స్కామ్స్‌ని అడ్డుకోవడంలో ఐఫోన్ కన్నా ఆండ్రాయిడ్ బెటర్ : గూగుల్
మొబైల్ స్కామ్‌లను అడ్డుకోవడంలో ఐఓఎస్ కన్నా ఆండ్రాయిడ్ మెరుగ్గా పనిచేస్తోందని గూగుల్ సంచలన ప్రకటన చేసింది! ఈ మేరకు తాజాగా జరిగిన ఒక సర్వేకి సంబంధించిన వివరాలను పంచుకుంది. సెక్యూరిటీకి పెట్టింది పేరుగా ఉన్న యాపిల్ డివైజ్‌లకు ఇది సవాలు విసిరే విధంగా ఉంది.
మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే మోసాలను అడ్డుకోవడంలో యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ కంటే తమ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమే మరింత సమర్థవంతంగా పనిచేస్తోందని గూగుల్ సంస్థ ప్రకటించింది! ఇటీవలి సర్వేలు, పరిశోధనల నుంచి లభించిన వివరాలను పంచుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత రక్షణ వ్యవస్థలు.. యూజర్లను మోసాలు, అనవసర కమ్యూనికేషన్ల బారి నుంచి కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని గూగుల్ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 400 బిలియన్ డాలర్ల నష్టాన్ని కలిగిస్తున్న స్కామ్స్ సమస్యను ఎదుర్కోవడంలో ఆండ్రాయిడ్‌లోని తమ ఏఐ టూల్స్ ఎంతగానో తోడ్పడుతున్నాయని గూగుల్ తాజాగా విడుదల చేసిన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ఆండ్రాయిడ్ భద్రతా వ్యవస్థలు ప్రతి నెలా 10 బిలియన్లకు పైగా హానికరమైన కాల్స్, మెసేజ్‌లను అడ్డుకుంటున్నాయని కంపెనీ వెల్లడించింది.
యూగోవ్ (YouGov) అనే సంస్థ 5,000 మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులపై నిర్వహించిన సర్వే వివరాలను కూడా ఈ నివేదికలో చేర్చారు. ఐఫోన్ వినియోగదారులతో పోలిస్తే, ఆండ్రాయిడ్ యూజర్లు, ముఖ్యంగా పిక్సెల్ ఫోన్లు వాడుతున్నవారు, మోసపూరిత టెక్ట్స్ మెసేజ్‌లు (స్కామ్ టెక్ట్స్), కాల్స్ తక్కువగా ఎదుర్కొంటున్నారని ఈ డేటా చెబుతోందని గూగుల్ తెలిపింది.
సర్వే ఫలితాల్లో స్పష్టమైన తేడా!
ఈ సర్వేలో వెల్లడైన కీలక అంశాలు:
మునుపటి వారంలో తమకు అసలు ఎలాంటి స్కామ్ మెసేజ్‌లు రాలేదని చెప్పిన ఆండ్రాయిడ్ యూజర్లు.. ఐఓఎస్ యూజర్ల కన్నా 58% ఎక్కువగా ఉన్నారు.
పిక్సెల్ ఫోన్ యూజర్ల విషయానికి వస్తే, ఐఫోన్ వినియోగదారులతో పోలిస్తే, వీరు అసలు మోసపూరిత మెసేజ్‌లను అందుకోలేదని చెప్పే అవకాశం ఏకంగా 96% అధికంగా ఉంది.
మరోవైపు, ఒక వారంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ స్కామ్ మెసేజ్‌లను అందుకున్న ఐఓఎస్ యూజర్లు, ఆండ్రాయిడ్ యూజర్ల కన్నా 65% ఎక్కువగా ఉన్నారు.
మొబైల్ స్కామ్స్ ప్రయత్నాలను అడ్డుకోవడంలో తమ పరికరం అసలు సమర్థంగా లేదని చెప్పిన ఐఫోన్ యూజర్లు ఏకంగా 150% అధికంగా ఉండటం గమనార్హం!
ఈ ఆధిక్యత తమకు లభించడానికి.. మెసేజెస్ యాప్‌లోని స్పామ్ ఫిల్టరింగ్, మోసపూరిత సంభాషణలను గుర్తించే ఆన్-డివైస్ స్కామ్ డిటెక్షన్, యూజర్లు కాల్స్ ఆన్సర్ చేయకముందే అనుమానాస్పద కాల్స్‌ను ఫిల్టర్ చేసే ఫోన్ యాప్ కాల్ స్క్రీన్ వంటి అనేక బిల్ట్-ఇన్ టూల్స్ కారణమని గూగుల్ సంస్థ పేర్కొంది.
గూగుల్ వాదనకు మద్దతు!
గూగుల్ తన వాదనలకు మద్దతుగా కౌంటర్‌పాయింట్ రీసెర్చ్, లెవియాథన్ సెక్యూరిటీ గ్రూప్ వంటి సంస్థలు నిర్వహించిన బాహ్య అధ్యయనాలను కూడా ఉదహరించింది.
కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం.. ఐఓఎస్‌లో కేవలం రెండే కీలక భద్రతా అంశాల్లో ఏఐ ఆధారిత భద్రతలు ఉండగా, ఆండ్రాయిడ్‌లో తొమ్మిది ముఖ్యమైన భద్రతా విభాగాలలో ఏఐ ఆధారిత రక్షణలు ఉన్నట్టు తేలింది.
లెవియాథన్ సంస్థ చేసిన అధ్యయనంలో.. ఆండ్రాయిడ్ ఫోన్లు, ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ ఫోన్లు, వేరే థర్డ్-పార్టీ యాప్‌లు అవసరం లేకుండానే మోసాల నుంచి మెరుగైన డిఫాల్ట్ ప్రొటెక్షన్‌ని అందిస్తున్నాయని తేల్చింది.
సుదీర్ఘకాలంగా యూజర్ల భద్రత, గోప్యతకు ప్రాధాన్యత ఇస్తుందనే యాపిల్ సంస్థకున్న పేరుకు గూగుల్ తాజా నివేదిక ఒక సవాలుగా మారే అవకాశం ఉంది.
యాపిల్ ఇటీవల "అపరిచిత కాలర్ల స్క్రీనింగ్" వంటి ఫీచర్లను జోడించినప్పటికీ, కొత్తగా పుట్టుకొస్తున్న మోసాల పద్ధతులను ఆటోమేటిక్‌గా గుర్తించి, అడ్డుకోవడంలో ఆండ్రాయిడ్‌కు చెందిన మల్టీ-లేయర్ ఏఐ ప్రొటెక్షన్ వ్యవస్థ మెరుగైనదని గూగుల్ పేర్కొంది.
మీరు ఆండ్రాయిడ్ వాడుతున్నారా, ఐఫోన్ వాడుతున్నారా? మరి మీరు ఎలాంటి మొబైల్ మోసాలను ఎదుర్కొన్నారు?

E-Paper












