విదేశాల్లోని భారతీయుల కోసం ‘రామానుజన్ ఫెలోషిప్’- నెలకు రూ. 1.35లక్షల వేతనంతో..
విదేశాల్లో స్థిరపడిన భారతీయ, భారత సంతతి శాస్త్రవేత్తలు స్వదేశానికి తిరిగి వచ్చి పరిశోధనలు చేసేందుకు 'రామానుజన్ ఫెలోషిప్' ద్వారా గొప్ప అవకాశాన్ని ఇస్తోంది ప్రభుత్వం. ఈ ఫెలోషిప్ ద్వారా నెలకు రూ. 1.35 లక్షల గౌరవ వేతనంతో పాటు భారీ రీసెర్చ్ గ్రాంట్లను పొందే వీలుంది.
తమ మేధస్సుతో విదేశీ గడ్డపై అద్భుతాలు సృష్టిస్తున్న భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు మళ్లీ ఇండియాకు తిరిగొచ్చి తమ పరిశోధనలు కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం ఈ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. అదే 'రామానుజన్ ఫెలోషిప్'. దేశంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, ప్రతిభావంతులైన ప్రవాస భారతీయులను స్వదేశానికి రప్పించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం.

ఈ ఫెలోషిప్ పొందిన వారు దేశంలోని ఏవైనా ప్రముఖ విద్యా సంస్థలు లేదా యూనివర్సిటీల్లో చేరి తమ పరిశోధనలు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల నుంచి అదనపు నిధులను కూడా పొందే వీలుంది.
రామానుజన్ ఫెలోషిప్ అర్హతలు ఇవే..
ఈ రామానుజన్ ఫెలోషిప్ కేవలం భారతీయులు, భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు మాత్రమే వర్తిస్తుంది.
దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థి వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి.
సైన్స్ లేదా ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ, మెడిసిన్‌లో ఎండీ, లేదా ఇంజినీరింగ్/టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ వంటి ఉన్నత విద్యతో పాటు తగిన వృత్తిపరమైన అనుభవం ఉండాలి.
ప్రస్తుతం విదేశాల్లో పని చేస్తున్న వారు మాత్రమే ఈ ఫెలోషిప్‌కి దరఖాస్తు చేసుకోవాలి.
ఇప్పటికే భారతీయ సంస్థల్లో శాశ్వత లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారికి ఇది వర్తించదు. ఒకవేళ ఫెలోషిప్ వచ్చాక ఏదేని సంస్థలో ఉద్యోగం పొందితే, అప్పటి నుంచి ఫెలోషిప్ నిలిచిపోతుంది.
- నిన్న టెంపో డ్రైవర్.. నేడు ఎయిర్‌లైన్ అధినేత: శ్రవణ్ కుమార్ విశ్వకర్మ 'శంఖ్ ఎయిర్' సంచలన గాథ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
రామానుజన్ ఫెలోషిప్ కాలపరిమితి - ఆర్థిక ప్రయోజనాలు..
రామానుజన్ ఫెలోషిప్ ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు లభించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి:
నెలకు రూ. 1,35,000 గౌరవ వేతనం (ఇందులో ఇంటి అద్దె భత్యం -హెచ్ఆర్ఏ కూడా కలిసి ఉంటుంది).
పరిశోధనలకు అవసరమైన ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, ఇతర సామాగ్రి కోసం ఏడాదికి రూ. 7 లక్షల రీసెర్చ్ గ్రాంట్ లభిస్తుంది.
దీనితో పాటు ఓవర్ హెడ్ ఛార్జీల కింద ఏడాదికి అదనంగా రూ. 60,000 అందజేస్తారు.
రామానుజన్ ఫెలోషిప్ దరఖాస్తు విధానం, డెడ్‌లైన్..
ఈ రామానుజన్ ఫెలోషిప్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 'అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్' (ఏఎన్ఆర్ఎఫ్) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. డెడ్‌లైన్‌కి సంబంధించిన వివరాలు సైతం అందులోనే ఉంటాయి.
మన దేశం గర్వించదగ్గ గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పేరు మీద అందిస్తున్న ఈ ఫెలోషిప్, విదేశాల్లో ఉన్న భారతీయ మేధావులకు ఒక గొప్ప వరమనే చెప్పాలి.














