iPhone 17e : ఐఫోన్​ 17ఈ లాంచ్​ డేట్​ ఇదేనా? ఆ ఫీచర్స్​లో మార్పులు..!

యాపిల్ తన తదుపరి అఫార్డిబుల్​ ఐఫోన్.. 'ఐఫోన్​ 17ఈ'ని ఈ నెలాఖరులోగా లాంచ్​ చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 19న విడుదలయ్యే అవకాశం ఉన్న ఈ స్మార్ట్​ఫోన్​లో పలు ముఖ్యమైన అప్‌డేట్స్ ఉండబోతున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 07, 2026 10:01 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యాపిల్​ ఐఫోన్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​! యాపిల్​ అఫార్డిబుల్​ ఐఫోన్​ 17ఈ ఈ నెలాఖరులోగా లాంచ్​ అయ్యే అవకాశం ఉందని ఒక రిపోర్టు బయటకు వచ్చింది. ఈ స్మార్ట్​ఫోన్​ ఐఫోన్​ 16ఈకి సక్సెసర్​గా రాబోతోంది. యాపిల్ ఎటువంటి అధికారిక వివరాలను పంచుకోనప్పటికీ, కంపెనీ ఈ పరికరాన్ని ఫిబ్రవరి 2026లో ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్లు మరికొన్ని లీకులు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్​ 17ఈకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇంకొన్ని రోజుల్లో ఐఫోన్​ 17ఈ లాంచ్​.. (HT)
ఇంకొన్ని రోజుల్లో ఐఫోన్​ 17ఈ లాంచ్​.. (HT)

ఐఫోన్​ 17ఈ: లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)..

జర్మన్ ప్రచురణ 'మాక్​వెల్ట్​'.. అజ్ఞాత వర్గాలను ఉటంకిస్తూ, యాపిల్ ఫిబ్రవరి 19న ఐఫోన్​ 17ఈని ప్రకటించాలని యోచిస్తున్నట్లు పేర్కొంది. ఈ తేదీ సరిగ్గా ఫిబ్రవరి 19, 2025న యాపిల్ పరిచయం చేసిన ఐఫోన్​ 16ఈ లాంచ్ యానివర్సరీతో సరిపోలుతుంది. ఈ టైమ్​లైన్​ 2026 మొదటి త్రైమాసికంలో కొత్త 'ఈ' మోడల్ అరంగేట్రం చేస్తుందని గతంలో వచ్చిన నివేదికలతో కూడా ఏకీభవిస్తోంది. ఈ కేటగిరీలోని మునుపటి లాంచ్​ల మాదిరిగానే, యాపిల్ ఈ ఫోన్‌ను ప్రత్యేక ఈవెంట్ ద్వారా కాకుండా ప్రెస్ రిలీజ్ ద్వారా రిలీజ్​ చేయాలని ఎంచుకోవచ్చు.

ఐఫోన్​ 17ఈ: డిజైన్, కెమెరా అప్‌డేట్..

సదరు నివేదిక ప్రకారం, ఈ ఐఫోన్​ 17ఈ ఎక్స్​టీరియర్​ డిజైన్‌లో యాపిల్​ పెద్ద మార్పులు చేయదు. ఐఫోన్​ 17ఈ కూడా ఐఫోన్​ 16ఈ తరహాలోనే డిజైన్ లేఅవుట్‌ను అనుసరించవచ్చు. సెల్ఫీ కెమెరా, ఫేస్ ఐడీ సిస్టమ్ కోసం ఈ పరికరం ఇప్పటికీ ముందు భాగంలో ‘నాచ్’ను కలిగి ఉండవచ్చు. 'ఈ' సిరీస్‌లో ‘డైనమిక్ ఐలాండ్’ను ప్రవేశపెడతారని గతంలో వచ్చిన ఊహాగానాలు నిజమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఈ ఫీచర్ కేవలం అధిక ధర కలిగిన మోడళ్లకు మాత్రమే పరిమితం కావచ్చు.

ఈ స్మార్ట్​ఫోన్​లో కెమెరా సెటప్ కూడా మారే అవకాశం లేదు! ఐఫోన్​ 17ఈ ప్రస్తుత మోడల్ లాగే సింగిల్ రియర్ కెమెరాతో రావచ్చు. యాపిల్ తన సరసమైన లైనప్ కోసం మల్టిపుల్ కెమెరా సెన్సార్లను ప్రవేశపెట్టడం కంటే, తెలిసిన హార్డ్‌వేర్ లేఅవుట్‌ను కొనసాగించడంపైనే దృష్టి పెట్టింది.

ఐఫోన్​ 17ఈ- ఛార్జింగ్, కనెక్టివిటీ..

ఒక ముఖ్యమైన మార్పు ఛార్జింగ్ సిస్టమ్‌లో రావచ్చు. యాపిల్ ఐఫోన్​ 17ఈకి మాగ్‌సేఫ్ సపోర్ట్‌ను జోడించవచ్చని నివేదిక పేర్కొంది. ఐఫోన్​ 16ఈలో ఉపయోగించిన క్యూఐ-ఆధారిత వైర్‌లెస్ ఛార్జింగ్ నుంచి ఇది పెద్ద మార్పు కానుంది. ప్రస్తుత మోడల్ 7.5డబ్ల్యూ వరకు మాత్రమే వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. మాగ్‌సేఫ్‌తో, కొత్త ఫోన్ 25డబ్ల్యూ వరకు వైర్‌లెస్ ఛార్జింగ్ వేగాన్ని సపోర్ట్ చేస్తుంది, దీనివల్ల వినియోగదారులు కేబుల్స్ లేకుండా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

మరో నివేదించిన అప్‌డేట్.. కనెక్టివిటీకి సంబంధించినది. యాపిల్ ఐఫోన్​ 17ఈని సీ1ఎక్స్​ మోడెమోతో సిద్ధం చేయవచ్చు. కంపెనీ మొదట సెప్టెంబర్ 2025లో ఐఫోన్​ ఎయిర్​తో ఈ మోడెమ్‌ను పరిచయం చేసింది. ఐఫోన్​ 16ఈలోని సీ1 మోడెమ్‌తో పోలిస్తే, సీ1ఎక్స్​ మోడెమ్ మెరుగైన డేటా స్పీడ్, మెరుగైన పవర్ యూసేజ్‌ని అందిస్తుందని యాపిల్ పేర్కొంది.

యాపిల్ ఫిబ్రవరి 19 లాంచ్ తేదీకి కట్టుబడి ఉంటే.. ఐఫోన్​ 17ఈ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

ప్రస్తుతం చెప్పిన ఈ వివరాలు కంపెనీ ధృవీకరించే వరకు అధికారికం కావని గమనించాలి.