...
...
Next Story

Bharti Airtel share : జీవితకాల గరిష్ఠానికి ఎయిర్​టెల్​ షేరు ధర..

ఎయిర్‌టెల్ షేర్ ధర రికార్డు గరిష్ఠాన్ని తాకింది. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ లాభాలతో దూకుడు కొనసాగిస్తోంది. సంస్థ ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు ఇందుకు కారణం.

Published on: Nov 04, 2025 12:20 PM IST
Advertisement

భారతీ ఎయిర్‌టెల్ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన మరుసటి రోజు, అంటే మంగళవారం (నవంబర్ 4) ఇంట్రాడే ట్రేడింగ్‌లో కంపెనీ షేరు ధర రికార్డు గరిష్ఠ స్థాయి రూ. 2,135.75 కి చేరుకుంది. అంతకుముందు క్లోజింగ్ ధర రూ. 2,073.75 తో పోలిస్తే, ఈరోజు రూ. 2,100 వద్ద 3 శాతం జంప్​ని చూసింది! బలహీనమైన మార్కెట్ సెంటిమెంట్‌ను ధిక్కరిస్తూ, క్యూ2ఎఫ్​వై26లో కంపెనీ ఏకీకృత లాభంలో ఏకంగా 89 శాతం వృద్ధిని నమోదు చేయడంతో ఎయిర్​టెల్​ షేరు ధర ఈ కొత్త గరిష్ఠాన్ని తాకింది.

దూసుకెళుతున్న ఎయిర్​టెల్​ షేరు ధర.. (Agencies)
దూసుకెళుతున్న ఎయిర్​టెల్​ షేరు ధర.. (Agencies)

మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎయిర్​టెల్​ షేర్లు 2.07శాతం లాభంతో రూ.2,117 వద్ద ట్రేడ్​ అవుతున్నాయి.

మరోవైపు, భారతీ ఎయిర్‌టెల్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. తమ అనుబంధ సంస్థ అయిన ఇండస్ టవర్స్​లో 5 శాతం వరకు అదనపు వాటాను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దశల్లో కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రకటన కూడా స్టాక్ పట్ల మదుపరుల సెంటిమెంట్‌ను సానుకూలంగా ప్రభావితం చేసింది.

నవంబర్ 3న స్టాక్ ఎక్స్​ఛేంజ్‌కు దాఖలు చేసిన ఫైలింగ్‌లో కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. "బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా అధికారికంగా ఆమోదించబడిన ఒక ప్రత్యేక డైరెక్టర్ల కమిటీ, అనుబంధ సంస్థ అయిన ఇండస్ టవర్స్ లిమిటెడ్‌లో 5 శాతం వరకు అదనపు వాటాను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దశల్లో కొనుగోలు చేయడానికి ప్రారంభ ఆమోదం ఇచ్చింది" అని కంపెనీ పేర్కొంది.

"టెలికాం రంగానికి కీలకమైన మౌలిక సదుపాయాల సేవలను ఇండస్ టవర్స్ అందిస్తుంది. వ్యూహాత్మక ప్రాముఖ్యత దృష్ట్యా, మాతృ సంస్థ అయిన భారతీ ఎయిర్‌టెల్ తన వ్యాపార మూలధన వ్యయాలు, డివిడెండ్ చెల్లింపుల కోసం నగదు ప్రవాహ అవసరాలను నిర్వహిస్తూనే, ఇండస్ టవర్స్‌లో తన వాటాను స్థిరీకరించే అవకాశాలను నిరంతరం అంచనా వేయడం వివేకవంతమైన నిర్ణయం," అని ఎయిర్​టెల్​ కంపెనీ వివరించింది.

తాజా పరిణామాల మధ్య ఇండస్ టవర్స్ షేరు ధర మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో దాదాపు 4 శాతం పెరిగి ఇంట్రాడే గరిష్ఠ స్థాయి రూ. 396.95 కి చేరుకుంది. మునుపటి క్లోజింగ్ ధర రూ. 382.70తో పోలిస్తే, ఈ స్టాక్​ రూ. 389.65 వద్ద ప్రారంభమైంది.

భారతీ ఎయిర్‌టెల్ క్యూ2 ఫలితాల ముఖ్యాంశాలు..

క్యూ2ఎఫ్​26లో భారతీ ఎయిర్‌టెల్ సాధించిన ఏకీకృత ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి:

గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 3,593.2 కోట్లుగా ఉన్న ఏకీకృత లాభం, ఈసారి 89 శాతం పెరిగి రూ. 6,791.7 కోట్లకు చేరింది.

కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం సంవత్సరానికి 25.7 శాతం పెరిగి రూ. 52,145.4 కోట్లకు (గత ఏడాది రూ. 41,473.3 కోట్లు) చేరింది.

క్యూ2ఎఫ్​వై26లో ఎయిర్‌టెల్ ఎబిటా 35.9 శాతం పెరిగి రూ. 29,919 కోట్లుగా నమోదైంది. ఎబిటా మార్జిన్ 53.1 శాతం నుంచి 57.4 శాతానికి పెరిగింది.

ఆర్పూ గతేడాది రూ. 233 నుంచి సంవత్సరానికి రూ. 23 పెరిగి రూ. 256 కి చేరుకుంది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe