Asian games 2026 live : ఆసియా గేమ్స్​లో భారత్​ బోణీ.. షూటింగ్‌లో రజతం గెలిచిన మహిళల జట్టు!

జపాన్ వేదికగా జరుగుతున్న ఐచి-నాగోయా ఆసియా క్రీడల్లో భారత్ పతకాల ఖాతాను తెరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఇళవేనిల్ వలరివన్, సోనమ్ మస్కర్, విదర్సా వినోద్‌లతో కూడిన త్రయం రజత పతకం సాధించి దేశానికి తొలి విజయాన్ని అందించింది.

Updated on: Sep 20, 2026, 09:36:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జపాన్‌లోని ఐచి-నాగోయా నగరంలో జరుగుతున్న 2026 ఆసియా గేమ్స్​లో భారత్ శుభారంభం చేసింది. క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పతకాల పట్టికలో ఇండియా తన ఖాతాను అధికారికంగా తెరిచింది. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత్‌కు ఎప్పుడూ బలమైన కోటగా నిలిచే షూటింగ్ విభాగంలోనే ఈసారి కూడా తొలి పతకం రావడం విశేషం! మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో అద్భుత ప్రదర్శనతో ఇళవేనిల్ వలరివన్, సోనమ్ మస్కర్, విదర్సా వినోద్​లు రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.

భారత మహిళా షూటర్ ఇళవేనిల్ వలరివన్ (PTI)
భారత మహిళా షూటర్ ఇళవేనిల్ వలరివన్ (PTI)

ఆరు సిరీసుల పాటు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో భారత్ మొత్తం 1898.0 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.

ఈ విభాగంలో చైనా క్రీడాకారిణులు జిఫెయ్ వాంగ్, జియా యు హాన్‌, యుచెన్ డూలతో కూడిన జట్టు 1904.2 పాయింట్ల సరికొత్త ప్రపంచ రికార్డు స్కోరు నమోదు చేస్తూ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఆతిథ్య జపాన్ జట్టు (హినాతా తైచి, మిసాకి నోబాతా, షియోరి హిరాటా) 1897.1 పాయింట్లతో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.

భారత షూటర్లు ఆఖరి రౌండ్ వరకు పట్టువదలకుండా పోరాడి ఆతిథ్య జపాన్‌ను కేవలం 0.9 పాయింట్ల తేడాతో వెనక్కి నెట్టి రజతాన్ని ఖాయం చేసుకోవడం విశేషం.

వ్యక్తిగత ఫైనల్స్‌కు సోనమ్, ఇళవేనిల్ అర్హత

టీమ్ విభాగంలో రజతం సాధించడమే కాకుండా, వ్యక్తిగత విభాగంలోనూ భారత క్రీడాకారిణులు తమ ఆధిపత్యాన్ని చాటారు. అర్హత రౌండ్‌లో నిలకడగా రాణించిన సోనమ్ మస్కర్ 634.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరో సీనియర్ షూటర్ ఇళవేనిల్ వలరివన్ 633.5 పాయింట్లతో ఏడో స్థానాన్ని దక్కించుకుని వ్యక్తిగత పతక పోరుకు అర్హత సాధించింది. చైనాకు చెందిన జిఫెయ్ వాంగ్ 636.8 పాయింట్లతో క్వాలిఫికేషన్ రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. తుది పోరులో ఈ ఇద్దరు భారత షూటర్లు వ్యక్తిగత విభాగంలోనూ పతకాలు సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఆసియా గేమ్స్​లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత్‌కు ఇది వరుసగా రెండో రజత పతకం కావడం విశేషం! 2023లో చైనాలోని హ్యాంగ్‌జౌ నగరంలో జరిగిన ఆసియా పోటీల్లోనూ భారత మహిళల జట్టు రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సాధించింది. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికలపై భారత వీరులు ప్రదర్శిస్తున్న ఈ నిలకడ దేశీయ క్రీడారంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

ఎంఎంఏలో మెడల్ ఫిక్స్​!

మరోవైపు.. టీవీ రియాలిటీ షో 'రోడీస్' మాజీ కంటెస్టెంట్, 36 ఏళ్ల భారత మహిళా ఫైటర్ సుచిక తరియాల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) క్రీడలో సరికొత్త చరిత్ర సృష్టించింది! ఆదివారం జరిగిన మహిళల ట్రెడిషనల్ 60 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో మంగోలియాకు చెందిన ఆల్టన్‌చిమెగ్ బైగల్మాపై 2-0 తేడాతో సుచిక ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన ఆమె, ఆసియా గేమ్స్​ చరిత్రలోనే ఎంఎంఏ విభాగంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించనుంది!

బాక్సింగ్ తరహాలోనే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో కూడా సెమీఫైనల్ చేరుకున్న ఫైటర్లకు కనీసం కాంస్య పతకం లభిస్తుంది. సెమీస్‌లో ఓడిపోయినా కాంస్యం దక్కుతుంది కాబట్టి, సుచిక విజయంతో భారత్ పతకం అధికారికంగా ఖరారైంది.

సెమీఫైనల్‌లో సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియో లేదా ఇరాన్‌కు చెందిన అరెజౌ సలీమిఘలేహ్ తాకీలలో విజేతగా నిలిచిన వారితో సుచిక తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆమె పసిడి పతక పోరుకు అర్హత సాధిస్తుంది.

విభిన్న క్రీడల్లో సత్తా చాటిన ఆల్‌రౌండర్!

ఉత్తరాఖండ్‌కు చెందిన సుచిక తరియాల్ క్రీడా ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె ఒక్క క్రీడకే పరిమితం కాకుండా విభిన్న మార్షల్ ఆర్ట్స్ విభాగాల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో జూడో క్రీడలో, 2023 ఆసియా క్రీడల్లో ‘కురాష్’ విభాగంలో భారత తరఫున రిప్రజెంట్ చేసింది. అంతేకాకుండా 2024లో జియూ-జిట్సు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి గ్లోబల్ వేదికపై పసిడి పతకంతో మెరిసింది.

గాయాన్ని జయించి తిరిగొచ్చిన ధీర..

కొంతకాలం ఆటలకు దూరమైన సుచిక, స్నేహితుల ప్రోత్సాహంతో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టింది. ఎంఎంఏను ఒక కొత్త సవాలుగా స్వీకరించిన ఆమెకు ప్రయాణం అంత సులువుగా సాగలేదు. తీవ్రమైన మోకాాలి గాయం, అనేక రకాల వ్యక్తిగత ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ ఆమె పట్టుదలతో సాధన చేసింది. యురేషియా రీజియన్‌లో 92వ ర్యాంక్‌లో ఉన్న మంగోలియా ఫైటర్‌పై క్వార్టర్స్‌లో ఆద్యంతం ఆధిపత్యం చెలాయించి 2-0తో ఏకపక్ష విజయం సాధించింది.

36ఏళ్ల వయసులో, గాయాలను తట్టుకుని నిలబడి ఆసియా క్రీడల వేదికపై పతకాన్ని ఖాయం చేసిన సుచిక ప్రయాణం దేశంలోని యువ క్రీడాకారులకు, ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్‌లోకి రావాలనుకునే మహిళా అథ్లెట్లకు గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More