...
...
Next Story

Electric scooter : సింగిల్ చార్జ్‌తో 187 కి.మీ రేంజ్! విడా వీఎక్స్2 ప్లస్​​లో కొత్త వేరియంట్..

Vida VX2 Plus : దేశీయ దిగ్గజ టూ-వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ విభాగం 'విడా' నుంచి సరికొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 4.4kWh బ్యాటరీ ప్యాక్‌తో రూపుదిద్దుకున్న ఈ స్కూటర్, ఎలాంటి రేంజ్ ఆందోళనలు లేకుండా లాంగ్ రైడ్స్ ఎంజాయ్ చేసేలా కస్టమర్ల ముందుకు వచ్చింది.

Published on: Jul 13, 2026, 06:03:05 IST
Advertisement

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహనాలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకునేందుకు నగరవాసులు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. మార్కెట్లో ఇప్పటికే మంచి విజయాన్ని అందుకున్న విడా వీఎక్స్2 ప్లస్ సిరీస్‌లో భాగంగా 4.4kWh బ్యాటరీ సామర్థ్యంతో సరికొత్త ఫ్లాగ్‌షిప్ వేరియంట్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. పాత వేరియంట్‌తో పోలిస్తే ఇది అత్యుత్తమ డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.

విడా వీఎక్స్2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌- సూపర్ రేంజ్..

విడా వీఎక్స్2 ప్లస్ కొత్త వేరియంట్..
విడా వీఎక్స్2 ప్లస్ కొత్త వేరియంట్..

ఈ విడా వీఎక్స్2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 2.2kWh సామర్థ్యం కలిగిన రెండు రిమూవబుల్ (విడిగా తీసి చార్జ్ చేసుకునే వీలున్న) బ్యాటరీ ప్యాక్‌లను అమర్చారు. వీటి మొత్తం సామర్థ్యం 4.4kWh. ఈ బ్యాటరీ సెటప్ సహాయంతో సింగిల్ చార్జ్‌పై ఏకంగా 187 కిలోమీటర్ల (ఐడీసీ సర్టిఫైడ్) రేంజ్​ని ఇస్తుందని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 3.4kWh వేరియంట్ 146 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే ఇస్తుండగా, కొత్త మోడల్‌లో అదనంగా 41 కిలోమీటర్ల ప్రయాణ సదుపాయం లభిస్తుంది.

ఈ కొత్త వేరియంట్ ఎక్స్​షోరూం ధర రూ. 1.44లక్షలుగా నిర్ణయించారు.

విడా వీఎక్స్2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌- ఫాస్ట్ చార్జింగ్..

కొత్త స్కూటర్‌తో పాటు 1kW పవర్‌ఫుల్ పోర్టబుల్ చార్జర్‌ను హీరో అందిస్తోంది. ఇది పాత చార్జర్ కంటే రెండింతలు వేగంగా పనిచేస్తుంది. ఈ చార్జర్ సాయంతో కేవలం 3 గంటల 17 నిమిషాల్లోనే బ్యాటరీని 0 నుండి 80 శాతానికి చార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫుల్ చార్జింగ్ (0-100%) కావడానికి 5 గంటల 8 నిమిషాల సమయం పడుతుంది. ఒకవేళ డీసీ ఫాస్ట్ చార్జింగ్ నెట్‌వర్క్ ఉపయోగిస్తే కేవలం 65 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. దేశవ్యాప్తంగా విడా బ్రాండ్‌కు ప్రస్తుతం 6,000 కంటే ఎక్కువ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ల సౌకర్యం ఉంది.

ఈ కొత్త స్కూటర్ అధికారికంగా మార్కెట్లోకి రాకముందే సరికొత్త మైలురాయిని అధిగమించింది. ఈ వేరియంట్‌ను ఉపయోగించి భారతదేశవ్యాప్తంగా 52 రోజుల పాటు నిరంతరాయంగా 12,111 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేశారు. ఈ అద్భుత ప్రదర్శనకు గానూ "ఎలక్ట్రిక్ స్కూటర్‌పై సాగిన సుదీర్ఘ ప్రయాణం" కేటగిరీలో ఈ వాహనానికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది.

ఈ విడా వీఎక్స్2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ 4.4kWh వేరియంట్ జులై 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధీకృత హీరో షోరూమ్‌లలో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks