Housing prices : ఏడాదికి రూ. 25వేల పార్కింగ్ ఫీజు- ఇక ఇళ్ల ధరలు, అద్దెలు పెరగడం అనివార్యమా?
Bengaluru real estate : బెంగళూరులో ఇళ్ల ముందు రోడ్లపై పార్కింగ్ చేసే వాహనాలకు ఏటా రూ. 25 వేల వరకు ఫీజు వసూలు చేసేలా కొత్త ప్రతిపాదన వచ్చింది. ఇది రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపనుంది. మరీ ముఖ్యంగా బెంగళూరులో అద్దె పెరగొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
బెంగళూరు ప్రజలకు ఇటీవలే ఊహించని షాక్ తగిలింది! పబ్లిక్ రోడ్ల మీద పార్కింగ్ చేసే వాహనదారుల నుంచి ఏడాదికి రూ. 25వేల వరకు ఫీజు వసూలు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) పార్కింగ్ నిబంధనలు 2026 అమల్లోకి వస్తే, నగరవాసులకు పార్కింగ్ తలనొప్పులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ముసాయిదా నిబంధనలపై కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానించింది.

ఈ ప్రతిపాదిత పార్కింగ్ ఛార్జీలు కేవలం వార్షిక ఖర్చులకే పరిమితం కాకుండా, ఇళ్ల ధరలు, అద్దెలు, కొనుగోలుదారుల నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సొంత పార్కింగ్ స్థలం ఉన్న ఇళ్లకు భవిష్యత్తులో డిమాండ్ విపరీతంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
అన్నింటికన్నా ముఖ్యంగా.. అద్దెకు ఉండేవారిపై ఈ భారం తీవ్రంగా ఉండొచ్చు. యజమానులు అద్దెను పెంచడం ద్వారా లేదా ప్రత్యేక పార్కింగ్ ఛార్జీల రూపంలో ఈ మొత్తాన్ని వసూలు చేసే అవకాశం ఉంది.
బెంగళూరు పార్కింగ్ ముసాయిదా నిబంధనలు ఏం చెబుతున్నాయి?
కొత్త ముసాయిదా ప్రకారం హ్యాచ్‌బ్యాక్ కార్లకు వార్షిక రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్ ఫీజు రూ. 15,000, సెడాన్ కార్లకు రూ. 20,000, ఎస్‌యూవీలకు రూ. 25,000గా నిర్ణయించారు. ప్రధాన రోడ్లు కాకుండా ఇతర నివాస ప్రాంతాల రోడ్లపై పార్కింగ్ చేయాలంటే మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన సరైన పార్కింగ్ పర్మిట్ ఉండాలి.
భవన నిర్మాణ ఉప నిబంధనల ప్రకారం నిర్దేశిత పార్కింగ్ సౌకర్యం ఉన్న బిల్డింగ్‌ల వాసులకు మాత్రమే ఈ పర్మిట్లు లభిస్తాయి. ఆన్-సైట్ పార్కింగ్ లేని బిల్డింగ్‌లలో నివసించేవారు ఈ రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్‌కు అనర్హులుగా మారే అవకాశం ఉంది. పర్మిట్ లేకుండా రోడ్లపై వాహనాలు నిలిపితే అక్రమ పార్కింగ్‌గా పరిగణించి జరిమానాలు విధిస్తారు.
జీబీఏ చీఫ్ కమిషనర్ నిర్ణయించే అదనపు అడ్మినిస్ట్రేటివ్ ఫీజును కూడా చెల్లించి పర్మిట్ పొందాల్సి ఉంటుంది. ఈ పర్మిట్ ఒక నిర్దిష్ట వాహనానికి, దాని యజమానికి ఒక సంవత్సరం పాటు వర్తిస్తుంది.
నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, పాదచారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ నిబంధనలను రూపొందించామని అధికారులు చెబుతున్నారు.
అలాగే రోడ్లపై పార్కింగ్ చేసే స్థలాలకు సంబంధించి కూడా నిబంధనలు పెట్టారు. ప్రధాన రోడ్లు కాని చోట వాహనం పోగా కనీసం 6 మీటర్ల రోడ్డు స్థలం, రెండు వైపులా 1.8 మీటర్ల నడకదారి ఉండేలా చూడాలి. స్థానిక రోడ్లలో కనీసం 4 మీటర్ల రోడ్డు స్థలం అందుబాటులో ఉండాలి.
రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయాలు ఏంటి?
బెంగళూరులో కార్ల వాడకం విపరీతంగా పెరిగిపోయిందని, పార్కింగ్ స్థలం కొరత తీవ్రంగా ఉందని 'నోబ్రోకర్' సహ వ్యవస్థాపకుడు సౌరభ్ గార్గ్ పేర్కొన్నారు. "ఈ నిబంధనల వల్ల సొంత పార్కింగ్ ఉన్న ఇళ్లకు ధరలు పెరుగుతాయి. లేనివారికి అద్దె భారం ఎక్కువవుతుంది. ఇది జీవన వ్యయాన్ని మరింత పెంచుతుంది," అని ఆయన స్పష్టం చేశారు.
"ఈ వార్షిక పార్కింగ్ ఛార్జీలు నేరుగా ఇళ్ల ధరలను విపరీతంగా పెంచకపోయినా, డెడికేటెడ్ పార్కింగ్ ఉన్న ప్రాపర్టీలకు, రోడ్డుపై పార్క్ చేసే వాటికి మధ్య ధరల వ్యత్యాసాన్ని పెంచుతాయి," అని 'ప్రాపర్టీ ఫస్ట్ రియల్టీ' ఫౌండర్ భావేష్ కొఠారి తెలిపారు. కాలక్రమేణా ఇది అద్దె ప్రాధాన్యతలను కూడా మారుస్తుందని ఆయన చెప్పారు.
"రోడ్లపై పార్కింగ్ చేయడానికి డబ్బు చెల్లించాల్సి వస్తే, సొంత ప్రాపర్టీలో పార్కింగ్ సౌకర్యం ఉన్న ఇళ్లకే కొనుగోలుదారులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు," అని 'స్క్వేర్ యార్డ్స్' సహ వ్యవస్థాపకుడు సోపన్ గుప్తా వివరించారు.
అయితే దీని ప్రభావం బెంగళూరు అంతటా ఒకేలా ఉండదని, ప్రాంతాన్ని బట్టి మారుతుందని గుప్తా అభిప్రాయపడ్డారు.
అయితే ఈ పార్కింగ్ ఫీజు వ్యవహారం ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది. దీనిని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో చూడాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


