AUS vs BAN : ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాక్! మొదటి టెస్టులో బంగ్లాదేశ్ ఘన విజయం- ఏకంగా 9 వికెట్ల తేడాతో..
AUS vs BAN live : డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాను బంగ్లాదేశ్ చిత్తు చేసింది! ఆసీస్ గడ్డపై ఆ జట్టుకిదే తొలి టెస్ట్ గెలుపు.
ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో మరో సంచలనం! నజ్ముల్ హొసేన్ శాంటో నేతృత్వంలోని బంగ్లాదేశ్ టీమ్.. బలమైన ఆస్ట్రేలియా జట్టును, ఆస్ట్రేలియాలోనే ఓడించింది. డార్విన్ మర్రారా క్రికెట్ గ్రౌండ్లో నాలుగు రోజుల్లోనే ముగిసిన పోయిన మొదటి టెస్టు మ్యాచ్‌లో బంగ్లా ఘన విజయం సాధించి, ఆ దేశ ఫ్యాన్స్‌కి చిరస్మరణీయ జ్ఞాపకాన్ని ఇచ్చింది.

23ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలో తొలిసారి పర్యటించిన బంగ్లాదేశ్‌కు టెస్టుల్లో ఇదే మొదటి విజయం. పైగా ఇది మామూలు గెలుపు కాదు! ప్రత్యర్థులను బెంబేలెత్తించే ఆసిస్‌పై బంగ్లా టీమ్ ఏకంగా 9 వికెట్ల తేడాతో గెలిచేసింది.
ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మొదటి టెస్టు- మ్యాచ్‌లో అసలు ఏం జరిగింది?
రెండు మ్యాచుల టెస్టు సిరీస్ కోసం బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇక మొదటి టెస్టులో టాస్ ఓడిపోయినప్పటికీ బంగ్లాదేశ్ ఏ దశలోనూ తప్పు చేయలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో హసన్ మహమూద్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆరు వికెట్లు పడగొట్టి ఆసిస్ వెన్నువిరిచాడు. దీనితో ఆతిథ్య జట్టు కేవలం 198 పరుగులకే కుప్పకూలింది. స్టీవ్ స్మిత్ (71) పోరాడకపోతే ఆ స్కోరు కూడా వచ్చేది కాదు!
అయితే ఆస్ట్రేలియా బౌలింగ్ యూనిట్ ఎంత భయంకరంగా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పైగా మ్యాచు జరుగుతోంది ఆస్ట్రేలియాలో! బంగ్లా బౌలర్లే విరుచుకుపడినప్పుడు, ఆసిస్ బౌలర్లు రెచ్చిపోవడం ఖాయం అని, బంగ్లాదేశ్ కూడా తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందని అందరు భావించారు.
కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన్జిద్ హసన్ తమీమ్ (101), మొమినుల్ హక్ (49), కెప్టెన్ శాంటో (84), మెహిదీ హసన్ మిరాజ్ (65) రాణించారు. దీనితో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులు చేసి, ఏకంగా 228 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది.
ఆసిస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ ఆరు వికెట్లు తీశాడు. కానీ ఆస్ట్రేలియా ఫీల్డర్లు అనేక క్యాచులు మిస్ చేశారు.
ఇక మొదటి ఇన్నింగ్స్‌తో పోల్చితే రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మెరుగైన స్కోరు చేసింది. 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కామరూన్ గ్రీన్ 104 పరుగులు చేశాడు.
బౌలర్లలో మెహిదీ హసన్ ఐదు వికెట్లతో చెలరేగగా, హసన్ మహమూద్ మొత్తం మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీసి అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే, ఈ స్కోరు ఆసిస్‌కు ఏమాత్రం సరిపోలేదు!
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాంటింగ్‌కి వచ్చిన బంగ్లాదేశ్ జట్టు.. 56 పరుగుల టార్గెట్‌ని కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించేసింది.
ఈ విధంగా మొదటి టెస్టు నాలుగో రోజు రెండో సెషన్‌లోనే 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు.
రసవత్తరంగా డబ్ల్యూటీసీ పోరు- భారత్ పరిస్థితేంటి?
ఈ సంచలన ఫలితం తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆసిస్.. పాయింట్ల శాతంలో (పీసీటీ) తగ్గుదల కనిపించింది. అయితే పట్టికలో ఆ జట్టు స్థానంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఈ దఫా డబ్ల్యూటీసీ సైకిల్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు ఇది రెండో ఓటమి మాత్రమే కావడం విశేషం. ఈ పరాజయంతో కమిన్స్ జట్టు పాయింట్ల శాతం 87.50% నుంచి 77.78%కి పడిపోయింది.
మరోవైపు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న బంగ్లాదేశ్ నాల్గొవ స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు పాయింట్ల శాతం 58.33% నుంచి 66.67%కి ఎగబాకింది.
ప్రస్తుతం శ్రీలంకలో సిరీస్ ఆడుతున్న భారత్ మాత్రం.. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో 48.15%తో ఐదో స్థానంలోనే ఉంది!
గతేడాది సౌతాఫ్రికా చేతిలో సొంతగడ్డపై 2-0తో వైట్‌వాష్ కావడంతో పాటు న్యూజిలాండ్ చేతిలోనూ ఎదురైన పరాజయాలు భారత్‌ను వెనక్కి నెట్టాయి. మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే శుభ్‌మాన్ గిల్ బృందం తమ ప్రదర్శనను గణనీయంగా మెరుగుపరుచుకోవాలి.
అయితే ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మొదటి జట్టు ఫలితం.. గతంలో ఫైనల్ అవకాశాలను చేజార్చుకున్న టీమిండియాకు మాత్రం కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.
శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌లో క్లీన్‌స్వీప్ సాధిస్తే భారత్‌కు మెరుగైన అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లోనూ రాణించాల్సి ఉంటుంది. నవంబర్‌లో జరిగే న్యూజిలాండ్ పర్యటన కూడా భారత్ అదృష్టాన్ని నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
ఇప్పటికైతే ఆస్ట్రేలియా టాప్‌లోనే ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మ్యాచు ఓటమి అనేది ఆ టీమ్‌కి వేకప్ కాల్ అని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు ఆస్ట్రేలియాకు రాబోయే రోజులు కఠినంగా మారనున్నాయి. ఆ జట్టుకు ఇంకా 13 టెస్టులు మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగా వచ్చే ఏడాది భారత్‌లో ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. గతంలో భారత్‌లో ఆడిన చివరి 12 టెస్టుల్లో ఆస్ట్రేలియా గెలిచింది రెండే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత్ పర్యటన ఆసిస్ అర్హత రేసును నిర్ణయించడంలో కీలకం కానుంది. ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియా తమ మిగిలిన మ్యాచ్‌ల్లో కనీసం ఎనిమిదింట్లో గెలవాల్సి రావచ్చు.
"బంగ్లాదేశ్ ఇచ్చిన ఈ షాక్ ఆస్ట్రేలియాను అప్రమత్తం చేసింది. అదే సమయంలో భారత జట్టుకు ఇది సరైన సమయంలో తగిలిన ఉత్సాహం," అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ అవకాశాన్ని భారత్ ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుందనే దానిపైనే వారి ఫైనల్ ఆశలు ఆధారపడి ఉన్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


