Best electric scooter : ఆ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఏథర్​ కోనార్క్ గట్టి పోటీ.. ఏది బెస్ట్?

ఏథర్ ఎనర్జీ సరికొత్త 'కోణార్క్' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.99,999 ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేసింది. టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ స్కూటర్లకు పోటీగా వచ్చిన ఈ మోడల్ ధర, బ్యాటరీ, రేంజ్ వివరాల సమగ్ర వివరాలను ఇక్కడ చూడండి..

Published on: Sep 1, 2026, 06:25:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ఏథర్ ఎనర్జీ సరికొత్త సంచలనానికి తెరలేపింది. తమ సరికొత్త ఈఎల్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన ‘కోనార్క్’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.99,999 ప్రారంభ ఎక్స్​షోరూం ధరకు విడుదల చేసింది. ఇప్పటివరకు రూ.లక్షకు పైగా బడ్జెట్ ఉన్న ప్రీమియం విభాగంలోనే దృష్టి పెట్టిన ఏథర్, ఇప్పుడు సాధారణ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ బడ్జెట్ స్కూటర్‌ను తీసుకొచ్చింది.

ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్..
ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్..

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ప్రతిరోజూ ఆఫీసులకు, వ్యాపారాలకు వెళ్లే సామాన్యులకు పెట్రోల్ భారం రోజురోజుకూ పెరుగుతోంది. నెలకు వేల రూపాయలు ఇంధనానికే వెచ్చించలేక ఇబ్బంది పడే మధ్యతరగతి ప్రయాణికులకు ఈ తక్కువ ధర ఈవీ ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారనుంది. అయితే, ఇప్పటికే భారత మార్కెట్లో సత్తా చాటుతున్న టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ స్కూటర్లకు ఏథర్ కోనార్క్ ఎంతవరకు పోటీ ఇస్తుందో ధర, రేంజ్, బ్యాటరీ సామర్థ్యాల ఆధారంగా విశ్లేషించుకుందాము.

రేంజ్ రేసులో ఎవరిది పైచేయి?

సింగిల్ ఛార్జ్‌పై అత్యధిక దూరం ప్రయాణించే విషయంలో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ 5.3 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇది ఐడీసీ నిబంధనల ప్రకారం గరిష్ఠంగా 212 కిలోమీటర్ల (145 కి.మీ - 212 కి.మీ) రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీని తర్వాతి స్థానంలో ఏథర్ కోనార్క్ ఎస్ నిలుస్తుంది. ఈ వేరియంట్ మోడల్‌ను బట్టి 100 కిలోమీటర్ల నుంచి గరిష్ఠంగా 200 కిలోమీటర్ల వరకు రేంజ్ ఆఫర్ చేస్తోంది. బజాజ్ చేతక్ సీ3501, సీ3502 మోడళ్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 113 కి.మీ నుంచి 153 కి.మీ వరకు ప్రయాణిస్తాయి.

ఇక ఎంట్రీ లెవల్ మోడళ్ల విషయానికి వస్తే.. ఏథర్ కోనార్క్ ఎస్ 100 మోడల్ 100 కి.మీ రేంజ్ ఇస్తుండగా, టీవీఎస్ ఐక్యూబ్ 2.3 మోడల్ 114 కి.మీ, బజాజ్ చేతక్ సీ3001 మోడల్ 131 కి.మీ రేంజ్ అందిస్తున్నాయి. సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి ఐక్యూబ్ ఎస్‌టీ 5.3 అనుకూలంగా ఉన్నప్పటికీ, రోజువారీ నగర ప్రయాణాలకు ఏథర్, బజాజ్ మోడళ్లు సరైన పోటీని ఇస్తున్నాయి.

బ్యాటరీ సామర్థ్యం.. ఎవరి వద్ద ఎంత శక్తి ఉంది?

