సిటీలో ఫ్లాట్ మేలా? శివార్లలో విల్లానా? బెంగళూరు టెకీల తర్జనభర్జన

ఉద్యోగ మార్పులు, ట్రాఫిక్ కష్టాల మధ్య బెంగళూరులో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారు అయోమయంలో పడుతున్నారు. ఆఫీస్ దగ్గర ఫ్లాట్ లేదా శివార్లలో విల్లా.. ఏది బెటర్? తాజా ట్రెండ్స్, నిపుణుల విశ్లేషణ మీకోసం.

Published on: Dec 23, 2025, 08:47:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బెంగళూరు లాంటి మెట్రో నగరంలో సొంతిల్లు అనేది ఒక భావోద్వేగంతో కూడిన నిర్ణయం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అది కేవలం ఇష్టం మాత్రమే కాదు, ఒక పెద్ద సవాలుగా మారింది. ఐటీ హబ్‌లకు దగ్గరగా ఉండే ఫ్లాట్ కొనాలా? లేక కాస్త దూరమైనా ప్రశాంతంగా ఉండే శివార్లలో విల్లా తీసుకోవాలా? అనే అంశంపై ఇప్పుడు బెంగళూరు వాసుల్లో పెద్ద చర్చ నడుస్తోంది. తాజాగా రెడిట (Reddit) వేదికగా ఐటీ ఉద్యోగులు పంచుకున్న అనుభవాలు ఈ అయోమయాన్ని కళ్లకు కడుతున్నాయి.

సిటీలో ఫ్లాట్ మేలా? శివార్లలో విల్లానా? బెంగళూరు టెకీల తర్జనభర్జన (Pexels)
సిటీలో ఫ్లాట్ మేలా? శివార్లలో విల్లానా? బెంగళూరు టెకీల తర్జనభర్జన (Pexels)

ఉద్యోగం మారింది.. ట్రాఫిక్ మొదలైంది

మారతహళ్లిలో ఉంటున్న ఒక ఉద్యోగి తన గోడు వెళ్లబోసుకుంటూ.. "15 ఏళ్ల పాత ఫ్లాట్‌ను భారీ ధర చెల్లించి కొన్నాను. తీరా చూస్తే ఆఫీస్ ఎయిర్‌పోర్ట్ వైపు మారిపోయింది. వారానికి నాలుగు రోజులు ఆఫీస్‌కు రావాలంటున్నారు. ఇప్పుడు ఆ ప్రయాణం నరకంలా అనిపిస్తోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, 2018లో బెల్లందూరులో ఫ్లాట్ కొన్న ఒక వ్యక్తి, కొన్న 14 నెలలకే మరో చోటికి బదిలీ అయ్యారు. "ప్రస్తుతం ఆ ఇల్లు అద్దెకు ఇచ్చాను. కానీ 15-20 ఏళ్ల తర్వాత నా రిటైర్మెంట్ లైఫ్ అక్కడే గడపాలని ప్లాన్ చేసుకున్నాను. అందుకే ఈ తిప్పలు తప్పడం లేదు" అని చెప్పుకొచ్చారు. ఉద్యోగ రీత్యా ఊర్లు మారాల్సి వస్తున్నప్పుడు, కొన్న ఇల్లు భారం కాకూడదంటే దీర్ఘకాలిక ఆలోచన అవసరమని ఈ ఉదాహరణలు చెబుతున్నాయి.

కుటుంబం.. మెట్రో.. సౌకర్యాలు

ప్రయాణం కష్టమైనా సరే, పిల్లల చదువులు, సామాజిక అనుబంధాల కోసం సిటీలోనే ఉండాలని కొందరు భావిస్తున్నారు. "ప్రయాణ సమయం పెరిగినా పర్వాలేదు, పిల్లల స్కూళ్లు మార్చడం ఇష్టం లేక పాత ఏరియాలోనే ఉంటున్నాం" అని ఒక తండ్రి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మెట్రో స్టేషన్లకు దగ్గరగా ఇల్లు తీసుకోవడం వల్ల ఆఫీస్ మారినా ప్రయాణం సులభం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

శివార్ల వైపే మొగ్గు ఎందుకు?

సిటీ సెంటర్‌లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో, యువ జంటలు ఇప్పుడు నగరం వెలుపల ఉన్న వైట్‌ఫీల్డ్ పరిసరాలు, ఉత్తర బెంగళూరు వైపు చూస్తున్నారు.

"సిటీ సెంటర్‌తో పోలిస్తే శివార్లలో ప్రాపర్టీ విలువ 2% ఎక్కువగా పెరుగుతోంది" అని హను రెడ్డి రియాల్టీకి చెందిన కిరణ్ కుమార్ తెలిపారు. భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఇద్దరికీ సమాన దూరంలో ఉండే శివార్లను ఎంచుకోవడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది.

ఉత్తర బెంగళూరులో రియల్ జోరు

అనరాక్ (ANAROCK) సంస్థ గణాంకాల ప్రకారం.. ఉత్తర బెంగళూరులోని దేవనహళ్లి ప్రాంతంలో గత ఆరేళ్లలో ఇళ్ల ధరలు ఏకంగా 49% పెరిగాయి. 2019లో చదరపు అడుగు రూ.4,982 ఉండగా, 2024 నాటికి అది రూ.7,400కు చేరుకుంది. అదే సమయంలో ఎలక్ట్రానిక్ సిటీలో ధరలు 38% మాత్రమే పెరిగాయి.

"మెట్రో విస్తరణ, కొత్త ఫ్లైఓవర్లు, ఐటీ పార్కుల రాకతో హెన్నూరు, దొడ్డబల్లాపూర్ రోడ్ వంటి ప్రాంతాలకు డిమాండ్ పెరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ధరలు ఏడాదికి 8-12% పెరిగే అవకాశం ఉంది" అని క్రెడాయ్ బెంగళూరు మాజీ అధ్యక్షుడు అమర్ మైసూర్ వివరించారు.

నిపుణుల సలహా

బెంగళూరు కొత్తగా వచ్చేవారు ముందుగా అద్దెకు ఉండి, ట్రాఫిక్, ఆఫీస్ లొకేషన్లపై అవగాహన పెంచుకున్నాకే కొనుగోలు నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. 15-20 ఏళ్ల దీర్ఘకాలిక లక్ష్యంతో ఇల్లు కొనేవారికి రిలోకేషన్ సమస్యలు తక్కువగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More