హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​- తక్కువ ధరలో మధ్యతరగతి ప్రజల కోసమే..!

దేశీయ టూ-వీలర్​ సెగ్మెంట్​లో రారాజు హోండా, భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తన పట్టు నిలుపుకోవడానికి సిద్ధమవుతోంది. మునుపటి వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని, భారీగా స్థానిక విడిభాగాలతో చౌకైన ఒక కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్‌ను రూపొందిస్తోంది. వివరాల్లోకి వెళితే..

Published on: Jan 5, 2026, 09:11:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో టూ-వీలర్ అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు ‘హోండా’! పెట్రోల్ స్కూటర్ల విభాగంలో యాక్టివాతో రారాజుగా వెలుగుతున్న హోండాకు, ఎలక్ట్రిక్ విభాగం (ఈవీ) మాత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. కంపెనీకి చెందిన యాక్టివా:ఇ, 'క్యూసీ1' ఎలక్ట్రిక్​ స్కూటర్లు భారతీయ కస్టమర్లను మెప్పించలేకపోయాయి. దీనితో గత కొన్ని నెలల క్రితమే వాటి ఉత్పత్తిని నిలిపివేసిన సంస్థ, ఇప్పుడు సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ఇందులో భాగంగానే ఒక కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ని తీసుకొస్తోంది.

హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. (Representative image)
హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. (Representative image)

హోండా కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​..

గతంలో హోండా తెచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? అంటే.. ధర ఎక్కువగా ఉండటం, బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్ తక్కువగా ఉండటం, సీటు కింద స్టోరేజ్ సరిగ్గా లేకపోవడం వంటి కారణాలు వల్లే అనే ఆటో పరిశ్రమ చెబుతోంది.

ఈ సెగ్మెంట్​లో టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఓలా వంటి బ్రాండ్లు మార్కెట్లో దూసుకుపోతుంటే, హోండా వెనుకబడిపోయింది. అందుకే ఇప్పుడు గ్లోబల్ మోడళ్లను మార్పులు చేసి తేవడం కాకుండా, కేవలం భారతీయుల కోసమే ఒక కొత్త ప్లాట్‌ఫారమ్‌ను హోండా సిద్ధం చేస్తోంది.

ఈ కొత్త ఈ-స్కూటర్ విషయంలో హోండా తీసుకున్న అతిపెద్ద నిర్ణయం 'లోకలైజేషన్'. అంటే.. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్‌కు కావాల్సిన విడిభాగాలను మన దేశంలోనే తయారు చేయడం లేదా సేకరించడం జరుగుతుంది. దీనివల్ల తయారీ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా, కస్టమర్లకు ఈ స్కూటర్ తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. విడిభాగాలు చౌకగా దొరకడం వల్ల మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది.

ఇదే నిజమైతే భారత మధ్యతరగతి ప్రజలకు మరో బడ్జెట్​ ఈవీ అందుబాటులోకి వచ్చినట్టే!

హోండా కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ నుంచి ఏం ఆశించవచ్చు?

ప్రాక్టికాలిటీ: కుటుంబం అంతా వాడటానికి వీలుగా మంచి స్టోరేజ్ స్పేస్, విశాలమైన సీటు ఉండేలా డిజైన్ చేస్తున్నారు.

రేంజ్ అండ్​ ఛార్జింగ్: స్పీడ్​ కన్నా, రోజువారీ అవసరాలకు సరిపడా రేంజ్ ఇచ్చేలా, ఇంట్లోనే సులభంగా ఛార్జింగ్ చేసుకునే సదుపాయానికి హోండా ప్రాధాన్యత ఇస్తోంది.

నమ్మకం: బజాజ్, టీవీఎస్ లాంటి పాత బ్రాండ్లు ఎలాగైతే నమ్మకమైన వాహనాలను ఇస్తున్నాయో, హోండా కూడా అదే బాటలో సాగనుంది.

ధర విషయంలో జాగ్రత్త!

భారత మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ధర అనేది చాలా కీలకం. పెట్రోల్ స్కూటర్ ధరతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ ధర మరీ ఎక్కువగా ఉంటే కొనేందుకు ప్రజలు మొగ్గు చూపరు. అందుకే హోండా ఈసారి ధర విషయంలో చాలా పక్కాగా ఉన్నట్లు తెలుస్తోంది. టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేలా దీని ధర ఉండే అవకాశం ఉంది.

ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా హోండా తీసుకుంటున్న ఈ నిర్ణయం నిజంగా సాహసోపేతమైనదే. తన ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని, విశాలమైన సర్వీస్ నెట్‌వర్క్‌ను వాడుకుంటే, హోండా మళ్లీ ఈవీ మార్కెట్లో నంబర్ వన్ స్థానానికి చేరడం పెద్ద కష్టమేమీ కాదు.

కాగా ఈ కొత్త స్కూటర్ లాంచ్ డేట్​, ఫీచర్స్​, రేంజ్​ వంటి వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More