Bengaluru real estate : బెంగళూరులో ఎన్​ఆర్​ఐలు ఎక్కడ ఇన్వెస్ట్​ చేస్తున్నారు?

బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఎన్​ఆర్​ఐల పెట్టుబడులు జోరందుకున్నాయి. ముఖ్యంగా అమెరికాలో నివసించే భారతీయులు ఐటీ కారిడార్లలో ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మెరుగైన అద్దె ఆదాయం, దీర్ఘకాలిక లాభాలే లక్ష్యంగా ఉత్తర, తూర్పు బెంగళూరు ప్రాంతాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి.

Published on: Feb 15, 2026 8:15 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాఫ్ట్‌వేర్ రాజధాని బెంగళూరులో రియల్ ఎస్టేట్ రంగం సరికొత్త ఊపును సంతరించుకుంది. కేవలం స్థానికులే కాదు, విదేశాల్లో స్థిరపడిన భారతీయులు (ఎన్​ఆర్​ఐలు) సైతం ఇప్పుడు బెంగళూరులో ఇళ్లను కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు! ప్రధానంగా అమెరికాలో ఉంటున్న ఎన్నారైలు బెంగళూరులోని ఐటీ ఎకోసిస్టమ్‌తో ఉన్న అనుబంధం, రూపాయి విలువతో పోలిస్తే డాలర్ అడ్వాంటేజ్ వంటి అంశాలతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం సురక్షితమని భావిస్తున్నారు. భవిష్యత్తులో తిరిగి భారత్‌కు వచ్చే ఆలోచన ఉన్నవారు, రిటైర్మెంట్ ప్లాన్స్‌లో భాగంగా ముందస్తుగానే ఇక్కడ సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటున్నారు. మరి బెంగళూరులో ఎన్​ఆర్​ఐలు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు? ఇక్కడ తెలుసుకోండి..

బెంగళూరు రియల్​ ఎస్టేట్​ న్యూస్​..
బెంగళూరు రియల్​ ఎస్టేట్​ న్యూస్​..

అమెరికా ఎన్​ఆర్​ఐలదే అగ్రస్థానం!

బెంగళూరు రెసిడెన్షియల్ మార్కెట్‌లో జరుగుతున్న విదేశీ లావాదేవీల్లో అమెరికా ఎన్​ఆర్​ఐల వాటానే అత్యధికంగా ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

"నా దగ్గరకు వచ్చే ఎన్​ఆర్​ఐ క్లయింట్లలో చాలామంది భవిష్యత్తులో ఇండియాకు తిరిగి రావాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. అందుకే ఇక్కడ ఇల్లు కొనాలని ప్లాన్​ చేస్తున్నారు," అని బ్రోకర్‌ఇన్‌బ్లూ చీఫ్ రియల్ ఎస్టేట్ ఆఫీసర్ మంజేశ్ ఎస్. రావు పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో అమెరికాలో ఉంటూనే అపార్ట్‌మెంట్లను బుక్ చేసుకుంటున్నారని, కేవలం రిజిస్ట్రేషన్ పనుల కోసం మాత్రమే భారత్‌కు వస్తున్నారని ఆయన వివరించారు.

హాట్ కేకుల్లా ఉత్తర బెంగళూరు ప్రాంతాలు..

మౌలిక సదుపాయాల అభివృద్ధి, అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం, పెరుగుతున్న వాణిజ్య కార్యకలాపాల వల్ల ఉత్తర బెంగళూరు ఇప్పుడు పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారిందని రియల్​ ఎస్టేట్​ నిపుణులు చెబుతున్నారు.

సాధారణ అపార్ట్‌మెంట్లు: ఇక్కడ 2బీహెచ్​కే అపార్ట్‌మెంట్ ధర సుమారు రూ. 1 కోటి నుంచి ప్రారంభమవుతోంది. వీటికి నెలకు రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు అద్దె లభిస్తోంది.

లగ్జరీ సెగ్మెంట్: విలాసవంతమైన అపార్ట్‌మెంట్ల ధర రూ. 2 కోట్ల వరకు ఉండగా, నెలకు రూ. 50,000 నుంచి రూ. 60,000 వరకు అద్దె వస్తోంది. సీనియర్ ప్రొఫెషనల్స్, విదేశీయులు ఇక్కడ నివసించేందుకు మొగ్గు చూపుతున్నారు.

