వివాహితుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరం కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
వివాహమైన పురుషుడు మరొక మహిళతో సహజీవనం చేయడం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. సామాజిక నైతికత కంటే పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కుల రక్షణే కోర్టుకు ముఖ్యమని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
సహజీవనం (Live-in relationship) విషయంలో అలహాబాద్ హైకోర్టు శుక్రవారం (మార్చి 27) ఒక చారిత్రాత్మక పరిశీలన చేసింది. పెళ్లయిన ఒక పురుషుడు మరొక వయోజన మహిళతో పరస్పర అంగీకారంతో కలిసి ఉండటం చట్టరీత్యా నేరం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. పౌరుల హక్కులను కాపాడటమే కోర్టు ప్రథమ కర్తవ్యమని, సామాజిక నైతికత అనేది చట్టం కంటే మిన్న కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.

అసలేం జరిగిందంటే?
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక జంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. సదరు యువతి కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, 'పరువు హత్య' (Honour Killing)కు పాల్పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తాము మేజర్లమని, స్వచ్ఛందంగా కలిసి ఉంటున్నామని ఆ యువతి ఇప్పటికే జిల్లా ఎస్పీకి విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో వారు కోర్టు గడప తొక్కారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనా సభ్యులుగా ఉన్న డివిజన్ బెంచ్ విచారించింది.
చట్టం వేరు.. నైతికత వేరు
ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. "వైవాహిక బంధంలో ఉన్న ఒక పురుషుడు, మరొక వయోజన మహిళతో వారిద్దరి అంగీకారంతో సహజీవనం చేస్తున్నప్పుడు.. వారిని ఏ చట్టం కింద కూడా శిక్షించడానికి వీల్లేదు. ఇక్కడ నైతికతను, చట్టాన్ని వేర్వేరుగా చూడాలి. ఒక చర్య చట్టప్రకారం నేరం కానప్పుడు, కేవలం సామాజిక అభిప్రాయాలు లేదా నైతికత ఆధారంగా పౌరుల హక్కులను కాలరాయలేం" అని ధర్మాసనం పేర్కొంది.
పోలీసులదే బాధ్యత
వయోజనులైన వ్యక్తులు కలిసి ఉండాలనుకున్నప్పుడు వారికి రక్షణ కల్పించడం పోలీసుల బాధ్యత అని కోర్టు గుర్తుచేసింది. ఈ విషయంలో సుప్రీం కోర్టు గతంలో 'శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018)' కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని, ఎస్పీ స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
గతంలోనూ..
అలహాబాద్ హైకోర్టు గతేడాది డిసెంబర్‌లో కూడా ఇలాంటి ఒక కీలక ఉత్తర్వు జారీ చేసింది. తమ కుటుంబాల నుంచి ముప్పు పొంచి ఉందన్న 12 సహజీవన జంటలకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. వివాహం చేసుకున్నా లేకపోయినా, భారత పౌరులుగా రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును ఎవరూ హరించలేరని అప్పట్లో జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ వ్యాఖ్యానించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. వివాహితుడైన పురుషుడు వేరే మహిళతో కలిసి ఉంటే అది నేరం కాదా?
అలహాబాద్ హైకోర్టు తాజా తీర్పు ప్రకారం, ఇద్దరు వయోజనులు (Majors) పరస్పర అంగీకారంతో కలిసి ఉంటే అది నేరం కాదు. అయితే, ఇది హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులకు దారితీసే అవకాశం ఉన్నప్పటికీ, క్రిమినల్ నేరం కిందకు రాదు.
2. సహజీవనం చేసే వారికి పోలీసు రక్షణ లభిస్తుందా?
అవును. ప్రాణహాని ఉందని భావిస్తే ఏ పౌరుడైనా రక్షణ కోరవచ్చు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం, పెద్దల అంగీకారంతో కలిసి ఉండే జంటలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే.
3. సామాజిక నైతికతపై కోర్టు ఏమన్నది?
కోర్టులు చట్టం ప్రకారం పనిచేస్తాయి తప్ప సామాజిక అభిప్రాయాల ప్రకారం కాదని, ఒక వ్యక్తి హక్కులను కాపాడటమే కోర్టు ప్రాధాన్యత అని బెంచ్ స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


