Amazon layoff : తెల్లవారుజామున మెయిల్స్‌తో ఉద్యోగులకు షాక్.. అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్స్! నెలలో రెండోసారి
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి తమ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. కొత్త కిండిల్ ఈ-రీడర్లు, టాబ్లెట్లను మార్కెట్లోకి తెచ్చిన కొన్ని వారాల్లోనే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగంలో పనితీరు రీస్ట్రక్చరింగ్ పేరుతో సుమారు 250 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ఇస్తూ తెల్లవారుజామున ఈ-మెయిల్స్ పంపింది.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ, టెక్ రంగంలో ఉద్యోగాల కోతల పరంపర కొనసాగుతూనే ఉంది! ప్రముఖ ఈ-కామర్స్, టెక్నాలజీ దిగ్గజం ‘అమెజాన్’ తమ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన కీలకమైన ‘డివైజెస్ అండ్ సర్వీసెస్’ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై లేఆఫ్‌ల వేటు వేసింది.

కొద్ది రోజుల క్రితమే సరికొత్త కిండిల్ ఈ-రీడర్లు, కొత్త మోడల్ టాబ్లెట్ కంప్యూటర్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన అమెజాన్, ఇంతలోనే ఈ లేఆఫ్స్ నిర్ణయం తీసుకోవడం టెక్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రధానంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగంలో పనిచేస్తున్న దాదాపు 250 మంది సిబ్బందిని విధుల్లోంచి తొలగించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
తెల్లవారుజామునే ఈ-మెయిల్స్, టెక్ట్స్ మెసేజ్‌లు!
అమెజాన్ పద్ధతికి అనుగుణంగానే, బాధితులైన ఉద్యోగులకు బుధవారం తెల్లవారుజామునే లేఆఫ్స్ సమాచారాన్ని అందిస్తూ ఈ-మెయిల్స్, ఎస్ఎంఎస్లు పంపించారు. డివైజెస్ అండ్ సర్వీసెస్ విభాగపు హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్ఆర్) వైస్ ప్రెసిడెంట్ చెరీ రాబిన్సన్ పంపిన మెయిల్లో కీలక విషయాలను ప్రస్తావించారు.
"కంపెనీ పనితీరు, అంతర్గత నిర్మాణాన్ని అత్యంత నిశితంగా పునఃసమీక్షించిన తర్వాతే, కొన్ని విధులను తగ్గించక తప్పని క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నాం," అని చెరీ రాబిన్సన్ సదరు ఈ-మెయిల్లో పేర్కొన్నారు.
మరోవైపు అమెజాన్ అధికారిక ప్రతినిధి కూడా ఈ లేఆఫ్స్ వార్తలను ధ్రువీకరించారు. "కంపెనీని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి, మా రాబోయే ప్రొడక్ట్ రోడ్‌మ్యాప్‌కు అనుగుణంగా వనరులను సర్దుబాటు చేయడానికి ఈ స్వల్ప సంఖ్యలోని ఉద్యోగాల కోత తోడ్పడుతుంది," అని వివరించారు.
అటు లైఆఫ్స్ మెసేజ్ వెళ్లిన బుధవారం నాడే.. అలెక్సా మద్దతుతో పనిచేసే కొత్త అలారం క్లాక్, డిజిటల్ ఫోటో ఫ్రేమ్‌ను అమెజాన్ ప్రవేశపెట్టడం గమనార్హం.
నెల రోజుల్లోనే రెండో విడత వేటు!
అమెజాన్‌లో ఈ రకమైన ఉద్యోగాల తొలగింపు ఇదే మొదటిసారి కాదు. ప్రస్తుత అక్టోబర్ నెల ఆరంభంలోనే అమెజాన్ తన ప్రధాన ఈ-కామర్స్ విభాగానికి చెందిన దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఆ ఘోరం మర్చిపోకముందే, ఇప్పుడు మరో 250 మందిని ఇంటికి పంపించడం ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది.
అంతర్జాతీయ వ్యాపార వర్గాలు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అమెజాన్ మూడో త్రైమాసిక (క్యూ3) ఆర్థిక ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ లేఆఫ్‌లు వెలుగులోకి వచ్చాయి. వ్యయాల నియంత్రణ, కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతపై ఎక్కువ దృష్టి పెట్టడం, వ్యాపార పునర్వ్యవస్థీకరణే ఈ వరుస లేఆఫ్‌లకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


