...
...
Next Story

భరత్ తివారీ ఎన్‌కౌంటర్: బిహార్ సీఎస్, డీజీపీలకు మానవ హక్కుల కమిషన్ నోటీసులు

భోజ్‌పూర్ జిల్లాలో జరిగిన భరత్ భూషణ్ తివారీ ఎన్‌కౌంటర్ కేసు తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన మానవ హక్కుల కమిషన్ బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Published on: Jun 23, 2026, 14:22:00 IST
Advertisement

భోజ్‌పూర్ జిల్లా షాపూర్ పరిధిలోని బిలౌతీ గ్రామంలో జరిగిన భరత్ భూషణ్ తివారీ ఎన్‌కౌంటర్ ఉదంతం బిహార్ రాజకీయాన్ని, పోలీస్ శాఖను తీవ్రంగా కుదిపేస్తోంది. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యయ్ అమృత్, డీజీపీతో పాటు భోజ్‌పూర్ ఎస్ఎస్‌పీలకు కమిషన్ నోటీసులు పంపింది.

నాలుగు వారాల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలి

భరత్ భూషన్ తివారీ ఎన్‌కౌంటర్ కు నిరసనగా జన్ సురాజ్ పార్టీ నిరసనలు (Pappi Sharma)
భరత్ భూషన్ తివారీ ఎన్‌కౌంటర్ కు నిరసనగా జన్ సురాజ్ పార్టీ నిరసనలు (Pappi Sharma)

భరత్ భూషణ్ తివారీ ఎన్‌కౌంటర్ కేసులో విచారణ సాగుతున్న వేళ, బాధితుడి కుటుంబ సభ్యులు న్యాయం కోసం పోరాడుతున్నారు. తమ కుమారుడు పోలీసులకు లొంగిపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపారని వారు ఆరోపిస్తున్నారు. బాధ్యులైన పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మానవ హక్కుల కమిషన్, నాలుగు వారాల వ్యవధిలోగా పూర్తి నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. సోమవారం నాడు కమిషన్ చైర్మన్ జస్టిస్ ఏఎం బదర్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

ఫేక్ ఎన్‌కౌంటర్ అంటూ కమిషన్‌కు ఫిర్యాదు

ముజఫర్‌పూర్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాది ఎస్‌కే ఝా జూన్ 20న మానవ హక్కుల కమిషన్‌కు ఈ విషయమై అధికారికంగా ఫిర్యాదు చేశారు. భోజ్‌పూర్ పోలీసులు కావాలనే ఫేక్ ఎన్‌కౌంటర్ చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జూన్ 17న కాశీనాథ్ తివారీ కుమారుడైన భరత్ భూషణ్ తివారీని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘనేనని ఆయన స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, తప్పు చేసిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

రంగంలోకి విచారణ కమిషన్, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాలు

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గానూ ఒక ఎస్‌హెచ్వో, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఒక ఏఎస్ఐ, ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు ఏడీజీ ధృవీకరించారు. జూన్ 16న నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులు సరైన పద్ధతి అనుసరించలేదని, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిందని ఆయన అంగీకరించారు. "ఎన్‌కౌంటర్‌ను మేమెప్పుడూ ఒక గొప్ప విజయంగా భావించం. కానీ పోలీసుల ప్రాణాలకే ముప్పు పొంచి ఉన్నప్పుడు, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వస్తుంది. ఆ క్రమంలోనే ఎదుటి వ్యక్తికి బుల్లెట్లు తగులుతాయి. ప్రస్తుతానికి ఈ వ్యవహారం జ్యుడీషియల్ కమిషన్ పరిధిలో ఉన్నందున పోలీస్ శాఖ తరఫున మరిన్ని వ్యాఖ్యలు చేయడం సరికాదు" అని సుధాంశు కుమార్ స్పష్టం చేశారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe