...
...
Next Story

Dmart share price : 52 వారాల కనిష్ఠానికి డీమార్ట్ షేరు ధర- ఎందుకు పడుతోంది? ఇప్పుడు బై ఆర్ సెల్?

రాధాకిషన్ ధమానీ సారథ్యంలోని డీమార్ట్ (అవెన్యూ సూపర్ మార్ట్స్) రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన అనంతరం షేరు ధర భారీగా పతనమై 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరింది. మరి డీమార్ట్ షేర్లను ఇప్పుడు ఏం చేయాలి? కొనాలా? అమ్మేయాలా? నిపుణులు విశ్లేషణ..

Published on: Oct 12, 2026, 10:40:15 IST
Advertisement

రాధాకిషన్ ధమానీకి చెందిన రిటైల్ రంగ దిగ్గజం 'అవెన్యూ సూపర్ మార్ట్స్' (డీమార్ట్) షేర్లు సోమవారం (అక్టోబర్ 12) ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయాయి. జులై-సెప్టెంబర్ (క్యూ2 ఎఫ్​వై27) త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. దీనితో బీఎస్ఈలో డీమార్ట్ షేరు ధర ట్రేడింగ్ ప్రారంభంలోనే 4.4 శాతం పతనమై 52 వారాల కనిష్ఠ స్థాయి అయిన రూ. 3,366ని తాకింది. గత సెషన్ ముగింపు రూ. 3,520 తో పోలిస్తే ఈ రోజు షేరు రూ. 3,405 వద్ద ప్రారంభమైంది.

భారీగా పతనమైన డీమార్ట్ స్టాక్- కారణం ఏంటి? (Agencies+AI for representational purposes)
భారీగా పతనమైన డీమార్ట్ స్టాక్- కారణం ఏంటి? (Agencies+AI for representational purposes)

ఇక సోమవారం ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయంలో డీమార్ట్ షేరు ధర 2.6శాతం పతనమై రూ. 3,424 వద్ద ట్రేడ్​ అవుతోంది. మరి ఇప్పుడు ఈ స్టాక్​ని ఏం చేయాలి? కొనాలా? లేక ఉన్నవి అమ్మేయాలా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

డీమార్ట్ షేర్ ప్రైజ్- లాభాల మార్జిన్లపై తీవ్ర ఒత్తిడి..

కంపెనీ రాబడి పెరిగినప్పటికీ, నిర్వహణ ఖర్చులు వేగంగా పెరగడంతో లాభాల మార్జిన్లు కుంచించుకుపోయాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో అవెన్యూ సూపర్ మార్ట్స్ ఏకీకృత నికర లాభం (ప్యాట్) వార్షికంగా 8.5 శాతం వృద్ధితో రూ. 742.98 కోట్లుగా నమోదైంది. కంపెనీ మొత్తం రాబడి 18 శాతం పెరిగి రూ. 19,657.50 కోట్లకు చేరింది.

ఎబిట్​డా 14.7 శాతం పెరిగి రూ. 1,393 కోట్లకు చేరుకున్నప్పటికీ, ఎబిట్​డా మార్జిన్ గతేడాది ఇదే త్రైమాసికంలో ఉన్న 7.3 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గింది. అదేవిధంగా, నికర లాభ మార్జిన్ కూడా 4.1 శాతం నుంచి 3.8 శాతానికి పడిపోయింది.

క్విక్ కామర్స్ సంస్థల పోటీ, డిస్కౌంట్ల పెంపు వల్ల ఈ ఒత్తిడి పెరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

డీమార్ట్ షేర్ ప్రైజ్- ఏడాది గరిష్ఠం నుంచి 27% పతనం!

ఫలితాల ప్రకటన అనంతరం ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు డీమార్ట్ స్టాక్‌పై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి:

ఎమ్కే గ్లోబల్ : ఈ స్టాక్‌కు 'సెల్' (అమ్మేయవచ్చు) రేటింగ్‌ను ఇస్తూ, డీమార్ట్ షేర్ ప్రైజ్ టార్గెట్​ని గతంలో ఉన్న రూ. 3,700 నుంచి రూ. 3,300కి తగ్గించింది! లాభాల వృద్ధి మందగించడం, అప్పులు పెరగడం, పెట్టుబడులపై రాబడి తగ్గడం వంటి అంశాలను నివేదికలో పేర్కొంది.

మోతీలాల్ ఓస్వాల్: ఈ స్టాక్‌పై 'న్యూట్రల్' వైఖరిని కొనసాగిస్తూ, టార్గెట్ ప్రైజ్​ని రూ. 4,000 నుంచి రూ. 3,925 కి సవరించింది. సమీప భవిష్యత్తులో డిస్కౌంట్లు, కొత్త కస్టమర్ల సేకరణ ఖర్చులు పెరగడం వల్ల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతుందని అంచనా వేసింది.

రిటైల్ రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో స్వల్పకాలంలో ఈ షేరు ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉందని, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంబించడం మంచిదని పలువురు స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks