2029లోనూ ఎన్డీఏదే అధికారం: రాహుల్ గాంధీపై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు
సీఈసీ జ్ఞానేష్ కుమార్ తొలగింపు, జంతర్ మంతర్ నిరసన వేదిక హోదా రద్దుపై విపక్షాలు చేపట్టిన ఆందోళనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ ప్రతి ఓటమికి ఎన్నికల వ్యవస్థను ప్రశ్నించడం మాని ఆత్మపరిశీలన చేసుకోవాలని, 2029లోనూ ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్‌పై విపక్షాలు చేపడుతున్న నిరసనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములతో నైరాశ్యంలో కూరుకుపోయిందని, ప్రతి ఓటమికి ఎన్నికల వ్యవస్థను నిందించడం మానుకోవాలని హితవు పలికారు. 2029 సాధారణ ఎన్నికల్లోనూ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) భారీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ వరుసగా నాలుగోసారి పరాజయాన్ని మూటగట్టుకోక తప్పదని స్పష్టం చేశారు.

ప్రజాదరణపై రాహుల్ ఆత్మపరిశీలన చేసుకోవాలి
గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, ఉపఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ అమిత్ షా విపక్షాల వైఖరిని తప్పుబట్టారు. "ప్రతి ఓటమి తర్వాత ఎన్నికల ప్రక్రియను అనుమానించడం కంటే, ప్రజల్లో తమకున్న ఆమోదయోగ్యతపై రాహుల్ గాంధీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆరోపణలు, దుష్ప్రచారంతో ప్రజల నమ్మకాన్ని గెలవలేరు, నిరంతరం ప్రజల్లో ఉంటూ సేవ చేసినప్పుడే అది సాధ్యమవుతుంది" అని వ్యాఖ్యానించారు.
గుజరాత్లో ఇటీవల రెండు మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో మొత్తం 104 స్థానాలకు గాను బీజేపీ 90 స్థానాలు కైవసం చేసుకుందని తెలిపారు. తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 44 స్థానాలకు గాను 38 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, పోటీ చేసిన 32 స్థానాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ డిపాజిట్లు కోల్పోయిందని వివరించారు. గుజరాత్లో నాలుగు దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత లేదని, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజల మద్దతు చెక్కుచెదరలేదని తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా ఎందుకు గెలవలేదో ఆలోచించుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన (ఎస్ఐఆర్) ప్రక్రియను వ్యతిరేకించడం విదేశీ చొరబాటుదారులను కాపాడేందుకు వేసిన ప్రణాళికేనని దుయ్యబట్టారు.
ప్రజాస్వామ్య పరిరక్షణే మా లక్ష్యం: రాహుల్ గాంధీ
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే తొలగించాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన (ఎస్ఐఆర్) ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష కూటమి ఆందోళనలను తీవ్రతరం చేసింది. రాహుల్ గాంధీ తన నివాసంలో 12 ప్రతిపక్ష పార్టీల నేతలు, పౌరసమాజ ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు.
"మేమంతా ఒకే తాటిపై నిలబడ్డాం. వేర్వేరు ఆందోళనలు లేవు, ప్రజాస్వామ్య పరిరక్షణే ఏకైక లక్ష్యంగా పోరాడుతున్నాం. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలపకుండా ప్రభుత్వం అడ్డుకోలేదు," అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పౌరుల నిరసన హక్కును అణచివేయడం ప్రభుత్వానికి సాధ్యం కాదని హెచ్చరించారు.
జంతర్ మంతర్ హోదా రద్దుపై ఆగ్రహం
దిల్లీలోని ప్రధాన నిరసన ప్రాంగణమైన జంతర్ మంతర్ నిరసన వేదిక హోదాను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై విపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రామ్‌లీలా మైదానం, బురాడీ మైదానం, ఈస్ట్ దిల్లీలోని సీబీడీ మైదానాలను ప్రత్యామ్నాయ ప్రదేశాలుగా నిర్ణయించడాన్ని తోసిపుచ్చారు.
సమావేశం అనంతరం సీపీఎం నేత ఎంఏ బేబీ మాట్లాడుతూ, "ఓట్ల చోరీ తర్వాత ప్రభుత్వం ఇప్పుడు జంతర్ మంతర్‌ను కూడా చోరీ చేసింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ అధికార పార్టీ టీమ్‌లో చేరిపోయారు," అని విమర్శించారు. శివసేన (యుబిటి) నేత సంజయ్ రౌత్ సీఈసీ వైఖరిని మాఫియాతో పోల్చారు.
తదుపరి కార్యాచరణకు విపక్షాల ప్రణాళిక
సుప్రీంకోర్టుకు చేపట్టిన ర్యాలీకి లభించిన స్పందనతో 'ఇండియా ప్లస్' (INDIA Plus) పేరుతో విస్తృత వేదికను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు నిర్ణయం వెలువడే వరకు వేచి చూసి, తదుపరి భారీ మార్చ్ చేపడతామని నేతలు వెల్లడించారు.
అదే సమయంలో జంతర్ మంతర్ వద్ద వికేంద్రీకృత నిరసనలు కొనసాగుతాయని, మాక్ పార్లమెంట్ నిర్వహణతో పాటు 24 గంటల ముందస్తు సమాచారంతో మెరుపు ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, తేజస్వి యాదవ్, మనోజ్ ఝా, ఆనంద్ భదౌరియా, హరేందర్ మాలిక్, ఎం నద్వి, మహువా మాజీ, డి రాజా, సందోష్ కుమార్, దీపాంకర్ భట్టాచార్య, సుప్రియా సూలే, జోస్ కె మణి, తొల్ తిరుమావళవన్, విద్యార్థి నేతలు నేహా బోరా, ఐషే ఘోష్ తదితరులు పాల్గొన్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