కొత్త ఏరియాలు: తానిసంద్ర, హెన్నూరు, బాగలూరు వంటి ప్రాంతాల్లో కనెక్టివిటీ పెరగడంతో పెట్టుబడిదారులు అటువైపు చూస్తున్నారు.

హెబ్బాల్: ఇక్కడ గజం ధర (చదరపు అడుగుకు) రూ. 10,000 నుంచి రూ. 12,000 వరకు పలుకుతోంది. దీనితో 2బీహెచ్​కే ధర రూ. 1.25 కోట్లను దాటుతోంది.

అమెజాన్ ఇండియా, శాప్ ల్యాబ్స్, విప్రో వంటి దిగ్గజ సంస్థలు ఉత్తర బెంగళూరులో తమ కార్యాలయాలను విస్తరిస్తుండటం ఎన్​ఆర్​ఐలను మరింత ఆకర్షిస్తోంది. సబర్బన్ రైలు నెట్‌వర్క్, పెరిఫెరల్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులు భవిష్యత్తులో ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చనున్నాయి.

తూర్పు బెంగళూరులోనూ అదే జోరు..

ఐటీ హబ్‌గా పేరుగాంచిన తూర్పు బెంగళూరులోని వర్తూర్, పానత్తూరు వంటి ప్రాంతాల్లో ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు ఇక్కడ ఆసక్తి చూపుతున్నారు.

ధరలు అండ్​ లాభాలు: ఈ ప్రాంతాల్లో 2బీహెచ్​కే ధర రూ. 1 కోటి వరకు ఉండగా, ఏడాదికి 15-20% వరకు మూలధన వృద్ధి కనిపిస్తోంది. విశాలమైన ఇళ్లు కోరుకునే వారు రూ. 3 కోట్లు వెచ్చించి 3బీహెచ్​కే యూనిట్లను కొనుగోలు చేస్తున్నారు.

వైట్‌ఫీల్డ్: ఇక్కడ డిమాండ్ విపరీతంగా ఉండటంతో 2బీహెచ్​కే ధర ఇప్పటికే రూ. 2 కోట్లకు చేరుకుంది. ఐటీ పార్కులకు దగ్గరగా ఉండటంతో ఇక్కడ అద్దెలు కూడా రూ. 50,000 స్థాయిలో ఉన్నాయి.

బెల్లందూరు: వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటం వల్ల పొరుగు ప్రాంతాల కంటే ఇక్కడ ధరలు 20% ఎక్కువగా ఉన్నాయని హను రెడ్డి రియాల్టీ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ తెలిపారు.

మొత్తానికి.. బెంగళూరులో ఐటీ రంగం విస్తరిస్తున్న కొద్దీ, ఎన్నారైలకు ఇది కేవలం పెట్టుబడి సాధనంగానే కాకుండా, తమ మాతృభూమిలో ఒక శాశ్వత చిరునామాగా మారుతోంది.

ప్రశ్నలు- సమాధానాలు :-

ప్రశ్న- బెంగళూరులో ఎన్​ఆర్​ఐలు పెట్టుబడి పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటి?

సమాధానం- బెంగళూరు గ్లోబల్ ఐటీ హబ్‌గా ఉండటం వల్ల ఇక్కడ ప్రాపర్టీ విలువలు స్థిరంగా పెరుగుతాయి. రూపాయి విలువతో పోలిస్తే డాలర్ బలంగా ఉండటం ఎన్​ఆర్​ఐలకు కలిసివచ్చే అంశం. దీనికి తోడు, మెరుగైన అద్దె ఆదాయం, భవిష్యత్తులో తిరిగి వచ్చి సెటిల్ అవ్వాలనే ఆలోచన ప్రధాన కారణాలు.

ప్రశ్న- ప్రస్తుతం బెంగళూరులో ఏ ప్రాంతాలు పెట్టుబడికి అనువైనవి?

ప్రస్తుతం ఉత్తర బెంగళూరు (దేవనహళ్లి, హెబ్బాల్, తానిసంద్ర), తూర్పు బెంగళూరు (వైట్‌ఫీల్డ్, సర్జాపూర్, వర్తూర్) అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఉత్తర బెంగళూరు విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం, తూర్పు బెంగళూరు ఐటీ కంపెనీల నిలయం కావడంతో ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది.