Real Estate : రూ. 2 కోట్ల ఇల్లు కొనాలంటే ఆదాయం ఎంత ఉండాలి?

బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇప్పుడు రూ. 2 కోట్ల ధర అనేది సాధారణమైపోయింది. అయితే, ఇంత ఖరీదైన ఇంటిని కొనాలంటే ఒక కుటుంబానికి నెలకు ఎంత ఆదాయం ఉండాలి? ఏ ప్రాంతంలో ఇళ్లులు అందుబాటులో ఉన్నాయి? ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 16, 2026 10:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో సొంత ఇల్లు అనేది ఒకప్పుడు మధ్యతరగతి ప్రజల కల. కానీ నేడు అనేక ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ ధరలు రూ. 2 కోట్ల మార్కును దాటేయడంతో, ఆ కల సాకారం చేసుకోవడం సవాలుగా మారింది. ఈఎంఐ భారం, పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య అసలు ఎంత ఆదాయం ఉంటే రూ. 2 కోట్ల ఇంటిని భరించగలమనే చర్చ ఇప్పుడు ఎక్స్​ (ట్విట్టర్), రెడ్డిట్ వంటి వేదికలపై జోరందుకుంది. మీరు ఒకవేళ బెంగళూరులో ఇల్లు కొనాలని ప్లాన్​ చేస్తుంటే, ఈ ప్రశ్నకు నిపుణుల సమాధానాన్ని ఇక్కడ తెలుసుకోండి..

రూ. 2 కోట్ల ఇల్లు కొనాలంటే ఆదాయం ఎంత ఉండాలి? (Pixabay)
రూ. 2 కోట్ల ఇల్లు కొనాలంటే ఆదాయం ఎంత ఉండాలి? (Pixabay)

బెంగళూరు రియల్​ ఎస్టేట్​- ఆదాయం ఎంత ఉండాలి? ఫైనాన్షియల్ అడ్వైజర్ విశ్లేషణ..

ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ సురేష్ సద్గోపన్ అభిప్రాయం ప్రకారం.. ఇంటి కొనుగోలుదారులు కేవలం ఇంటి స్టిక్కర్ ధరను మాత్రమే చూడకూడదు.

ఆదాయంలో సగం ఖర్చు: ఇంటి ఈఎంఐ, నెలవారీ జీవన వ్యయాలు కలిసి కుటుంబ ఆదాయంలో 50శాతం మించకూడదు.

ఈఎంఐ లెక్క: ఒకరు రూ. 1.6 కోట్ల లోన్ తీసుకుంటే, వడ్డీ రేట్లను బట్టి నెలకు సుమారు రూ. 1.5 లక్షల ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

కనీస జీతం: కుటుంబ అవసరాలకు మరో రూ. 1 లక్ష పక్కన పెడితే, నెలకు కనీసం రూ. 3 లక్షల నికర ఆదాయం ఉంటేనే.. రూ. 2 కోట్ల ఇంటిని సౌకర్యవంతంగా కొనగలరు.

అదనపు ఖర్చులు: స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, ఇంటీరియర్ పనుల కోసం అయ్యే భారీ ఖర్చులను చాలామంది అంచనా వేయరు. వీటిని కూడా ముందే ప్లాన్ చేసుకోవాలి.

డ్యూయల్ ఇన్‌కమ్ (భార్యాభర్తల సంపాదన) ప్లస్ పాయింట్..

ఎక్కువ డౌన్ పేమెంట్ (40-50%) చెల్లించగలిగితే లోన్ భారం తగ్గుతుందని సద్గోపన్ సూచించారు. ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ సంపాదించే కుటుంబాలకు ఇది సులభమవుతుందన్నారు. అయితే, పిల్లల చదువు లేదా ఇతర కారణాల వల్ల ఒకరు ఉద్యోగానికి విరామం ఇస్తే, ఒంటరి ఆదాయంతో ఈఎంఐ కట్టడం రిస్క్ అవుతుందని ఆయన హెచ్చరించారు. బ్యాంక్ లోన్ ఇస్తుందా లేదా అన్నది ముఖ్యం కాదు, మీ జీవనశైలి దెబ్బతినకుండా మీరు ఈఎంఐ కట్టగలరా లేదా అన్నదే కీలకమని ఆయన స్పష్టం చేశారు.

బెంగళూరులో రూ. 2 కోట్ల లోపు ఇళ్లు ఎక్కడ దొరుకుతాయి?

హను రెడ్డి రియాల్టీ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ సమాచారం ప్రకారం.. నగరానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లోనే ఇప్పుడు ఈ బడ్జెట్​లో ఇళ్లు లభిస్తున్నాయి.

నార్త్ అండ్​ వెస్ట్ బెంగళూరు: హెబ్బాల్, కెంపేగౌడ ఎయిర్‌పోర్ట్ మార్గం మరియు కెం గేరి వంటి ప్రాంతాల్లో రూ. 1.5 నుంచి రూ. 2 కోట్ల మధ్య ఆప్షన్లు ఉన్నాయి. రీసేల్ మార్కెట్లో రూ. 1.2 కోట్లకు కూడా కొన్ని ఫ్లాట్లు దొరకవచ్చు.

ఈస్ట్ బెంగళూరు: ఐటీ ఉద్యోగుల డిమాండ్ వల్ల ఇక్కడ ధరలు భారీగా పెరిగాయి. సర్జాపూర్ రోడ్డులో ప్రారంభ ధరలే రూ. 1.5 కోట్లు ఉండగా, వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో రూ. 1.7 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు పలుకుతున్నాయి.

సౌత్ బెంగళూరు: కనకపుర రోడ్డు పరిసరాల్లో రూ. 1.3 - రూ. 1.5 కోట్ల లోపు కొన్ని ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. అయితే నగరం మధ్యలో కాకుండా శివార్లలోనే ఈ ధరలు ఉంటున్నాయి.

వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూ ఆర్బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) ఇటీవలే నిర్ణయం తీసుకుంది. గతంతో పోల్చితే వడ్డీ రేట్లు ప్రస్తుతం తక్కువగానే ఉన్నాయి. ఇది ఇళ్ల కొనుగోలుదారులకు మంచి విషయమే. కానీ ఇళ్ల ధరలు ఎక్కువగా ఉండటమే ఇక్కడ సవాలు అని పలువురు రియల్​ ఎస్టేట్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అఫార్డిబుల్​, మధ్యతరగతి ప్రజలకు ఇంత ఖర్చు చేసి ఇల్లు కొనడం ఇబ్బందిగా మారిందని అంటున్నారు. ఈ సమయంలో రేట్​ కట్​ చేసి ఉంటే రియల్​ ఎస్టేట్​కి మరింత ఊతం లభించి ఉండేదని వెల్లడించారు.