...
...
Next Story

Long range Electric car : 600 కి.మీ రేంజ్​తో వోక్స్​వ్యాగన్ కొత్త ఈవీ- ఐడీ. టిగువాన్ హైలైట్స్ ఇవి..

జర్మన్ ఆటో దిగ్గజం వోక్స్‌వ్యాగన్ తన పాపులర్ 'టిగువాన్' సిరీస్‌లో తొలిసారిగా ఆల్-ఎలక్ట్రిక్ 'ఐడీ. టిగువాన్'ను ఆవిష్కరించింది. సింగిల్ ఛార్జ్‌పై 600 కిలోమీటర్ల రేంజ్, పవర్‌ఫుల్ బ్యాటరీ ఆప్షన్లతో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ హైలైట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 12, 2026, 06:03:19 IST
Advertisement

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్.. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో సరికొత్త శకానికి నాంది పలికింది. గ్లోబల్ మార్కెట్లో ఎంతో ఆదరణ పొందిన టిగువాన్ పేరుతోనే ఆల్-ఎలక్ట్రిక్ వర్షన్ 'వోక్స్‌వ్యాగన్ ఐడీ. టిగువాన్' ఎస్‌యూవీని ఇటీవలే ప్రదర్శించింది. తమ ఐడీ.4, ఐడీ.5 ఎలక్ట్రిక్ మోడళ్ల స్థానంలో ఈ సరికొత్త ఈవీని తీసుకొస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే ప్రస్తుతం అమ్ముడవుతున్న సాధారణ పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ వర్షన్ల విక్రయాలను కూడా యథాతథంగా కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

వోక్స్​వ్యాగన్ ఐడీ. టిగువాన్​
వోక్స్​వ్యాగన్ ఐడీ. టిగువాన్​

ఈ నేపత్యంలో ఈ ఐడీ. టిగువాన్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ హైలైట్స్​ని ఇక్కడ చూసేయండి..

'ప్యూర్ పాజిటివ్' డిజైన్.. అదిరిపోయే ఎక్స్‌టీరియర్!

వోక్స్‌వ్యాగన్ ఈ ఐడీ. టిగువాన్‌ను మెరుగైన 'ఎంఈబీ+' ఎలక్ట్రిక్ వేదికపై నిర్మించింది. పాత ఐడీ సీరీస్ క్రాసోవర్ రూపంతో పోలిస్తే, ఈ నయా మోడల్‌కు సంస్థ తన నూతన 'ప్యూర్ పాజిటివ్' డిజైన్ శైలిని జోడించి ఫ్యూర్ ఎస్‌యూవీ రూపాన్ని ఇచ్చింది.

ముందు భాగం: బ్లాక్ ఫ్రంట్ ప్యానెల్‌లో అమర్చిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, కనెక్టెడ్ డీఆర్‌ఎల్‌లు, వెలిగే వోక్స్‌వ్యాగన్ లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బంపర్ ఇరువైపులా ఎయిర్ కర్టైన్లు, కింద ట్రాపెజోయిడల్ ఎయిర్ ఇంటేక్ ఇచ్చారు.

సైడ్ అండ్ రియర్ ప్రోఫైల్: కారు చుట్టూ నల్లటి బాడీ క్లాడింగ్, పాత పద్ధతిలోని క్లాసిక్ డోర్ హ్యాండిల్స్, ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్‌ను అమర్చారు. వెనుకవైపు డిజైన్‌ను కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్‌తో అందంగా తీర్చిదిద్దారు.

నిల్వ సామర్థ్యం: ఇందులో 534 లీటర్ల బూట్ స్పేస్‌తో పాటు ముందు బానెట్ కింద 32 లీటర్ల ఫ్రంట్ స్టోరేజ్ సదుపాయం ఇచ్చారు.

బ్యాటరీ ఆప్షన్లు.. 600 కి.మీ రేంజ్!

58 kWh బ్యాటరీ: ఇది రియర్-వీల్ డ్రైవ్ మోటార్‌తో వచ్చి 190 హెచ్​పీ పవర్‌ను అందిస్తుంది.

77 kWh బ్యాటరీ: ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. రియర్-వీల్ డ్రైవ్ మోడల్ 286 హెచ్​పీ పవర్ ఇవ్వగా, ఆల్-వీల్ డ్రైవ్ మోడల్ ఏకంగా 299 హెచ్​పీని ఉత్పత్తి చేస్తుంది.

ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే డబ్ల్యూఎల్టీపీ ప్రమాణాల ప్రకారం గరిష్టంగా 600 కిలోమీటర్ల ప్రయాణ రేంజ్ లభిస్తుందని వోక్స్‌వ్యాగన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ ఈవీ ఏకంగా 2,000 కిలోల బరువును లాగగల టోయింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉందని సంస్థ వెల్లడించింది.

హైటెక్ క్యాబిన్.. త్రీ-స్క్రీన్ డ్యాష్‌బోర్డ్!

క్యాబిన్ సౌకర్యాల విషయంలో వోక్స్‌వ్యాగన్ పెద్ద పీటే వేసింది. డ్యాష్‌బోర్డ్‌పై ప్రధానంగా మూడు డిజిటల్ స్క్రీన్లను పొందుపరిచారు. 15-ఇంచుల సెంట్రల్ ఇన్‌ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, డ్రైవర్ కోసం 10-ఇంచుల స్క్రీన్, ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా 12-ఇంచుల డిస్‌ప్లేను ఇచ్చారు. ఏసీ కంట్రోల్స్ కోసం ఫిజికల్ బటన్లనే కొనసాగించడం విశేషం.

ప్రీమియం సదుపాయాల్లో భాగంగా వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్ ఉన్న ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్లు, హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెహికల్-టు-లోడ్ టెక్నాలజీలను ఈ వోక్స్​వ్యాగన్ ఐడీ. టిగువాన్​లో అందించారు.

అంతర్జాతీయ మార్కెట్, భారత ప్రాధాన్యత..

ఈ ఐడీ. టిగువాన్ మోడల్‌ను ట్రెండ్, లైఫ్, స్టైల్, ఆర్-లైన్ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ 2027 ప్రారంభంలో ఐరోపా మార్కెట్లో అధికారికంగా రోడ్డెక్కనుంది.

భారతదేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ ఐయోనిక్ 5, బీవైడీ అట్టో 3, బీఎండబ్ల్యూ ఐఎక్స్1 వంటి మోడళ్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ మోడల్‌ను భవిష్యత్తులో భారత మార్కెట్‌కి తీసుకొచ్చే అవకాశాలను వోక్స్‌వ్యాగన్ పరిశీలిస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks