శీతాకాలంలో అత్యంత సుందరంగా బెంగళూరు! ఏరియల్ వీడియో వైరల్..
బెంగళూరులో ఈ ఏడాదిలోనే అత్యంత చల్లని రోజు నమోదైంది. ఈ నేపథ్యంలో పొగమంచు దుప్పటి కప్పిన బెంగళూరు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అవి చూసి నెటిజన్ల ఫిదా అయిపోతున్నారు. నగర అందాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
నిత్యం ట్రాఫిక్, ఉరుకుల పరుగులు జీవితానికి పెట్టింది పేరుగా ఉండే బెంగళూరు మహా నగరం.. ఈసారి, తన శీతాకాలపు అందంతో ఇంటర్నెట్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నగరం అంతా పొగమంచు, శాంతమైన ఉదయపు ఆకాశంతో కప్పి ఉన్న ఏరియల్ వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏరియల్ వ్యూ గల ఈ వీడియో, బెంగళూరును ప్రశాంతమైన శీతాకాలపు కాంతిలో ఆవిష్కరిస్తోంది. నగర దృశ్యాలు పొగమంచులో నెమ్మదిగా కరిగిపోతున్నట్లుగా కనిపిస్తున్నాయి.
ఈ వీడియో నగరంలోని హులిమావు, జయ నగర్, నైస్ రోడ్, సిల్క్ బోర్డ్, బనశంకరి, మాదివాళ, జేపీ నగర్ వంటి ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తూ వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.
ఈ వీడియోను కార్తీక్ సూర్య అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. దానికి, "సహజమైన ఎయిర్ కండిషనింగ్ అంటే ఇదే! శీతాకాలం బెంగళూరును తాకినప్పుడు, పొగమంచు సున్నితమైన అల మాదిరిగా నగరం మీదుగా విస్తరిస్తుంది. చల్లని ఉదయపు కాంతి పొగమంచు గుండా మృదువుగా ప్రకాశిస్తూ, నగరాన్ని ప్రశాంతంగా మారుస్తుంది," అనే క్యాప్షన్ జోడించాడు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన బెంగళూరు ఏరియల్ వ్యూ వీడియోని ఇక్కడ చూడండి:
రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రత!
మీడియా కథనాల ప్రకారం.. నవంబర్ 29, శనివారం రోజున బెంగళూరులో పగటి ఉష్ణోగ్రత కేవలం 21.6°సీకి పడిపోయింది. ఇది సాధారణం కంటే 5.8 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ! అంతేకాదు, నగరంల ఈ ఏడాదిలో ఇదే అత్యంత చల్లని రోజుగా నమోదైంది.
వర్షపాతం లేనప్పటికీ, ఆకాశం అంతా మబ్బులతో కమ్ముకుంది. ఆదివారం ఉదయం కూడా నగరవాసులు చల్లని, మబ్బులు పట్టిన వాతావరణంలో నిద్రలేచారు.
సాధారణంగా రద్దీగా ఉండే ట్రాఫిక్ హడావిడికి దూరంగా, నగరంలోని ప్రశాంతమైన శీతాకాలపు రూపాన్ని ఈ ఏరియల్ ఫుటేజ్ సంపూర్ణంగా బంధించింది.
వీడియోపై నెటిజన్ల స్పందన..
ఈ వీడియో చూసిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు బెంగళూరు వాతావరణాన్ని ప్రశంసించారు. చల్లని గాలి, మృదువైన సూర్యరశ్మి, ఉదయపు పొగమంచు నగరాన్ని అత్యంత అందంగా మార్చాయని వారు వ్యాఖ్యానించారు.
"బెంగళూరు నెమ్మదిగా ఊటీ, కూర్గ్ లాగా మారుతోంది," అని ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ కామెంట్ చేశారు.
"దశాబ్దాల క్రితం బెంగళూరులో ఏడాది పొడవునా ఇలాగే వాతావరణం ఉండేది," అని మరొకరు గుర్తు చేసుకున్నారు.
"చల్లని వాతావరణం గురించి ఫిర్యాదులు చేసినప్పటికీ, ఈ నగరం, ఈ సీజన్ నన్ను రోజురోజుకు మరింత ఆకర్షిస్తున్నాయి," అని ఇంకొకరు వ్యాఖ్యానించారు.
"మీరు తాజాదనం తలుపు తెరిచినప్పుడు (ఇలా ఉంటుంది)," అని మరొక యూజర్ కామెంట్ చేశారు.
ఈ వీడియోకి ఇప్పటికే 4.2 మిలియన్లకు పైగా వ్యూస్, 3.9 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


