TVS iQube : బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్ టీవీఎస్​ ఐక్యూబ్ వేరియంట్లు, వాటి ధరలు, రేంజ్..

Best selling electric scooter : భారత ఈవీ మార్కెట్​లో అత్యంత ఆదరణ పొందిన ‘టీవీఎస్ ఐక్యూబ్’ మూడు ప్రధాన వేరియంట్లలో లభిస్తోంది. బేస్ ఐక్యూబ్ (మూడు విభిన్న బ్యాటరీ ఆప్షన్లతో), ఐక్యూబ్ ఎస్, టాప్-ఎండ్ ఐక్యూబ్ ఎస్‌టీ రేంజ్, ఫీచర్లు, వాటి ధరల పూర్తి బ్రేక్‌డౌన్ ఇక్కడ చూద్దాం.

Published on: May 18, 2026, 09:14:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్​లో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ మోటార్స్​కు చెందిన ‘టీవీఎస్ ఐక్యూబ్’ బెస్ట్​ సెల్లింగ్​ ఈవీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి మీరు ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే! టీవీఎస్ ఐక్యూబ్ వేరియంట్లు, రేంజ్, ధర వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

టీవీఎస్​ ఐక్యూబ్..
టీవీఎస్​ ఐక్యూబ్..

టీవీఎస్​ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్- వేరియంట్లు..

ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం మూడు ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి – ఐక్యూబ్ (స్టాండర్డ్), ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్‌టీ. ఇందులో బేస్ వేరియంట్ మూడు రకాల బ్యాటరీ కెపాసిటీ ఆప్షన్లలో లభిస్తుండగా.. ఎస్, ఎస్‌టీ వేరియంట్లు ఫిక్స్‌డ్ పెద్ద బ్యాటరీ ప్యాక్‌లతో వస్తాయి. బడ్జెట్, అవసరాలకు తగినట్లుగా ఏ వేరియంట్ ఎలాంటి ఫీచర్లు, రేంజ్ ఆఫర్ చేస్తుందో పూర్తి వివరాలు కింద తెలుసుకోండి.

టీవీఎస్ ఐక్యూబ్ వేరియంట్ల పూర్తి వివరాలు..

టీవీఎస్ ఐక్యూబ్ (బేస్ వేరియంట్):

ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్ బేస్ మోడల్ మూడు రకాల బ్యాటరీ ఆప్షన్లలో (2.2 కేడబ్ల్యూహెచ్, 3.1 కేడబ్ల్యూహెచ్, 3.5 కేడబ్ల్యూహెచ్) లభిస్తుంది. బ్యాటరీ సైజును బట్టి వీటి రేంజ్, ఛార్జింగ్ సమయం మారుతుందే తప్ప ఫీచర్లు అన్నీ ఒకేలా ఉంటాయి. మూడు వేరియంట్లు కూడా కేవలం 4.2 సెకన్లలోనే 0 నుంచి 40 కిమీ వేగాన్ని అందుకుంటాయి.

2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: ఇది సింగిల్ ఛార్జ్‌పై 94 కిమీ (ఐడీసీ క్లెయిమ్డ్) రేంజ్‌ను ఇస్తుంది. దీని బ్యాటరీ 0-80 శాతం ఛార్జ్ అవ్వడానికి 2 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 75 కిమీ.

3.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: ఇది 123 కిమీల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. 0-80 శాతం ఛార్జింగ్‌కు 4 గంటల 3 నిమిషాల సమయం పడుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 82 కిమీ.

3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: ఇది గరిష్టంగా 145 కిమీల రేంజ్‌ను ఇస్తుంది. 0-80 శాతం ఛార్జింగ్‌కు 4 గంటల 40 నిమిషాలు పడుతుంది. దీని టాప్ స్పీడ్ కూడా గంటకు 82 కిమీ.

ఫీచర్లు: 5-ఇంచుల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, పూర్తి ఎల్‌ఈడీ లైటింగ్, ఎకో- పవర్ రైడింగ్ మోడ్స్, రివర్స్- ఫార్వర్డ్ పార్కింగ్ అసిస్ట్ ఉన్నాయి. అదనంగా బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/ఎస్​ఎంఎస్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్స్, జియోఫెన్సింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు స్టాండర్డ్‌గా వస్తాయి.

ధర: బేస్ ఐక్యూబ్ ఎక్స్​షోరూం ధర రూ. 1.07 లక్షల నుంచి రూ. 1.21 లక్షల మధ్య ఉంది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ :

ఈ మిడ్-లెవల్ వేరియంట్‌లో పెద్దదైన 4.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ను అందించారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 175 కిమీల అద్భుతమైన ఐడీసీ రేంజ్‌ను ఇస్తుంది.

టాప్ స్పీడ్ అండ్ ఛార్జింగ్: దీని గరిష్ట వేగం గంటకు 82 కిమీ కాగా, 0-80 శాతం ఛార్జ్ అవ్వడానికి కేవలం 4 గంటల సమయం పడుతుంది. ఇది 0-40 కిమీ వేగాన్ని 4.3 సెకన్లలో అందుకుంటుంది.

అదనపు ఫీచర్లు: బేస్ మోడల్‌లోని ఫీచర్లతో పాటు ఇందులో పెద్దదైన 7-ఇంచుల టీఎఫ్​టీ డిస్‌ప్లే (నాన్-టచ్), వాయిస్ అసిస్ట్ (వాయిస్ కమాండ్స్), కొండలపై వాహనం వెనక్కి జారిపోకుండా ఆపే హిల్ హోల్డ్ కంట్రోల్ ఫంక్షనాలిటీ లభిస్తాయి.

ధర: టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ధర రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ :

ఇది ఈ లైనప్‌లోనే అత్యంత ప్రీమియం, టాప్-స్పెక్ వేరియంట్. ఇందులో భారీ సామర్థ్యం గల 5.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 212 కిమీల (ఐడీసీ క్లెయిమ్డ్) బంపర్ రేంజ్‌ను అందిస్తుంది.

పర్ఫార్మెన్స్ అండ్ ఛార్జింగ్: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 82 కిమీ. భారీ బ్యాటరీ బరువు కారణంగా ఈ లైనప్‌లోనే ఇది అత్యంత నెమ్మదిగా (0-40 కిమీ వేగాన్ని 4.5 సెకన్లలో) అందుకుంటుంది. దీని బ్యాటరీ 0-80 శాతం ఛార్జ్ కావడానికి 4 గంటల 18 నిమిషాలు పడుతుంది.

టాప్ ఫీచర్లు: ‘ఐక్యూబ్ ఎస్’ లోని ఫీచర్లకు అదనంగా ఇందులో 7-ఇంచుల అద్భుతమైన టచ్‌స్క్రీన్ టీఎఫ్​టీ డిస్‌ప్లే, రైడర్ భద్రత కోసం టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) ను చేర్చారు.

ధర: టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ వేరియంట్ ఎక్స్​షోరూం ధర రూ. 1.83 లక్షలు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More