం ద్వారా, మీ సహోద్యోగుల కంటే మీరు మెరుగ్గా పనిచేయవచ్చు.
2. నాన్-టెక్ నిపుణుల కోసం ఏఐ లిటరసీ
గూగుల్ ఏఐ ప్రొఫెషనల్ సర్టిఫికెట్-
ప్రారంభ స్థాయి నిపుణులు, మేనేజర్ల కోసం రూపొందించిన ఈ ప్రోగ్రామ్ ప్రధానంగా కింది అంశాలపై దృష్టి పెడుతుంది:
ఏఐ ప్రాథమిక సూత్రాలు, ఎథికల్ ఏఐ (నైతిక విలువలు).
పని ప్రదేశంలో ఏఐని ఆచరణాత్మకంగా ఎలా ఉపయోగించాలి?
రియల్ వరల్డ్ కేస్ స్టడీస్.
ఇది ఇంగ్లీష్‌తో పాటు హిందీలోనూ లభిస్తుంది (త్వరలో మరిన్ని భారతీయ భాషల్లో రానుంది). మేనేజర్లు, హెచ్ఆర్, కన్సల్టెంట్స్, అనలిస్టులకు ఇది సరైన ఎంపిక. మీరు మీ డొమైన్ నైపుణ్యానికి ఏఐని జోడిస్తే, టెక్నికల్ స్కిల్స్ మాత్రమే ఉన్నవారికంటే మీరే ముందుంటారు.
3. డేటా అనలిటిక్స్: సురక్షితమైన మార్గం
ఏఐకి డేటానే ఇంధనం. కాబట్టి డేటాను అర్థం చేసుకునే వారికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
సర్టిఫికేషన్లు: బిజినెస్ అనలిటిక్స్, ఎస్‌క్యూఎల్ బేసిక్స్, ఎక్సెల్ డాష్‌బోర్డ్స్ మరియు డేటా స్టోరీ టెల్లింగ్.
ఎవరికి?: ఫైనాన్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, స్ట్రాటజీ విభాగాల్లో ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరం. దీనివల్ల మీరు కేవలం పని చేసే స్థాయి నుంచి నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదుగుతారు.
4. ఎగ్జిక్యూటివ్ ఏఐ, డిజిటల్ స్ట్రాటజీ (ఐఐటీ కోర్సులు)
ప్రస్తుతం పలు ఐఐటీలు పని చేసే నిపుణుల కోసం ప్రత్యేక ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి:
బిజినెస్ లీడర్స్ కోసం ఏఐ.
డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, ఏఐ ఆధారిత నిర్ణయాలు.
ఇవి స్వల్పకాలికంగా ఉండి, హైబ్రిడ్ లేదా వీకెండ్ ఫార్మాట్‌లో నిర్వహిస్తారు. నాయకత్వ స్థానాల్లో ఉండేవారికి ఇవి సురక్షితమైన కెరీర్ మార్గాలు.
5. క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ
ఐటీ రంగంలో ఆటోమేషన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారు క్లౌడ్ ఆర్కిటెక్చర్, దేవోప్స్ లేదా సైబర్ సెక్యూరిటీ వైపు దృష్టి పెట్టవచ్చు. డిజిటలైజేషన్ పెరుగుతున్న కొద్దీ వీటికి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది.
6. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉచిత మార్గాలు
SWAYAM: భారత్ ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్లాట్‌ఫామ్‌లో తక్కువ ఖర్చుతో లేదా ఉచితంగా ఏఐ కోర్సులు నేర్చుకోవచ్చు.
స్కిల్ ఇండియా డిజిటల్: ఉపాధిని పెంచే స్వల్పకాలిక సర్టిఫికేషన్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
నిపుణుల కోసం సూచనలు: దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి?
ఏ కోర్సులో చేరాలన్నా ముందుగా ఈ ప్రశ్నలు వేసుకోండి:
ఇది నా ప్రస్తుత ఉద్యోగానికి బలాన్నిస్తుందా?
నేను ఒక ఎదుగుతున్న రంగానికి మారడానికి ఇది సహాయపడుతుందా?
ఉద్యోగం మానేయకుండా దీనిని పూర్తి చేయగలనా?
స్పష్టమైన కెరీర్ ఫలితం లేని ఖరీదైన, సుదీర్ఘకాలం సాగే ప్రోగ్రామ్‌లకు దూరంగా ఉండండి.
ఏఐ ఎఫెక్ట్- వాస్తవం ఏంటి?
ఓపెన్ఏఐ వంటి సంస్థలు భారతీయ కళాశాలల్లోకి ప్రవేశించడం, గూగుల్ తన ఏఐ టూల్స్‌ను పరీక్షల ప్రిపరేషన్, నైపుణ్యాభివృద్ధిలో భాగం చేయడం చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది: ఇకపై 'ఏఐ పరిజ్ఞానం' అనేది ఒక ఆప్షన్ కాదు, అది మన మనుగడకు అత్యవసరం.
అయితే ఏఐ అనేది అనుభవం ఉన్న నిపుణులను రాత్రికి రాత్రే తొలగించలేదు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మారడానికి నిరాకరించే నిపుణులను మాత్రం అది భర్తీ చేస్తుంది. 30, 40 ఏళ్ల వయసులో ఉన్న వారికి ఇండస్ట్రీ అవగాహన, లీడర్‌షిప్ మెచ్యూరిటీ, నెట్‌వర్క్ అనేవి బలమైన ఆయుధాలు. వీటికి ఏఐ నైపుణ్యాన్ని తోడు చేస్తే మిమ్మల్ని భర్తీ చేయడం ఎవరికీ సాధ్యం కాదు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


