...
...
Next Story

Bank holidays : సెప్టెంబర్​లో బ్యాంకులకు ఏకంగా 16 రోజుల పాటు సెలవులు- సమ్మె కూడా!

ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్​లో వినాయక చవితి, కృష్ణాష్టమి వంటి పండుగలు, వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 16 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. దీనికి తోడు బ్యాంకు ఉద్యోగులు చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెతో నెలాఖరులో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశముంది. పూర్తి వివరాలు..

Published on: Aug 30, 2026, 09:10:13 IST
Advertisement

రేపటి నుంచి సెప్టెంబర్ నెల ప్రారంభమవుతుంది. మరి వచ్చే నెలలో వ్యక్తిగత, అధికారిక పనుల మీద మీరు బ్యాంకు శాఖలకు వెళ్లాలని యోచిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్, డిపాజిట్లు వంటి పనులను ముందస్తుగానే ప్రణాళిక చేసుకోవడం మంచిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నెలలో పండుగలు, ప్రాంతీయ సెలవులు, శని, ఆదివారాలతో కలిపి మొత్తం 16 రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు లభించనుంది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పండుగ సెలవులు..

బ్యాంకు సెలవుల లిస్ట్..
బ్యాంకు సెలవుల లిస్ట్..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రధాన పండుగల కారణంగా బ్యాంకులు పనిచేయవు.

సెప్టెంబర్ 4 (కృష్ణాష్టమి): శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

సెప్టెంబర్ 14 (వినాయక చవితి): వినాయక చవితి (వరసిద్ధి వినాయక వ్రతం) రోజున ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి.

రాష్ట్రాల వారీగా పండుగల జాబితా..

వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే స్థానిక సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా ఆయా తేదీల్లో బ్యాంకులు మూతపడనున్నాయి:

సెప్టెంబర్ 11: జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల నిర్వహణ కారణంగా జైపూర్‌లో బ్యాంకులు పనిచేయవు.

సెప్టెంబర్ 12: శ్రీమంత శంకరదేవుడి తిరోభవ తిథి పురస్కరించుకుని అసోంలో సెలవు.

సెప్టెంబర్ 15: సంవత్సరి (చతుర్థి పక్ష) సందర్భంగా గుజరాత్‌లో, నువాఖై పండుగ సందర్భంగా ఒడిశాలో, అలాగే వినాయక చవితి రెండో రోజు వేడుకల సందర్భంగా గోవాలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

సెప్టెంబర్ 21: అసోంలో శ్రీమంత శంకరదేవుడి జన్మోత్సవం, కేరళలో శ్రీ నారాయణ గురు సమాధి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.

సెప్టెంబర్ 23: మహారాజా హరిసింగ్ జీ జయంతిని పురస్కరించుకుని జమ్ముకశ్మీర్‌లో బ్యాంకులు మూతపడతాయి.

సెప్టెంబర్ 25: ఇంద్రజాతర పండుగ సందర్భంగా సిక్కింలో సెలవు ఉంటుంది.

ఇక సాధారణ వారాంతపు సెలవుల విషయానికొస్తే.. అన్ని ఆదివారాలతో పాటు సెప్టెంబర్ 12 (రెండో శనివారం), సెప్టెంబర్ 26 (నాలుగో శనివారం) రోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.

డిజిటల్ సేవలు యథావిధిగా లభ్యం..

బ్యాంకు శాఖలు మూతపడినప్పటికీ ఆన్‌లైన్ సేవలకు ఎలాంటి ఆటంకం ఉండదు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, యూపీఐ లావాదేవీలు, ఏటీఎం సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. అత్యవసర నగదు ఉపసంహరణ లేదా డిజిటల్ చెల్లింపుల కోసం వినియోగదారులు ఆన్‌లైన్ మార్గాలను ఆశ్రయించవచ్చు.

నెలాఖరులో వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్?

కేవలం పండుగ సెలవులే కాకుండా బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపు కస్టమర్లను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. వారానికి 5 రోజుల బ్యాంకింగ్ నిబంధనను తక్షణమే అమల్లోకి తేవడం, సీనియర్ అధికారులకు ప్రవేశపెట్టిన సవరించిన పీఎల్ఐ పథకాన్ని ఉపసంహరించుకోవాలనే ప్రధాన డిమాండ్లతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది.

యూఎఫ్ బ్యూ ప్రణాళిక ప్రకారం సెప్టెంబర్ 11న ఒక రోజు దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నారు. ఆ తర్వాత నెలాఖరులో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు వరుసగా మూడు రోజుల పాటు సమ్మె చేపడతారు.

ఒకవేళ యూనియన్లతో చర్చలు విఫలమై సమ్మె ముందుకెళ్తే, నెలాఖరులో బ్యాంకింగ్ వ్యవస్థ స్తంభించిపోనుంది. సెప్టెంబర్ 26 (రెండో శనివారం), సెప్టెంబర్ 27 (ఆదివారం), ఆపై సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో సమ్మె కారణంగా వరుసగా 5 రోజుల పాటు బ్యాంకింగ్ లావాదేవీలకు తీవ్ర అంతరా కలిగే ప్రమాదం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe