Ather Rizta : 2ఏళ్లల్లో 3లక్షల సేల్స్​- బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇది..

Ather Rizta sales : భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్​లో ఏథర్ ఎనర్జీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ సంస్థ ఫ్యామిలీ స్కూటర్ 'రిజ్టా' లాంచ్ అయిన రెండేళ్లలోనే 3 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని దాటింది. రోజుకు సగటున 410 స్కూటర్లు అమ్ముడవుతూ ఏథర్ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. పూర్తి వివరాలు..

Published on: May 12, 2026, 06:43:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ather Rizta price : భారతదేశ ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఏథర్ ఎనర్జీ’ మార్కెట్​లో తన దూకుడును కొనసాగిస్తోంది. ఆ సంస్థ నుంచి వచ్చిన మొట్టమొదటి ఫ్యామిలీ స్కూటర్ ‘రిజ్టా’.. విక్రయాల్లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. మార్కెట్​లోకి ప్రవేశించిన కేవలం రెండు సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే ఈ స్కూటర్ 3 లక్షల యూనిట్ల సేల్స్​ మైలురాయిని దాటింది. అంటే.. ఏథర్ సంస్థ రోజుకు సగటున దాదాపు 410 రిజ్టా ఎలక్ట్రిక్​ స్కూటర్లను విక్రయిస్తుండటం విశేషం.

ఏథర్​ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్..
ఏథర్​ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్..

ఏథర్​ రిజ్టా ఎలక్ట్రిక్​ స్కూటర్- పెరుగుతున్న ఆదరణ..

2024 ఏప్రిల్‌లో ఏథర్ తన మొదటి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఈ రిజ్టాను పరిచయం చేసింది. అప్పటి నుంచి కంపెనీ విక్రయాల్లో ఇది ప్రధాన భూమిక పోషిస్తోంది. 2025 డిసెంబర్ నాటికి 2 లక్షల యూనిట్ల అమ్మకాలను పూర్తి చేసుకోగా, తర్వాతి ఒక లక్ష యూనిట్ల మార్కును కేవలం ఐదు నెలల్లోనే అందుకోవడం గమనార్హం. దీన్ని బట్టి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్లకు దేశంలో ఎంతలా డిమాండ్ పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఏథర్​ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్- దక్షిణాది దాటి.. మధ్య భారతం వైపు!

రిజ్టా ఈవీ రాకతో ఏథర్ కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా తన మార్కెట్‌ను విస్తరించుకుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఏథర్ మార్కెట్ వాటా నాలుగు రెట్లు పెరిగింది. క్యూ1 ఎఫ్‌వై25లో 4.1 శాతంగా ఉన్న మార్కెట్ వాటా, క్యూ4 ఎఫ్‌వై26 నాటికి ఏకంగా 17.3 శాతానికి చేరుకుంది. అదేవిధంగా పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా విక్రయాలు మూడు రెట్లు వృద్ధి చెందాయి.

ఏథర్​ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్- కుటుంబాల ఫేవరెట్ ఎందుకు?

ఏథర్ రిజ్టా స్కూటర్ కొనుగోలుదారుల్లో దాదాపు 70 శాతం మంది పిల్లలు ఉన్న కుటుంబాలే కావడం విశేషం. దీనికి ప్రధాన కారణం ఈ స్కూటర్‌లో ఉండే సౌకర్యాలే:

భారీ స్టోరేజ్: ఇందులో మొత్తం 56 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం ఉంది (34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ + 22 లీటర్ల ఫ్రంక్).

విశాలమైన సీటు: కుటుంబం మొత్తం సౌకర్యవంతంగా ప్రయాణించేలా పెద్ద సీటు, విశాలమైన ఫ్లోర్‌బోర్డ్‌ను అందించారు.

భద్రత: స్కిడ్ కంట్రోల్, థెఫ్ట్ అలర్ట్స్, టో- అలర్ట్స్ వంటి ఆధునిక ఫీచర్లు ప్రయాణాన్ని సురక్షితం చేస్తాయి.

"రిజ్టాను పక్కా ఫ్యామిలీ స్కూటర్‌గా మేము రూపొందించాం, ఇది దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో దక్షిణాదిలో మేము అగ్రస్థానంలో నిలవడానికి, మధ్య భారతంలో మా మార్కెట్ వాటా 4 రెట్లు పెరగడానికి ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్ ప్రధాన కారణం. ప్రస్తుతం మా మొత్తం పోర్ట్‌ఫోలియోలో రిజ్టా వాటా 76 శాతంగా ఉంది," అని ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకెలా వివరించారు.

ఏథర్​ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్- టెక్నాలజీలోనూ అగ్రస్థానం!

కేవలం హార్డ్‌వేర్ మాత్రమే కాకుండా, సాఫ్ట్‌వేర్ పరంగానూ ఏథర్ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తోంది. 2025 సెప్టెంబర్‌లో ‘ఏథర్‌స్టాక్ 7’ ఓటీఏ అప్‌డేట్ ద్వారా రిజ్టా జెడ్ మోడల్ కస్టమర్లకు టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇలాంటి వినూత్న మార్పులు వినియోగదారులకు మెరుగైన అనుభూతిని అందిస్తూ, రిజ్టాను ఈవీ విభాగంలో తిరుగులేని విజేతగా నిలబెడుతున్నాయి.

ఇండియాలో ఏథర్​ రిజ్టా ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 1.1లక్షలుగా ఉంది. ఈ మోడల్ దాదాపు 160 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More