...
...
Next Story

iPhone 18 release date : ఇట్స్ అఫీషియల్​! ఐఫోన్ 18 సిరీస్ లాంచ్​ డేట్ ఇదే..

iPhone 18 launch date : ఐఫోన్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 9న జరగనుంది. నూతన సీఈఓ జాన్ టెర్నస్ నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు కంపెనీ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉందనే వార్తలు టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాయి.

Published on: Aug 27, 2026, 06:46:09 IST
Advertisement

టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ డేట్​ని అధికారికంగా ఖరారు చేసింది. రాబోయే సెప్టెంబర్ 9వ తేదీన అమెరికా కాలిఫోర్నియాలో ఉన్న యాపిల్ పార్క్‌లోని ప్రతిష్టాత్మక 'స్టీవ్ జాబ్స్ థియేటర్' వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగనుంది. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టిన వెంటనే జరుగుతున్న తొలి అతిపెద్ద కార్యక్రమం కావడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకపై విపరీతమైన ఆసక్తి నెలకొంది.

ఐఫోన్ 18 ప్రో..
ఐఫోన్ 18 ప్రో..

"సర్‌ప్రైజ్ అండ్ షైన్" అనే వినూత్న ట్యాగ్‌లైన్‌తో యాపిల్ ఒక ఆహ్వాన పత్రాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 18 సిరీస్​ లాంచ్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

యాపిల్ చరిత్రలోనే అతిపెద్ద మార్పు!

ఇన్నాళ్లూ యాపిల్ ప్రయాణాన్ని విజయవంతంగా నడిపిన టిమ్ కుక్ స్థానంలో సెప్టెంబర్ 1 నుంచి జాన్ టెర్నస్ నూతన సీఈఓగా పగ్గాలు చేపట్టనున్నారు. టిమ్ కుక్ ఇకపై ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు. ఈ నాయకత్వ మార్పు తర్వాత జరుగుతున్న మొదటి ఈవెంట్ కావడం వల్ల, కేవలం కొత్త గ్యాడ్జెట్లు మాత్రమే కాకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలో యాపిల్ భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయో టెర్నస్ వివరించే అవకాశం ఉంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రేసులో యాపిల్ స్థానాన్ని టెర్నస్ మరింత బలపరుస్తారని బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మార్కెట్లోకి యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్?

ఈ లాంచ్ ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం – యాపిల్ తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్‌ను తీసుకొస్తుండడమే! ప్రస్తుతం శాంసంగ్ కంపెనీ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్‌తో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 8 మోడల్ ప్రారంభ ధర దాదాపు రూ. 1.75 లక్షల వరకు ఉందనే విషయం తెలిసిందే. ఇప్పుడు యాపిల్ కూడా ఈ విభాగంలోకి అడుగుపెడితే, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ప్రియులకు సరికొత్త ప్రత్యామ్నాయం అందుబాటులోకి వస్తుంది.

అయితే, ఈసారి ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్​, ఫోల్డబుల్ మోడల్స్​ మాత్రమే లాంచ్​ అవుతాయని, స్టాండర్డ్ ఐఫోన్ 18 స్మార్ట్​ఫోన్ మాత్రం వచ్చే ఏడాది విడుదల అవుతుందని అంచనాలు ఉన్నాయి. వీటిపై సంస్థ స్పందించాల్సి ఉంది.

ఐఫోన్ 18 సిరీస్ లాంచ్- భారత్‌లో ఈవెంట్ సమయం..

భారతీయ కాలమానం ప్రకారం సెప్టెంబర్ 9న రాత్రి 10:30 గంటలకు ఈ ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. యాపిల్ అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా భారతీయులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.

ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్​ఎల్​ఎం) సాంకేతికతతో పనిచేసే సరికొత్త 'సిరి ఏఐ' వాయిస్ అసిస్టెంట్‌ను కూడా యాపిల్ పరిచయం చేయనుంది. ఇది మెసేజింగ్, క్యాలెండర్ వంటి యాప్‌లను మరింత చాకచక్యంగా ఆపరేట్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే, సెప్టెంబర్ 22 నాటికి వినియోగదారులకు అందనున్న కొత్త మ్యాక్ మిని, మ్యాక్ స్టూడియో మోడళ్ల వివరాలను కూడా ఈ వేదికపై ప్రకటించనున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks