భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం ఎస్‌యూవీల హవా నడుస్తున్నప్పటికీ, బడ్జెట్ అండ్ కాంపాక్ట్ సెడాన్ కార్లకు ఉన్న ఆదరణ తగ్గలేదని ఆగస్టు నెల విక్రయాల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆగస్టు 2026లో దేశవ్యాప్తంగా మొత్తం 32,913 సెడాన్ కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఆగస్టులో నమోదైన 28,451 యూనిట్లతో పోలిస్తే ఇది 15.7 శాతం బలమైన వృద్ధి.

మరి మీరు కూడా మంచి సెడాన్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇండియాలో ప్రస్తుతం బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ వివరాలను ఇక్కడ చూసేయండి.
సెడాన్ రారాజు మారుతీ సుజుకీ డిజైర్!
సెడాన్ సెగ్మెంట్‌ను మారుతీ సుజుకీ డిజైర్ శాసిస్తోందనే చెప్పుకోవాలి. ఆగస్టు నెలలో అమ్ముడైన ప్రతి రెండు సెడాన్లలో ఒకటి డిజైర్ కారే కావడం విశేషం! గత ఏడాది ఆగస్టులో 16,509 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి 11.6 శాతం వృద్ధితో 18,418 యూనిట్లకు విక్రయాలు చేరాయి. మొత్తం సెడాన్ మార్కెట్లో ఏకంగా 56.0 శాతం వాటాను ఈ ఒక్క మోడలే కైవసం చేసుకుంది. మధ్యతరగతి కుటుంబాలకు అనువైన ఇంధన సామర్థ్యం (మైలేజ్), తక్కువ నిర్వహణ ఖర్చు ఈ స్థాయిలో విక్రయాలు పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఆ తర్వాత హ్యుందాయ్, హోండా..
ఈ విభాగంలో హ్యుందాయ్ ఆరా రెండో స్థానంలో నిలిచింది. ఆరా కారు 25.3 శాతం వృద్ధితో 6,685 యూనిట్ల విక్రయాలు సాధించి, 20.3 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది.
ఇక మూడో స్థానంలో ఉన్న హోండా అమేజ్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ అసాధారణ వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఆగస్టులో 1,753 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈసారి ఏకంగా 100.3 శాతం పెరిగి 3,512 యూనిట్లకు చేరుకుంది. దీనితో తన మార్కెట్ వాటాను 10.7 శాతానికి పెంచుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. డిజైర్, ఆరా, అమేజ్ ఈ మొదటి మూడు మోడళ్లు కలిపి మొత్తం సెడాన్ విక్రయాల్లో ఏకంగా 87 శాతాన్ని ఆక్రమించాయి.
ప్రీమియం సెడాన్ల పరిస్థితి ఏంటి?
కాంపాక్ట్ సెడాన్లు జోరు మీదుండగా, ప్రీమియం అండ్ మిడ్‌సైజ్ సెడాన్ల అమ్మకాలు కొంత నెమ్మదించాయి.
{{/usCountry}}కాంపాక్ట్ సెడాన్లు జోరు మీదుండగా, ప్రీమియం అండ్ మిడ్‌సైజ్ సెడాన్ల అమ్మకాలు కొంత నెమ్మదించాయి.
{{/usCountry}}నాలుగో స్థానంలో ఉన్న వోక్స్‌వాగన్ వర్టస్ 1,301 యూనిట్ల సేల్స్‌తో 22.3 శాతం క్షీణతను చవిచూసింది.
స్కొడా స్లావియా 897 యూనిట్లతో ఐదో స్థానంలో నిలవగా (11 శాతం తగ్గుదల), ఆరో స్థానంలో ఉన్న టాటా టిగోర్ 862 యూనిట్లతో (7.1 శాతం వృద్ధి) స్లావియాకు గట్టి పోటీ ఇచ్చింది.
మరోవైపు హ్యుందాయ్ వెర్నా విక్రయాలు ఏకంగా 31.4 శాతం పడిపోయి 529 యూనిట్లకు పరిమితమయ్యాయి. విక్రయాలు సగానికి పైగా తగ్గిన మోడళ్లలో వెర్నా నిలిచింది.
హోండా సిటీకి సంబంధించి గత నెలలో 514 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది (437)తో పోల్చితే ఇది 17.6శాతం ఎక్కువ.
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే వినాయక చవితి, దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఆటోమొబైల్ కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించనుండటంతో సెడాన్ల విక్రయాలు మరింత పుంజుకుంటాయని అంచనాలు ఉన్నాయి.