అప్రిలియా నుంచి సరికొత్త SXR GT స్కూటర్లు.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో! ధర ఎంతంటే..
ఇటాలియన్ టూ-వీలర్ బ్రాండ్ అప్రిలియా భారత్‌లో SXR GT రేంజ్ ప్రీమియం మ్యాక్సీ స్కూటర్లను విడుదల చేసింది. మెరుగైన ఇంజిన్, పెద్ద వీల్స్, అధునాతన టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో వచ్చిన ఈ కొత్త స్కూటర్ల ధరలు, ఫీచర్లు ఇవే.
ప్రముఖ ఇటాలియన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అప్రిలియా భారత ప్రీమియం స్కూటర్ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు సిద్ధమైంది. దేశీయంగా ఎంతగానో ఆదరణ పొందిన మ్యాక్సీ స్కూటర్ ఫార్ములాను సరికొత్త హంగులతో మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 'SXR GT' సిరీస్‌లో రెండు కొత్త మోడళ్లను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది.

ఈ సిరీస్‌లో ప్రారంభ మోడల్ అయిన 'ఎస్ఎక్స్ఆర్ జీటీ 125 హెచ్‌పీ-ఈ' ధరను రూ.1.11 లక్షలుగా నిర్ణయించగా, ఎక్కువ పవర్ ఇచ్చే 'ఎస్ఎక్స్ఆర్ జీటీ 175 హెచ్‌పీ-ఈ' ధరను రూ.1.31 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ ఖరారు చేసింది.
పాత మోడళ్ల రీ-ఎంట్రీ కాదు.. పవర్‌ఫుల్ అప్‌గ్రేడ్!
అప్రిలియా గతంలో విక్రయించిన ఎస్ఎక్స్ఆర్ 125, ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్లను నిశ్శబ్దంగా మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. అయితే ఈ విభాగాన్ని పూర్తిగా వదిలేయకుండా, వినియోగదారుల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా మరిన్ని మార్పులు చేసి జీటీ ( గ్రాండ్ టూరింగ్) బ్యాడ్జ్‌తో కొత్త స్కూటర్లను తీసుకొచ్చింది. కంపెనీ తన పాపులర్ ఎస్‌ఆర్ 125, ఎస్‌ఆర్ 175 బైక్ మోడళ్లలో ఉపయోగిస్తున్న పవర్‌ఫుల్ ఇంజిన్లనే ఈ కొత్త ఎస్ఎక్స్ఆర్ జీటీ సిరీస్‌లోనూ జత చేసింది.
డిజైన్ పరంగా పాత మ్యాక్సీ స్కూటర్ శైలినే కొనసాగించారు. విశాలమైన ఫ్రంట్ ప్రొఫైల్, పెద్ద సీటు, లాంగ్ రైడింగ్‌కు సౌకర్యవంతంగా ఉండే సిట్టింగ్ పొజిషన్‌ను ఇందులో అందించారు. సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి ఇది అద్భుతమైన రైడింగ్ అనుభూతిని ఇస్తుంది.
ఇంజిన్ సామర్థ్యం.. పవర్ ఎంతంటే?
అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ జీటీ 125 మోడల్‌లో 124.5 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 7,400 ఆర్‌పీఎం వద్ద 10.6 హెచ్‌పీ పవర్‌ను, 6,200 ఆర్‌పీఎం వద్ద 10.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మరొకవైపు పవర్‌ఫుల్ ఎస్ఎక్స్ఆర్ జీటీ 175 మోడల్‌లో 174.7 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను ఇచ్చారు. ఇది 7,200 ఆర్‌పీఎం వద్ద 13.3 హెచ్‌పీ పవర్‌ను, 6,000 ఆర్‌పీఎం వద్ద 14.1 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు కూడా బీఎస్-6 ఓబీడీ-2 స్టేజ్-బీ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారయ్యాయి. అంతేకాకుండా ఇవి ఈ20 పెట్రోల్ ఇంధనానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాయి.
14 అంగుళాల పెద్ద వీల్స్.. అద్భుతమైన స్టెబులిటీ
ఈ కొత్త అప్రిలియా స్కూటర్లలో చేసిన అతిపెద్ద మెకానికల్ మార్పు 14 అంగుళాల అలాయ్ వీల్స్! సాధారణంగా స్కూటర్లలో చిన్న వీల్స్ ఉండటం వల్ల గుంతల రోడ్లపై లేదా ఎక్కువ వేగంతో వెళుతున్నప్పుడు నిలకడ లోపిస్తుంది. కానీ ఈ 14 ఇంచీల వీల్స్ వల్ల రోడ్డుపై గ్రిప్ పెరగడంతో పాటు నగరం వెలుపల వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు స్కూటర్ చాలా స్టెడీగా ఉంటుంది.
అధునాతన టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ఏబీఎస్ ఫీచర్లు..
రెండు వేరియంట్ల మధ్య ఫీచర్ల పరంగా స్పష్టమైన వ్యత్యాసం ఉంది. టాప్ వేరియంట్ అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ జీటీ 175లో 5 అంగుళాల రంగుల టీఎఫ్‌టీ డిస్‌ప్లేను అందించారు. ఇది బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా రైడర్లు ఫోన్ కాల్స్, మ్యూజిక్ కంట్రోల్స్, టర్న్-బై-టర్న్ నేవిగేషన్ సదుపాయాన్ని పొందవచ్చు. హ్యాండిల్‌బార్‌పై అదనపు కంట్రోల్స్, మెరుగైన భద్రత కోసం సింగిల్ ఛానల్ ఏబీఎస్, అలాగే హీట్ షీల్డ్‌తో కూడిన కొత్త ఎగ్జాస్ట్ సైలెన్సర్‌ను ఇందులో ఇచ్చారు.
ఇక ఎంట్రీ లెవెల్ అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ జీటీ 125 వేరియంట్‌లో 5 అంగుళాల డిజిటల్ ఎల్‌సీడీ క్లస్టర్‌ను ఉపయోగించారు. భద్రత కోసం ఇందులో ఏబీఎస్‌కు బదులుగా కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్) అందించారు. ఈ మార్పుల వల్లే దీని ధరను సామాన్యులకు అందుబాటులో ఉంచడం సాధ్యమైంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