బ్యాటరీ సైజు విషయంలోనూ టీవీఎస్ సంస్థే ముందంజలో ఉంది. ఐక్యూబ్ ఎస్‌టీ 5.3 ఎలక్ట్రిక్ స్కూటర్.. 5.3 కేడబ్ల్యూహెచ్ భారీ బ్యాటరీ ప్యాక్‌ను, ఐక్యూబ్ ఎస్ 4.7 మోడల్‌లో 4.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అమర్చారు. ఏథర్ కోనార్క్ శ్రేణిలో ప్రాథమిక ఎస్ 100 మోడల్ 2.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో రాగా, అత్యున్నత ఎస్ 161 మోడల్ 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో లభిస్తుంది.

మరోవైపు బజాజ్ సంస్థ చేతక్ సిరీస్‌లో కేవలం రెండు రకాల బ్యాటరీలను మాత్రమే అందిస్తోంది. సీ3001 ఎలక్ట్రిక్ స్కూటర్​లో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, సీ35 సిరీస్‌లో 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అమర్చింది. టీవీఎస్ ఎక్కువ బ్యాటరీ ఆప్షన్లను అందిస్తున్నప్పటికీ, ఏథర్, బజాజ్ సంస్థలు చిన్న బ్యాటరీ ప్యాక్‌లతోనే మెరుగైన రేంజ్ అందించే సాంకేతికతపై దృష్టి సారించాయి.

ధరల వివరాలు.. జేబుకు ఏది భార తక్కువ?

ఈ మూడింటిలో అత్యంత తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఏథర్ కోనార్క్ ఎస్ 100 నిలిచింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.99,999 కావడం విశేషం. గరిష్ఠంగా 161 కి.మీ రేంజ్ ఇచ్చే కోణార్క్ 'జెడ్' వేరియంట్‌ను కంపెనీ త్వరలోనే విడుదల చేయనుంది.

టీవీఎస్ ఐక్యూబ్ శ్రేణి ప్రారంభ మోడల్ (2.3) ధర రూ.1.11 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ ఐక్యూబ్ ఎస్‌టీ 5.3 వేరియంట్ వద్ద రూ.1.77 లక్షల వరకు ఉంది. బజాజ్ చేతక్ సిరీస్ మధ్యస్థమైన ధరలతో లభిస్తోంది. చేతక్ ప్రారంభ మోడల్ సీ3001 ధర రూ.1.19 లక్షలు కాగా, టాప్ వేరియంట్ సీ3501 ధర రూ.1.57 లక్షలుగా ఉంది.

మూడు కంపెనీల భిన్నమైన వ్యూహాలు..

భారత ఈవీ మార్కెట్లో ఈ మూడు దిగ్గజాలు వేర్వేరు వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఏథర్ ఎనర్జీ ఇప్పటివరకు స్పోర్టీ లుక్ ఇచ్చే 450 సిరీస్, కుటుంబ అవసరాలకు రిజ్టా స్కూటర్లను విక్రయించగా, సామాన్యులకు అందుబాటులో ఉండేలా నూతన ఈఎల్ ప్లాట్‌ఫారమ్‌పై కోనార్క్‌ను తెచ్చింది. టీవీఎస్ సంస్థ ఐక్యూబ్ మోడల్‌లోనే అనేక రకాల బ్యాటరీ, వేరియంట్ ఆప్షన్లను అందిస్తూ, బడ్జెట్ కొనుగోలుదారుల కోసం ఆర్బిటర్ మోడల్‌ను కూడా విక్రయిస్తోంది. బజాజ్ సంస్థ మాత్రం ఒకే ఒక 'చేతక్' బ్రాండ్ పేరుతో వివిధ కాన్ఫిగరేషన్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తక్కువ బడ్జెట్‌లో అత్యాధునిక ఈవీ కోరుకునే వారికి ఏథర్ కోనార్క్ సరైన ఎంపికగా నిలవనుంది అని ఆటోమొబైల్​ నిపుణులు చెబుతున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More